మార్కెట్ల నేలచూపులు వరుసగా ఐదో రోజు నష్టాలే

Markets bottomed for the fifth day in a row

Dec 20, 2024 - 17:11
 0
మార్కెట్ల నేలచూపులు వరుసగా ఐదో రోజు నష్టాలే

ముంబాయి: క్రిస్మస్​, కొత్త సంవత్సరానికి ముందు షేర్​ మార్కెట్లు నేలచూపులు చూస్తున్నాయి. గత ఐదు రోజులుగా వరుసగా మార్కెట్లు నష్టాలను చవిచూస్తున్నాయి. దీంతో పెట్టుబడిదారులు తలలు పట్టుకుంటున్నారు. శుక్రవారం సెన్సెక్స్​ 1,176.46 (1.48శాతం) పాయింట్లు పడిపోయి 78,041.59 వద్ద ముగిసింది. నిఫ్టీ 364.21 (1.52శాతం) పాయింట్లు పడిపోయి 23,587.50 వద్ద మూతపడింది. అదే సమయంలో రూపాయి 0.10 పైసలు కోలుకొని రూ. 85.03 వద్ద ముగిసింది. 

షేర్​ మార్కెట్ల వరుస నష్టాలకు అంతర్జాతీయ కారణాలే దోహదం చేస్తున్నట్లు కనబడుతున్నాయి. యుద్ధ ప్రభావాలు, ట్రంప్​ ప్రకటనలతో విదేశీ ఇన్వెస్టర్లు భారత మార్కెట్​ లో పెట్టుబడులను అంతగా పెట్టడం లేదు. దీంతోపాటు అంతర్జాతీయంగా డాలర్​ రేటుపై ట్రంప్​ ప్రకటన కూడా పలు దేశాల మార్కెట్ల పతనానికి కారణంగా నిలుస్తుంది. ఆసియా, యూరప్​ మార్కెట్లు కూడా ఐదు రోజులుగా నష్టాలను చవిచూస్తున్నాయి. విదేశీ ఇన్వెస్టర్లు వరుసగా తమ షేర్లను విక్రయిస్తుండడం, నూతన షేర్లు కొనుగోలు చేయడం లేదు. దీంతో సియోల్​, టోక్యో, షాంఘై, హాంకాంగ్​ లాంటి షేర్​ మార్కెట్లలో కూడా క్షీణత నమోదైంది. భారతీయ షేర్​ మార్కెట్లు నష్టాలు నమోదైనప్పటికీ, బీఎస్​ ఇలో 1061 షేర్లు లాభాలను ఆర్జించాయి. మరో 2929 షేర్లు నష్టాలను చవిచూశాయి. 95 షేర్లు తటస్థంగా ఉన్నాయి. శుక్రవారం నాటి ట్రేడింగ్‌లో 229 షేర్లు 52 వారాల గరిష్ట స్థాయి వద్ద ట్రేడయ్యాయి. 68 షేర్లు 52 వారాల కనిష్ట స్థాయికి చేరుకున్నాయి.