నిహాన్ హిడాంకియోకు నోబెల్ శాంతి–2024 బహుమతి
అణ్వాయుధాలకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్న సంస్థ
స్టాక్ హోమ్: 2024 నోబెల్ పురస్కారాన్ని శాంతి కోసం కృషి చేసినందుకు గాను జపాన్ కు చెందిన నిహాన్ హిడాంకియో సంస్థకు లభించింది. ఈ మేరకు శుక్రవారం శాంతి బహుమతిపై భేటీ అయిన రాయల్ స్వీడీష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ కమిటీ అణ్వాయుధాలకు వ్యతిరేకంగా ఈ సంస్థ చాలాకాలంగా చేస్తున్న ప్రచారాన్ని గుర్తించింది. ఈ మేరకు నోబెల్ శాంతి పురస్కారం–2024లో నిహాన్ హిడాంకియోను ఎంపిక చేసినట్లు కమిటీ చైర్మన్ అండర్స్ ఓల్సన్ ప్రకటించారు. హిరోషిమా, నాగసాకిల దాడుల్లో సర్వస్వం కోల్పోయి ప్రాణాలతో మిగిలిన కొద్ది మంది చేత స్థాపించబడినదే ఈ సంస్థ. ఈ సంస్థ ద్వారా అణ్వాయుధాలను ఉపయోగించరాదని ప్రపంచదేశాల్లో ప్రచారాన్ని నిర్వహించే బాధ్యతను తలకెత్తుకుంది. దేశాల ఆలోచనల్లో మార్పు కూడా తీసుకువచ్చింది.
అణ్వాయుధాలు ఎంత ప్రమాదకరమో కొత్త తరాలకూ వివరించి చెబుతూ ఈ సంస్థ ప్రచారం చేస్తుంది. ఈ ఏడాది నోబెల్ పురస్కారాలకు విభిన్న రంగాల్లో ప్రముఖులకు చెందిన 286 అభ్యర్థుల దరఖాస్తులను రాయల్ స్వీడీష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ స్వీకరించింది. ఇందులో 89 సంస్థలు కూడా ఉన్నాయి.