రూ. 10 లక్షల కోట్ల మొండిబకాయిలు రికవరీ
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్
- బ్యాంకుల మోసం.. రూ. 64,920 కోట్లు స్వాధీనం
- 2014–23 వరకు రూ. 15,183 కోట్ల స్థిరాస్థులు జప్తు
- పారిశ్రామిక వేత్తలకు రుణామాఫీ లేదు
- బ్యాంకింగ్ రంగం రూ. 3 లక్షల కోట్ల లాభం సంతోషం
- ఆర్థికంగా కాంగ్రెస్ పాలనలోనే అధోగతి
- కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్
నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: రూ. 10 లక్షల కోట్ల మొండిబకాయిలను బ్యాంకులు రికవరీ చేశాయని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. అదే సమయంలో 1105 బ్యాంకులను మోసం చేసిన వారిపై ఈడీ చేసిన దాడుల్లో రూ. 64,920 కోట్ల రూపాయలు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ శుక్రవారం సామాజిక మాధ్యమం ట్విట్టర్ లో ఈ విషయాన్ని తెలిపారు. ఈ మొండిబకాయిలన్నీ 2014 నుంచి 2023 కాలానికి చెందినవన్నారు. డిసెంబర్ 2023 నాటికి రూ. 15, 183 కోట్ల స్థిరాస్థులను కూడా బ్యాంకులు స్వాధీనం చేసుకున్నాయని తెలిపారు.
బడా పారిశ్రామిక వేత్తలకు ఇచ్చిన రుణాలను మాఫీ చేయడం లేదని తెలిపారు. వారికి రుణమాఫీ చేసినట్లు వస్తున్న వార్తలను ఖండించారు. అయితే రుణాల రికవరీలో బ్యాంకులు ఆర్బీఐ మార్గదర్శకాలను పాటించడం వల్ల ఆలస్యం ఏర్పడుతుందన్నారు. ఎగవేతదారులకు ఎలాంటి సడలింపులు ఇవ్వబోమని నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. రుణాల రికవరీ ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందన్నారు. 2023–24లో దేశీయ బ్యాంకింగ్ రంగం రూ. 3 లక్షల కోట్ల లాభాన్ని దాటడం సంతోషకరమని తెలిపారు.
కాంగ్రెస్ ప్రభుత్వం 2014 కంటే ముందున్న స్వార్థ ప్రయోజనాలకు విరుద్ధంగా తమ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. వారి హయాంలో మొండిబకాయిలు పేరుకుపోయాయని, స్వార్థ ప్రయోజనాలు, అవినీతి, నిర్వహణ లోపాలతో వారి పాలనంతా కొనసాగిందని మండిపడ్డారు. ఇవన్ని నివేదికలను వారు బయటి ప్రపంచానికి తెలియకుండా దాచరని నిర్మలమ్మ ఆరోపించారు. రఘురామ రాజన్, ఉర్జిత్ పటేల్ లు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో జరిగిన ఆర్థిక కార్యకలాపాలపై తీవ్రంగా మండిపడ్డారన్న విషయాన్ని నిర్మలా సీతారామన్ గుర్తు చేశారు.