లౌడ్ స్పీకర్లు.. సుప్రీం నిబంధనలకు కట్టుబడాలి
సీఎం దేవేంద్ర ఫడ్నవీస్

ముంబాయి: మహారాష్ట్రలో లౌడ్ స్పీకర్ల అంశంలో సుప్రీం నిబంధనలకు కట్టుబడి ఉండాలని లేకుంటే సంబంధిత శాఖ చర్యలు తీసుకుంటుందని సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ స్పష్టం చేశారు. మంగళవారం ఈ అంశంపై మీడియా అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు ప్రార్థనాలయాలు, దేవాలయాలు అన్ని చోట్లా లౌడ్ స్పీకర్లు ఆపివేయాలన్నారు. లేకుంటే శబ్ధ కాలుష్యంపై చట్టపరమైన చర్యలకు ప్రభుత్వం దిగుతుందన్నారు. నిబంధనల ప్రకారం లౌడ్ స్పీకర్ల పరిమితి పగటిపూట 55 డెసిబుల్స్, రాత్రికి 45 డెసిబుల్స్ వరకు ఉండాలన్నారు. అంతకుమించి ఉండకూడదన్నారు. నిబంధనలు ఉల్లంఘించినట్లయితే మహారాష్ట్ర కాలుష్య నియంత్రణ బోర్డు కఠిన చర్యలు తీసుకుంటుందని, సంబంధిత పోలీస్ స్టేషన్ ఇన్ స్పెక్టర్ బాధ్యత వహించాల్సి ఉంటుందని అన్నారు. శబ్ధ నియమాలను తమ పోలీస్ స్టేషన్ పరిధిలో పాటిస్తున్నారా? లేదా? అనేది ఇన్ స్పెక్టర్ల బాధ్యత అన్నారు. కేంద్రం రూపొందించిన చట్టం ప్రకారం ఎంపీసీబీకి చర్యలు తీసుకునే అధికారం ఉందన్నది గుర్తుంచుకోవాలన్నారు. ఇక మహారాష్ట్రలో లౌడ్ స్పీకర్ల రాజకీయానికి తెరదించుతామని సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ అన్నారు.