జప్తు చేసిన అవినీతి సొమ్ము పేదలకే .. స్పష్టం చేసిన నరేంద్ర మోదీ

– ప్రభుత్వం న్యాయ సలహా కోరిందని వెల్లడి – ఇప్పటి వరకు రూ.1.25 లక్షల కోట్లు సీజ్​ చేసిన దర్యాప్తు సంస్థలు – ఆ మొత్తాన్ని పేదలకు చేర్చాలనుకుంటున్నట్లు ప్రకటన – ఇండియాటుడె ఇంటర్వ్యూలో కీలకాంశాలు వెల్లడించిన ప్రధాని

May 17, 2024 - 17:00
 0
జప్తు చేసిన అవినీతి సొమ్ము పేదలకే .. స్పష్టం చేసిన నరేంద్ర మోదీ

నా తెలంగాణ, ఢిల్లీ: అవినీతి కేసుల్లో దర్యాప్తు సంస్థలు స్వాధీనం చేసుకున్న డబ్బును పేదలకు తిరిగి ఇచ్చేలా ప్రభుత్వం మార్గాలను అన్వేషిస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. దీనిపై ఇప్పటికే న్యాయ సలహా కోరామని, దాన్ని బట్టి తుది నిర్ణయం తీసుకుంటామని ఆయన ప్రకటించారు. ఇండియా టుడేకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో దర్యాప్తు సంస్థలు సీజ్​ చేసిన మొత్తాన్ని ఏం చేయబోతున్నారని జర్నలిస్ట్​ అడిగిన ప్రశ్నకు ప్రధాని సమాధానం చెప్పారు.‘‘మేము దీని గురించి చాలా ఆలోచిస్తున్నాం. అక్రమార్కులు తమ పదవిని దుర్వినియోగం చేస్తూ.. పేద ప్రజల డబ్బును దోచుకున్నారు. ఆ మొత్తాన్ని పేదలే తిరిగి పొందాలని నేను బలంగా కోరుకుంటున్నాను”అని మోదీ తెలిపారు.

అవసరమైతే చట్ట సవరణ 

ఈడీ, సీబీఐ లాంటి దర్యాప్తు సంస్థలు జప్తు చేసిన మొత్తం పేదలకు చేర్చడంలో అవసరమైతే చట్టపరమైన మార్పులకు కూడా తాను సిద్ధమేనని ప్రధాని మోదీ తెలిపారు. ‘‘నేను ప్రస్తుతం న్యాయ బృందం సహాయం కోరుతున్నాను. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ స్వాధీనం చేసుకున్న డబ్బు కుప్పలను పేదలకు చేర్చేందుకు ఉన్న మార్గాలు ఏమున్నాయనే దానిపై నాకు సలహా ఇవ్వాలని న్యాయవ్యవస్థను అడిగాను”అని మోదీ తెలిపారు. కాగా ప్రభుత్వ దర్యాప్తు సంస్థలు ఇప్పటి వరకు రూ.1.25 లక్షల కోట్లు స్వాధీనం చేసుకున్నాయని మోదీ తెలిపారు.

విపక్షాలకు స్ట్రాంగ్​ కౌంటర్​

కేంద్ర ప్రభుత్వం దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తున్నదని ఆయా పార్టీల నేతలు నిరంతరం ఆరోపణలు చేయడంపై ప్రధాని మోదీ.. విపక్ష నేతల విమర్శలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. తమ ప్రభుత్వంలోనే దర్యాప్తు సంస్థలు సమర్థవంతంగా, పూర్తి స్వేచ్ఛాయుతంగా పని చేస్తున్నాయని చెప్పారు.