ముఖర్జీ సిద్ధాంతాలతో ముందుకు మేనిఫెస్టో విడుదలలో జేపీ. నడ్డా
శ్యామా ప్రసాద్ ముఖర్జీ సిద్ధాంతాలను ముందుకు తీసుకువెళ్లేందుకు నిరంతరం కృషి చేస్తున్నామని బీజేపీ జాతీయాధ్యక్షులు జేపీ. నడ్డా అన్నారు.
నా తెలంగాణ, న్యూఢిల్లీ: శ్యామా ప్రసాద్ ముఖర్జీ సిద్ధాంతాలను ముందుకు తీసుకువెళ్లేందుకు నిరంతరం కృషి చేస్తున్నామని బీజేపీ జాతీయాధ్యక్షులు జేపీ. నడ్డా అన్నారు. ఇందులో భాగంగానే ఆదివారం బీజేపీ 2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు మేనిఫెస్టోను (సంకల్ప పత్ర్) విడుదల చేశారు. ఈ సందర్భంగా నడ్డా మాట్లాడుతూ.. ‘సబ్ కా సాథ్, సబ్ కా వికాస్’ అనే నినాదంతో ప్రధాని మోదీ నేతృత్వంలో ముందుకు వెళతామన్నారు. దేశ ప్రజలు కూడా బీజేపీకి స్పష్టమైన మెజార్టీతో మరోమారు అవకాశం ఇవ్వనున్నారని నడ్డా తెలిపారు.
2014, 2019లో ప్రజాశీస్సులు లభించాయని, మరోమారు హ్యాట్రిక్ గా ప్రజలు తమనే ఆశీర్వదించనున్నారన్నారు. ప్రజాసంక్షేమం కోసం, దేశ హితం కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలను చేపట్టామన్నారు. ముఖ్యంగా దేశంలోని నారీశక్తికి అధిక ప్రాధాన్యం, మౌలిక సదుపాయాల కల్పన, అభివృద్ధికి ఊతం ఇచ్చామని స్పష్టం చేశారు. 2014 కంటే ముందు దేశ పరిస్థితులు ఏ విధంగా ఉండేవో దేశ ప్రజలకు చెప్పాల్సిన అవసరం లేదన్నారు. ఎక్కడ చూసినా అవినీతి, అక్రమాలు, ఉగ్రదాడులు, కుటుంబ రాజకీయాలతో దేశం విషమ పరిస్థితులను అనుభవిస్తూ ఉందన్నారు. ప్రస్తుత ప్రభుత్వం పదేళ్లలోనే ఆత్మనిర్భర్ భారత్ నిర్మాణాన్ని చేపట్టిందని జేపీ నడ్డా అన్నారు. బీఆర్ అంబేద్కర్ కు నివాళులర్పించారు. ఆయన బాటలోనే బీజేపీ సామాజిక న్యాయం దిశగా ముందుకు సాగుతోందని స్పష్టం చేశారు.