నారీశక్తి సామర్థ్యాలు భేష్ 110వ మన్ కీ బాత్ లో మోదీ
మరో మూడు నెలల తరువాత 111 ఎపిసోడ్ లో కలుద్దామన్న ప్రధాని
నా తెలంగాణ, న్యూఢిల్లీ: దేశంలో మహిళ శక్తి వెనుకబడిన ప్రాంతం ఏదీ లేదని తమ నాయకత్వ సామర్థ్యాల ద్వారా అన్ని రంగాల్లో మహిళలు అభివృద్ధి పథంలో దూసుకుపోతూ దేశాన్ని ఆర్థిక ప్రగతిలో పరుగులు పెట్టించడం అభినందనీయమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. మహిళాభివృద్ధికి మరింత సహాయక చర్యలు కొనసాగుతాయని ప్రధాని పునరుద్ఘాటించారు. 110వ మన్ కీ బాత్ లో ప్రధాని మోదీ దేశ ప్రజలనుద్దేశించి ఆదివారం ప్రసంగించారు. మన్ కీ బాత్ ఈ ఎపిసోడ్ ఆఖరిదన్నారు. తిరిగి మూడు నెలల తరువాత 111 శుభసూచక సంఖ్యతో మన్ కీ బాత్ లో మీ ముందుకు వస్తానని పేర్కొన్నారు. వచ్చే నెలలో ఎన్నికల ప్రకటన ఉండే అవకాశం ఉందని దీంతో ఎన్నికల కోడ్ అమల్లోకి రానున్నందున మన్ కీబాత్ కార్యక్రమంపై ఆంక్షలుంటాయన్నారు. అందువల్ల ఎన్నికల అనంతరమే తమ ప్రభుత్వం తిరిగి అధికారంలోకి వస్తుందని కార్యక్రమాన్ని కొనసాగిస్తామన్నారు.
నా తొలి ఓటు దేశానికే..యువతకు సందేశం..
ఎన్నికల సంఘం ప్రారంభించిన ‘నా తొలి ఓటు దేశానికే’ అనే ప్రచారం ద్వారా నూతన ఓటర్లుగా నమోదైన వారు ప్రతీ ఒక్కరూ ఓటు వేయాలని అభ్యర్థించారు. దేశ యువత ఓటింగ్ లో తమ ఉత్సాహాన్ని ప్రదర్శించాలన్నారు. ఎన్నికల సంఘం పిలుపు మేరకు ఎక్కువశాతం ఓటింగ్ లో పాల్గొంటేనే దేశంలో పాలన అంత సురక్షితంగా ఉంటుందన్నారు. అభివృద్ధిని సాధించుకోవచ్చన్నారు.
భాషా సంరక్షణపై గాయకుల కృషి అభినందనీయం
స్థానిక భాషల పరిరక్షణ కోసం పలువురు గాయకులు చేసిన కృషిని కొనియాడారు. జమ్మూకశ్మీర్ మహ్మద్ మన్షా – గోజ్రీ భాష, అరుణాచల్ కు చెందిన బన్వాంగ్ లోసు – వాంఛో భాష, కర్ణాటకకు చెందిన వెంకప్ప అంబాజీ సుగేత్ కర్ – గోంధాలీ భాషల్లో పాడిన పాటలను ప్రధాని మోదీ ప్రశంసించారు.
విద్యపై భీంసింగ్ విశేష కృషి..
బాలల చదువుకోసం బిహార్ కు చెందిన భీంసింగ్ భవేష్ 8వేల మంది పిల్లలను బడిలో చేర్పించడం అభినందనీయమన్నారు. అంతేగాక అతనే పిల్లల కోసం ఓ లైబ్రరీని స్థాపించడం గొప్ప విషయమన్నారు. కరోనాతో సమాజం బాధపడుతున్న సమయంలో భీంసింగ్ వందకుపైగా వైద్య శిబిరాల ద్వారా వైద్య సేవలందించి, కరోనా వ్యాక్సిన్ లు తీసుకోవాలని ప్రజలను ప్రోత్సహించిన తీరు అభినందనీయమన్నారు. భీంసింగ్ లో మానవాళిపై నిజమైన ప్రేమ, అనురాగం, ఆప్యాయతలు ఈ చర్యల వల్ల కనిపించాయన్నారు. అతని సేవలు అమోఘనీయమని కొనియాడారు.
వన్యప్రాణుల సంరక్షణతో మెరుగైన వాతావరణం..
సాఫ్ట్ వేర్ కొలువుల ద్వారా నేడు సంపాదిస్తున్న యువతకు జయంతి మహాపాత్ర, ఆమె భర్త బీరే సాహులే నిదర్శనమన్నారు. ఐటీ కొలువులను పక్కన పెట్టి కలహండిలో ఆగ్రో సంస్థను స్థాపించి స్థానిక రైతులకు మేకల పెంపకంపై మెళకువలు నేర్పడం, గోట్ బ్యాంకును ప్రారంభించడం అభినందనీయమన్నారు. పెంపుడు జంతువులు, వన్య ప్రాణుల సంరక్షణతో మెరుగైన వాతావరణానికి, ఆర్థికాభివృద్ధికి దోహదం చేస్తాయన్నారు. మొసళ్ల జాతి అంతరించిపోకుండా చూసేందుకు ఓ సాంకేతిక నిపుణుడు డ్రోన్ ను అభివృద్ధి చేశాడని ప్రధాని వివరించారు. వన్యప్రాణుల సంరక్షణతో దేశంలో జీవవైవిధ్యం సుసంపన్నం అవుతుందన్నారు.