‘ట్రంప’రితనానికి బ్రేకుల్లేవ్!
No brakes on 'Trumpism'!

రూ. 350 లక్షల కోట్ల నష్టం!
నా తెలంగాణ, సెంట్రల్ డెస్క్: ట్రంప్ ట్రెంపరితనానికి ప్రపంచవ్యాప్తంగా రూ. 350 లక్షల కోట్లు నష్టం వాటిల్లింది. దుందుడుకు నిర్ణయాలు, అభాసుపాలు చేసే వ్యాఖ్యలు, యుద్ధాలలో జోక్యం, హెచ్చరికలు, కాదంటే ఖతమే అనేలా వ్యవహరించడం, ప్రపంచదేశాలపై సుంకాల పేరుతో కయ్యానికి కాలు దువ్వడం, తమ ఆర్థిక స్థితిని మెరుగుపర్చుకునేందుకు చేసిన ఇలాంటి ఆవేశపూరిత, అనాలోచిత వ్యాఖ్యల వల్ల ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు భారీ ఎత్తున నష్టం వాటిల్లింది. దీంతో ప్రపంచపదేశాలు తలలు పట్టుకుంటున్నాయి. ట్రంప్ ట్రెంపరితనానికి మనం బలైపోయామే అనే సందిగ్ధంలో పడ్డాయి. పలుమార్లు ఆ దేశాలు కూడా అమెరికాకు బహిరంగంగానే హెచ్చరికలు జారీ చేశాయి. చూసుకుందాం అంటే చూసుకుందాం అనే వరకు పరిస్థితిలు వెళ్లినా ట్రంపరితనానికి బ్రేకులు పడడం లేదు.
ట్రంప్ వ్యాఖ్యలు.. దుమ్మెత్తిపోస్తున్న సంస్థలు..
ఆసియా, ఈజిప్ట్, అమెరికా, ఆఫ్రికా ఇలా అన్ని ఖండాల్లోని దేశాలపై ఈ నష్టం మోయలేని భారంగా మారింది. దించుకోలేని దిగుబండగా తయారైంది. చైనా, కెనడా, మెక్సికో, భారత్, రష్యా, ఉక్రెయిన్, ఫ్రాన్స్, ఆస్ర్టేలియా ఇలా ఏ ఒక్క దేశమంటూ చెప్పలేం. అన్ని దేశాలను ఈయన వ్యాఖ్యలు, చేష్ఠలు ముచ్చెమటలు పట్టించాయి. ఫలితంగా ఆయా దేశాల మార్కెట్లతో సహా, అంతర్జాతీయ మార్కెట్లతో కలిపి ఆర్థిక నిపుణుల అంచనా ప్రకారం రూ. 350 లక్షల కోట్లు నష్టాలపాలయ్యాయి. ఒక్క ఎలన్ మస్క్ తప్ప అంతర్జాతీయ సంస్థలు ట్రంప్ ప్రకటనలపై దుమ్మెత్తిపోస్తున్నాయి. పైకి అనకపోయినా లోలోన ట్రంప్ ది ట్రంపరితనమేనని మథనపడుతున్నాయి.
బీర్ దాడికి ట్రంపే కారణం..
సాక్షాత్తూ ప్రపంచమార్కెట్లను అవపోసన పట్టి, పరిశోధిస్తున్న ఎస్ అండ్ పీ గ్లోబల్ రేటింగ్స్ సంస్థ కూడా ట్రంప్ చర్యల వల్ల మార్కెట్లపై బీర్ విరుచుకుపడిందని తేల్చి చెప్పింది. స్టాక్స్, బాండ్లు, కమోడిటీలు ఇలా ఒక్కటేమిటి అన్ని విధాలా నష్టమే వాటిల్లిందని స్పష్టం చేసింది. మరో సంస్థ మూడీస్ కూడా ట్రంప్ విధానం మార్కెట్ల పతనానికి కారణమైందని స్పష్టం చేసింది. గత నెలలో 4 ట్రిలియన్ డాలర్లు (350 లక్షల కోట్లు) నష్టపోయినట్లు స్పష్టం చేసింది. బెంచ్ మార్క్ 500 వద్ద 2.7 శాతం పడిపోయినట్లు తెలిపింది. నాస్ డాగ్ కాంపోజిట్ 4 శాతం నష్టపోయింది. 2022 తరువాత ప్రపంచమార్కెట్లలో ట్రంప్ విధానాలు, ప్రకటన వల్ల ఒక ఆర్థికమాంద్యమే తలెత్తిందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.
బడా సంస్థల షేర్లు పాతాలానికే..
కాగా అమెరికా మార్కెట్లు ఫిబ్రవరి 19 రికార్డు గరిష్టస్థాయి కంటే 8.6 శాతం దిగువన ముగిశాయి. అప్పటి నుంచి 4 ట్రిలియన్ డాలర్లకు పైగా పడిపోయింది. మొత్తం 10 శాతం మార్కెట్లు క్షీణతకు చేరుకున్నాయి. సాంకేతిక రంగం 4.3 శాతం, యాపిల్, ఎన్వీడియా 5 శాతం, టెస్లా 15 శాతం భారీగా నష్టాలకు గురయ్యాయి. ట్రంప్ అధ్యక్ష పీఠాన్ని అధిరోహించిన తరువాత ఫిబ్రవరి నెల వరకు స్టాక్ మార్కెట్లు దాదాపు 600 బిలియన్ డాలర్లు (రూ. 50 లక్షల కోట్లకు పైగా) నష్టాన్ని చవిచూసినట్లు ఆర్థిక నిపుణులు చెబుతున్నాయి.
పొంచి ఉన్న మరో ఆర్థికమాంద్యం ప్రమాదం..
ట్రంప్ రాక తర్వాత, ఫిబ్రవరి నెల వరకు భారత స్టాక్ మార్కెట్ దాదాపు 600 బిలియన్ డాలర్లు (రూ. 50 లక్షల కోట్లకు పైగా) నష్టాన్ని చవిచూసినట్లుగా పీఈ అంచనా వేసింది. పీఈ (ప్రైజ్ టు ఎర్నింగ్స్–ధర ఆదాయం) అంచనాల ప్రకారం గత 16 ఏళ్లలో తొలిసారిగా యూఎస్ తోపాటు ప్రపంచ మార్కెట్లు అస్థిరత దిశగా క్షీణించాయి. పరిస్థితిని చక్కదిద్దకుంటే ట్రంప్ తీసుకుంటున్న ట్రెంపరితనం నిర్ణయాలు కూడా ప్రపంచంలో మరో ఆర్థికమాంద్యానికి దారితీసే ప్రమాదం ఉంది.