అణు శాస్త్రవేత్త రాజగోపాల్ కన్నుమూత
Nuclear scientist Rajagopal passes away
విచారం వ్యక్తం చేసిన ప్రధాని మోదీ
నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: సీనియర్ అణు శాస్త్రవేత్త డాక్టర్ రాజగోపాల్ చిదంబరం (88) శనివారం కన్నుమూశారు. ఈయన పోఖ్రాన్ 1, 2 అణు పరీక్షల్లో కీలకంగా వ్యవహరించారు. చిదంబరం ముంబాయిలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. రాజగోపాల్ మృతి పట్ల ప్రధాని మోదీ సంతాపం వ్యక్తం చేశారు. అణు కార్యక్రమాల్లో వ్యూహాత్మక సామర్థ్యాలను బలోపేతం చేశారన్నారు. ఆయన గణనీయమైన కృషిని చరిత్ర ఎప్పుటికీ మరిచిపోదన్నారు. మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు.
రాజగోపాల్ 1936 నవంబర్ 11న చెన్నైలో జన్మించారు. 1975లో పద్మశ్రీ, 1999లో పద్మవిభూషణ్ అందుకున్నారు. బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ (బార్క్) డైరెక్టర్‌గా, అటామిక్ ఎనర్జీ కమిషన్ (ఎఇసీ) ఛైర్మన్‌గా, డిపార్ట్‌మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ (డీఎఇ) కార్యదర్శిగా పనిచేశారు. అంతర్జాతీయ అణుశక్తి సంస్థ (ఐఎఇఎ) బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ ఛైర్మన్‌గా కూడా పనిచేశారు.