పంది కిడ్నీ మానవుడికి.. రెండు నెలల తరువాత వ్యక్తి మృతి
కిడ్నీ మార్పిడి కారణం కాదంటున్న వైద్యులు
వాషింగ్టన్: అమెరికాలో రెండు నెలల క్రితం పంది కిడ్నీ (మూత్రపిండాల)ని మార్పిడి చేయించుకున్న వ్యక్తి రిచర్డ్ రిక్ స్లేమాన్ (62) మృతిచెందాడు. అయితే అతని మృతికి కిడ్ని మార్పిడి ఫెయిల్యూర్ కాదని వైద్యులు ఆదివారం ప్రకటించారు. కిడ్ని మార్పిడి ఆపరేషన్ విజయవంతంగా జరిగిందన్నారు. ప్రపంచంలో తొలిసారిగా పంది కిడ్నీని మనిషికి అమెరికా వైద్యులు అమర్చారు. అంతకుముందు ఇద్దరికి పంది గుండెను కూడా మార్చారు. కానీ ఈ శస్ర్త చికిత్సలు విజయవంతం కాలేదు. కాగా రిచర్డ్ కు కిడ్నీ మార్పిడి 2018లో తొలిసారిగా జరిగింది. ఆ కిడ్నీ పూర్తిగా ఫెయిల్యూర్ కావడంతో డయాలసిస్ తో అతని ప్రాణాలను రక్షించారు. రెండు నెలలక్రితమే రిచర్డ్ కు కిడ్నీని వైద్యులు విజయవంతంగా శస్ర్తచికిత్స ద్వారా మార్పిడి చేశారు. దీంతో వైద్యరంగంలో మరో నూతన శకం ఆరంభమైనట్లుగా కూడా వైద్యులు ప్రకటించారు. కానీ అనతి కాలంలోనే రిచర్డ్ మరణంతో జంతువుల భాగాలు మనిషికి అమర్చే ప్రక్రియపై పలు అనుమానాల నీలినీడలు కమ్ముకుంటున్నాయి.