కెనడా ప్రధానిగా మార్క్​ కార్నీ?

Mark Carney as Prime Minister of Canada?

Mar 9, 2025 - 14:13
 0
కెనడా ప్రధానిగా మార్క్​ కార్నీ?

ఆ దేశ ఆర్థికాన్ని గాడిన పెట్టిన గవర్నర్​
ట్రంప్​ తో విబేధాలున్నా.. దేశ ప్రయోజనాలకే విలువ
భారత్​ తోనూ మెరుగుపడనున్న బంధాలు
ట్రూడో ఇంటికే.. గద్దెనెక్కనున్న ఆర్థికవేత్త

నా తెలంగాణ, సెంట్రల్​ డెస్క్​: కెనడా–అమెరికా రెండు దేశాల మధ్య బంధాలు తిరిగి అతుక్కోనంత విచ్ఛిన్నం దిశగా పయనిస్తుండడం, రానున్న ఎన్నికల్లో జస్టిన్​ ట్రూడో ప్రధాని అభ్యర్థి రేసులో వెనుకబడడంతో కెనడాకు ప్రధాని ఎవరన్న ప్రశ్న ఉత్పన్నం అవుతుంది. ఈ నేపథ్యంలో 2008లో కెనడా ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతుండగా సెంట్రల్​ బ్యాంక్​ గవర్నర్​ మార్క్​ కార్నీ పలు చర్యలను తీసుకొని ప్రపంచాన్నే ఆశ్చర్యపరుస్తూ ఆ దేశ ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిన పెట్టగలిగాడు. అప్పట్లో ఈయన తీసుకున్న ఆర్థిక విధానం చాలా మంది ఆర్థికవేత్తలను ఆశ్చర్యపరిచింది. దీంతో ప్రపంచాన్ని రక్షించిన కెనడియన్​ కార్నీ అని ఆ తరువాతి రోజుల్లో పెద్ద పెద్ద వార్తా పత్రికల్లోనూ ఈయన పేరు మారుమోగిపోయింది. ప్రస్తుతం ప్రధాని రేసులో మూడు పేర్లు ఉన్నప్పటికీ లిబరల్​ పార్టీ తరఫున ఈయన పేరే తొలివరుసలో వినిపిస్తుంది మద్ధతు లభిస్తుంది. కార్నీ అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్​ ట్రంప్​ కు తీవ్ర వ్యతిరేకి. అయినా ఈయన ప్రకటనలు చేయడం కంటే పనిచేయడమే ముఖ్యమని, దేశ భవిష్యత్​ ముఖ్యమని అందరినీ కలుపుకొని వెళ్లేవాడిగా ప్రాచుర్యం దక్కించుకున్నాడు. ఈ నేపథ్యంలో ప్రధాని పదవికి ఈయన ఎంపికైతే అమెరికాతో విచ్ఛిన్నం అవుతున్న బంధాలు బలపడే అవకాశం ఉంది. అదే సమయంలో భారత్​ తోనూ అనేక విధానపరమైన అంశాలలో మార్పు చేర్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది. కార్నీ పదవికి ఎంపికైతే భారత్​ కు మేలే జరగనుంది.

మార్క్​ కార్నీ..
– 1965 మార్చి 16న కెనడలోని ఫోర్ట్​ స్మిత్​ అనే ప్రాంతంలో జన్మించారు.
– హార్వర్డ్​ యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్​–1988, ఆర్థిక శాస్ర్తం ఆక్స్​ ఫర్డ్​ యూనివర్సిటీ–1993, అదే యూనివర్సిటీ నుంచి 1995లో డాక్టరేట్​ సాధించాడు.
– బ్యాంక్​ ఆఫ్​ కెనడా 2008–13 వరకు గవర్నర్​.
– బ్యాంక్​ ఆఫ్​ ఇంగ్లాండ్​ 2013–20 వరకు గవర్నర్​.

బలాబలాలు..
– కెనడా మొత్తం ఎంపీ స్థానాలు 338. మెజార్టీ స్థానాలు 170.
– ట్రూడో పార్టీ మెజార్టీ స్థానాల కంటే 17 స్థానాల్లో వెనుకబడి ఉంది.
– లిబరల్​ పార్టీ (ట్రూడో) 153 సీట్లు, కన్జర్వేటివ్​ పార్టీ 120, క్యూబెక్​ పాట 33, న్యూ డెమోక్రటిక్​ పార్టీ 25,గ్రీన్​ పార్టీ 2, స్వతంత్రులు 4 స్థానాలు. 

భారత్​ ఆరోపణలు..
– కెనడా మార్గంలోనే అక్రమంగా భారతీయుల హ్యూమన్​ ట్రాఫికింగ్​ జరుగుతున్నట్లు భారత ఇంటలిజెన్స్​ వర్గాలకు ఆధారాలు లభించాయి. పైగా ఈ ట్రాఫికింగ్​ లో నేరుగా సంపన్నవర్గాలు, రాజకీయ నేతలు, ప్రభుత్వ వర్గాలకు సంబంధాలున్నాయని గుర్తించాయి.
– కెనడాలోని 260 కాలేజీలు హ్యూమన్​ ట్రాఫికింగ్​ లో పాత్ర ఉందని ఈడీ అనుమానిస్తుంది. ఆ దేశ ప్రభుత్వానికి తెలిసే ఇంటర్నేషనల్​ సిండికేట్​ నడుస్తుందని భావిస్తుంది. 
– ముందుగా కెనడా కాలేజీల్లో అడ్మిషన్లు, ఆ తరువాత అక్రమ మార్గం ద్వారా అమెరికాకు పంపించేస్తారు.
– భారత్​ లో దాడులకు పాల్పడే ఖలిస్థానీ గ్రూపులకు ఆశ్రయం. వారిపై చర్యలు తీసుకోకపోవడం. పైగా వారినే చట్టసభల్లో అత్యున్నత స్థానాల్లో నియమిస్తూ హిందువులు, దేవాలయాలపై దాడులకు ప్రోత్సాహం కల్పించడం వంటి ఆరోపణలున్నాయి.