దుఃఖ సమయంలో రాజకీయాలా?
కాంగ్రెస్ పార్టీకి బీజేపీ ఎంపీ సుధాంశు చురకలు
స్మారక స్థలంపై వివాదం సృష్టించొద్దు
ప్రతీ ఒక్కరినీ గౌరవించుకుంటాం
సమాధి నిర్మాణంపై ఖర్గేకు అమిత్ షా తెలిపారు
అభివృద్ధికి పునాది వేసిన మహానీయుడు డా. మన్మోహన్ సింగ్
భూసేకరణ, ట్రస్టు ఏర్పాటు, భూ బదలాయింపు పూర్తవగానే పనులు చేపడతాం
నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: మాజీ ప్రధాని డా. మన్మోహన్ సింగ్ స్మారక స్థలంపై వివాదం సృష్టించొద్దని బీజేపీ ఎంపీ సుధాంశు త్రివేది కాంగ్రెస్ పై మండిపడ్డారు. ఆయన మృతిని కూడా రాజకీయాలకు వాడుకోవడం పట్ల కాంగ్రెస్ పార్టీ నాయకులు, విధానాలపై అగ్గిమీద గుగ్గిలమయ్యారు. శనివారం సుధాంశు త్రివేది స్మారక స్థలం వివాదంపై స్పందించారు.
ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం అన్ని పార్టీల నేతలకు గౌరవం ఇచ్చిందన్నారు. త్వరలోనే మాజీ ప్రధాని డా. మన్మోహన్ సింగ్ సమాధి నిర్మాణ పనులు కూడా జరుగుతాయన్నారు. మన్మోహన్ కు గౌరవం ఇచ్చేందుకు ఎన్డీయే ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. దేశ ఆర్థికాభివృద్ధికి గొప్ప పునాది వేసిన మన్మోహన్ సింగ్ జ్ఞాపకార్థం స్మారక స్థలం, సమాధి నిర్మాణంపై మంత్రివర్గ సమావేశంలో నిర్ణయించామన్నారు. ఈ విషయాన్ని స్వయానా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖార్గేకు చెప్పినా రాజకీయ వివాదం ఎందుకు సృష్టిస్తున్నారని నిలదీశారు. దేశమంతా దుఃఖంలో ఉన్న సమయంలో కాంగ్రెస్ రాజకీయాలు చేయడం మానుకోవాలన్నారు. ఆయన జీవించి ఉన్నప్పుడు ఏనాడూ గౌరవించని కాంగ్రెస్ మరణానంతరం రాజకీయాలకు తెరదీయడం దురదృష్టకరమన్నారు. పదేళ్లపాటు సుధీర్ఘ ప్రధానిగా దేశానికి సేవలందించిన మహోన్నత వ్యక్తి డా. మన్మోహన్ సింగ్ అన్నారు. కనీసం ఇలాంటి సమయంలోనైనా రాజకీయ వివాదాలు, ప్రకటనలకు దూరం ఉండాలన్నారు.
మోదీ ప్రభుత్వం సెంటిమెంట్ లకు అతీతంగా ఎదిగిందన్నారు. ప్రతీ నాయకుడికి గౌరవం ఇచ్చిందన్నారు. భూసేకరణ, ట్రస్టు ఏర్పాటు, భూ బదలాయింపు వంటి ప్రక్రియలు పూర్తవ్వగానే స్మారక సమాధి పనులు చేపడతామన్నారు. ఇందులో రాజకీయం చేయడానికి ఏముందని సుధాంశు త్రివేది కాంగ్రెస్ పార్టీ నేతల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.