తీవ్ర చలి.. ఐదుగురు ట్రెక్కర్లు మృతి
13 మందిని రక్షించిన రెస్క్యూ బృందాలు మరో నలుగురి కోసం గాలింపు తీవ్రతరం
డెహ్రాడూన్: తీవ్ర చలి కారణంగా ఉత్తరాఖండ్ మంచు పర్వతాల్లో ట్రెక్కింగ్ చేస్తున్న ఔత్సాహికులు ఐదుగురు మృతిచెందారు. 4400 మీటర్ల ఎత్తులో ఉన్న సహస్త్రాటల్ ట్రెక్కింగ్ మార్గంలో వెళ్లిన 22 మంది సభ్యుల బృందంలో, ఐదుగురు తీవ్ర చలికారణంగా బుధవారం మృతి చెందినట్లు అధికార వర్గాలు ప్రకటించారు. వీరంతా కర్ణాటక, మహారాష్ర్టకు చెందిన ట్రెక్కర్లుగా అధికారులు తెలిపారు. విషయం తెలుసుకున్న వెంటనే సహాయక బృందాలు వెంటనే రంగంలోకి దిగి 13 మందిని సురక్షితంగా రక్షించారు. ఐదుగురు మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. మరో నలుగురి కోసం తీవ్ర గాలింపు చర్యలు చేపట్టారు. రెస్క్యూ చర్యల్లో హెలికాప్టర్ ద్వారా బాధితులను డెహ్రాడూన్ లోని ఆసుపత్రికి తరలించారు. ఈ బృందం చిక్కుకున్నట్లుగా ఉత్తరకాశీ అర్బన్ ఎస్పీ యదువంశీకి సమాచారం అందింది. వెంటనే స్పందించిన ఆయన ఎస్డీఆర్ఎఫ్, పోలీసు, అటవీశాఖ, విపత్త నిర్వహణలో కలిసి సంయుక్తంగా వారిని కాపాడే చర్యలకు పెద్ద ఎత్తున దిగడంతో చాలామంది ప్రాణాలతో బయటపడ్డారు. కాగా టెక్కింగ్ బృందంలోని సభ్యులను కాపాడేందుకు స్థానికంగా ఉండే సిల్లా గ్రామ ప్రజలు బృందాలకు సహాయం అందించాయి.