కలకాలం స్నేహబంధం ప్రధాని నరేంద్ర మోదీ
Timeless friendship Prime Minister Narendra Modi

భారత్–మారిషస్ వ్యూహాత్మక బంధాలు
పోర్ట్ లూయిస్: భారత్–మారిషస్ వ్యూహాత్మక బంధాలు, స్నేహబంధం కలకాలం నిలిచి ఉంటాయని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. మంగళవారం రెండు రోజుల పర్యటన నిమిత్తం మారిషస్ కు చేరుకున్నారు. ఈ సందర్భంగా ప్రధానికి ఘన స్వాగతం లభించింది. అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ రాష్ర్టపతి ధరమ్ గోకుల్ కు మహాకుంభమేళా గంగాజలాన్ని, ఆయన సతీమణికి బనారస్ చీరను బహుమతిగా అందజేశారు. అనంతరం ఇరువురి మధ్య పలు అంశాలపై చర్చలు జరిగాయి. ప్రధాని గౌరవార్థం రాష్ర్టపతి ప్రత్యేక విందు ఏర్పాటు చేశారు. మారిషస్ లోని శివసాగర్ రామ్ గులాం బొటానికల్ గార్డెన్ లో ప్రధాని మోదీ మొక్కను నాటారు. శివసాగర్ రామ్ గులాం మారిషస్ జాతిపితగా భావిస్తారు. ఆయనకు నివాళులర్పించారు. 2015 తరువాత ప్రధాని మోదీ మారిషస్ లో పర్యటించడం ఇది రెండోసారి. ఈ పర్యటనలో సుమారు పది ఒప్పందాలపై సంతకాలు చేయనున్నారు. రక్షణ, విద్య, వైద్యం, సాంకేతికత, వాణిజ్య, వ్యాపారం తదితరాలపై కీలక ఒప్పందాలు చేసుకోనున్నారు. అమెరికా సుంకాలు, సముద్ర భద్రతలో సహఖారం వంటి అంశాలపై కూడా ఇరుదేశాల్లో చర్చలు జరిగాయి. అభివృద్ధి ప్రాజెక్టుల కోసం భారత్ మారిషస్ కు 1.1 బిలియన్ డాలర్ల సహాయం అందించింది. ఈ ప్రాజెక్టుల నిర్వహణతో హిందూ మహాసముద్రంలో భారత్ తన ప్రాబల్యాన్ని పెంచుకోనుంది. ఓ వైపు చైనా, బ్రిటన్ లు మారిషస్ సముద్ర జలాలపై ఆధిపత్య ధోరణిని కొనసాగిస్తున్నాయి. చాగోస్ దీవులపై మారిషస్ వాదనపై భారత్ తన మద్ధతు తెలిపింది. ఈ దీవులపై బ్రిటన్ తో 50ఏళ్లుగా వివాదం కొనసాగుతుంది. ఈ రెండు దేశాల మధ్య ఒప్పందానికి భారత్ అనేకమార్లు ప్రయత్నించింది. ఈ నేపథ్యంలో ఐదునెలల క్రితం బ్రిటన్–మారిషస్ మధ్య ఒక ఒప్పందం కూడా కుదిరింది. ఒప్పందం ప్రకారం 60 దీవులతో కూడిన చాగోస్ ద్వీపాన్ని మారిషస్ కు అప్పజెప్పారు. ఈ దీవులలో డియెగో గార్సియా ద్వీపంలో అమెరికా, బ్రిటన్ లు ఉమ్మడి సైనిక స్థావరాన్ని నిర్మించాయి.
చైనా పాక్ లోని గ్వాదర్, శ్రీలంకలోని హంబన్ టోట నుంచి ఆఫ్రికన్ దేశాల వరకు అనేక ఓడరేవు ప్రాజెక్టులలో నిధులను వెచ్చించింది. చైనాను ఎదుర్కోవాలంటే హిందూ మహాసముద్రంలో భారత్ తన ఉనికిని పెంచుకోవాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. ఇందుకోసమే మారిషస్ తో కలిసి భారత్ సముద్ర ప్రాజెక్టులకు రూపకల్పన చేసింది. ముంబాయి నుంచి 3,729 కి.మీ. దూరంలో ఉత్తర అగలేగా ద్వీపంలో సైనిక స్థావరానికి అవసరమైన మౌలిక సదుపాయాలను భారతదేశం నిర్మించింది. ఈ ప్రాంతంలో రన్ వేలు, జెట్టీలు, విమానాల కోసం హ్యాంగర్లు తదితరాలున్నాయి. ఇక్కడి నుంచి రెండు దేశాలు సంయుక్తంగా పశ్చిమ హిందూ మహాసముద్రంలోని చైనా సైనిక నౌకలు, జలాంగర్గాములపై నిఘా పెట్టాయి.