తమిళులకు శత్రువు డీఎంకే
తమిళ ప్రజల పాలిట డీఎంకే పార్టీ శత్రువుగా మారిందని బీజేపీ రాష్ర్ట అధ్యక్షుడు కె. అన్నామలై మండిపడ్డారు. మదురైలోని తెప్పకుళం మైదానం నుంచి బుధవారం ఉదయం 11 గంటలకు రోడ్‌షో ప్రారంభించారు.
చెన్నై: తమిళ ప్రజల పాలిట డీఎంకే పార్టీ శత్రువుగా మారిందని బీజేపీ రాష్ర్ట అధ్యక్షుడు కె. అన్నామలై మండిపడ్డారు. మదురైలోని తెప్పకుళం మైదానం నుంచి బుధవారం ఉదయం 11 గంటలకు రోడ్‌షో ప్రారంభించారు. ఈ రోడ్‌షోలో అన్నామలై డీఎంకేపై విమర్శల బాణాలు ఎక్కుపెట్టారు. డీఏంకే పార్టీ రాష్ర్ట ప్రజల అభీష్టం మేరకు పాలన కొనసాగించడం లేదని ఆరోపించారు. కేంద్ర పథకాల ద్వారా వచ్చే నిధులను ఇతర మార్గాలకు మళ్లించి కేంద్రం నుంచి నిధులు ఏమి అందలేదని ప్రజలను తప్పుదోవ పట్టిస్తుందన్నారు. ఇప్పటికే తమిళనాడు వ్యాప్తంగా ప్రధాని మోదీ అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించడాన్ని అన్నామలై గుర్తు చేశారు.
39 ఎంపీ స్థానాలున్న తమిళనాడులో బీజేపీ సత్తాచాటాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలో కర్ణాటక కేడర్ ఐపీఎస్ అధికారిగా ఉన్న అన్నామలై 2019లో తన ఉద్యోగానికి రాజీనామా చేసి బీజేపీలో చేరారు. అన్నామలై నేతృత్వంలో బీజేపీకి మంచి గుర్తింపు లభిస్తోంది. ఈ నేపథ్యంలో అధిష్టానం కూడా అన్నామలైకు అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందజేస్తూ పార్టీ విజయం దిశగా దూసుకువెళుతోంది. తమిళనాడులో మొదటి విడత ఏప్రిల్ 19న ఎన్నికలు ఒకే విడతలో జరగనున్నాయి. ఎన్నికలకు మరో 15 రోజులు మాత్రమే మిగిలి ఉండటంతో బీజేపీ ప్రచారాన్ని ముమ్మరం చేసింది.