లోక్​ సభలో ఇమ్మిగ్రేషన్​ అండ్​ ఫారినర్స్​ బిల్లు !

Immigration and Foreigners Bill in Lok Sabha!

Mar 11, 2025 - 13:58
 0
లోక్​ సభలో ఇమ్మిగ్రేషన్​ అండ్​ ఫారినర్స్​ బిల్లు !

నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: వలసవాద చట్టాల స్థానంలో ‘ఇమ్మిగ్రేషన్‌ అండ్‌ ఫారినర్స్‌ బిల్లు, 2025’ లోక్​ సభలో కేంద్రమంత్రి నిత్యానందరాయ్​ మంగళవారం ప్రవేశపెట్టారు. అక్రమచొరబాట్లపై ఉక్కుపాదం మోపేలా బిల్లులో చర్యలున్నాయి. ఈ బిల్లు ప్రకారం భారత్​ లోకి అక్రమంగా చొరబడితే రూ. 5 లక్షల జరిమానాతోపాటు ఏడేళ్ల జైలు శిక్షను విధించనున్నారు. దీంతో ఇమ్మిగ్రేషన్​ అధికారులకు మరింత స్వేచ్ఛనిచ్చినట్లయ్యింది. బిల్లుతో మరిన్ని అధికారాలు సొంతమవుతాయి. అక్రమంగా వీసాలు, పాస్​ పోర్టులు లభించినా ఈ చట్టం ప్రకారమే చర్యలు తీసుకోనున్నారు. బ్రిటిష్​ కాలంలో రూపొందించిన చట్టాలు భారత సార్వభౌమత్వానికి కీడు కలిగించేలా ఉండడంతో ప్రభుత్వం ఈ బిల్లులోని పలు అంశాలపై మరింత కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంది. వాటిలోని లోపాలను సవరించింది. ఝార్ఖండ్​, వెస్ట్​ బెంగాల్​ వంటి రాష్ర్టాల్లోకి బంగ్లాదేశీయులు అక్రమంగా చొరబడుతున్నారు. ఈ బిల్లుతో ఈ సమస్యకు పరిష్కారం లభించనుంది. ఇప్పటికే ఈ బిల్లుకు కేంద్ర కేబినెట్​ ఆమోదం లభించింది. 

పాస్‌పోర్ట్‌ (ఎంట్రీ ఇన్‌టూ ఇండియా) యాక్ట్‌ 1920, రిజిస్ట్రేషన్‌ ఆఫ్‌ ఫారినర్స్‌ యాక్ట్‌ 1939, ఫారినర్స్‌ యాక్ట్‌ 1946, ది ఇమ్మిగ్రేషన్‌ (క్యారియర్స్‌ లయబిలిటీ) యాక్ట్‌ 2000 వంటి చట్టాలు అమల్లో ఉన్నాయి. అప్పటి పరిస్థితులకు అనుగుణంగా ఈ చట్టాలను రూపొందించారు. ఈ చట్టాల్లోని నిబంధనలు విరుద్ధంగా ఉండడంతో పలు సమస్యలు ఉత్పన్నం అవుతున్నాయి. దీంతో పాతచట్టాల స్థానంలో ‘ఇమ్మిగ్రేషన్‌ అండ్‌ ఫారినర్స్‌ బిల్లు, 2025’ను తీసుకువచ్చారు.

నిరసనలు..
బిల్లు ప్రవేశపెడుతున్న సందర్భంగా విపక్ష పార్టీలు నిరసనలు చేపట్టాయి. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్​ హరివంశ్​ నారాయణ్​ పలు అంశాలపై విపక్షాలు ప్రవేశపెట్టిన నోటీసులను తీసుకునేందుకు అంగీకరించలేదు. 21 నోటీసులను ప్రతిపక్షాలు ప్రతిపాదించాయి. 18 నోటీసులను టీఎంసీ, కాంగ్రెస్​, బీజేడీ, ఆప్​ డూప్లికేట్​ ఓటరు ఐడీ అంశంపైనే ప్రతిపాదించాయి. నోటీసులను అంగీకరించకపోవడంతో నిరసనలతో కొద్దిసేపు సభను వాయిదా వేశారు. అనంతరం పార్లమెంట్​ ఆవరణలో విపక్షాలు నిరసన చేపట్టాయి.

మారన్​ పై స్పీకర్​ మండిపాటు..
మరోవైపు డీఎంకే ఎంపీ దయానిధి మారన్​ చేసిన వ్యాఖ్యలపై స్పీకర్​ ఓం బిర్లా తీవ్రంగా మండిపడ్డారు. ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. మారన్​ నిప్​ (జాతీయ విద్యావిధానం–ఎన్​ఇపీ)పై అనుచిత వ్యాఖ్యలు చేశారు. మారన్​ పై చర్య తీసుకునేందుకు ప్రభుత్వం ప్రతిపాదన తేవాలన్నారు. 

బీజేపీ ఎంపీ రేఖా శర్మ..
రాజ్యసభ ఎంపీ రేఖా శర్మ మాట్లాడుతూ.. ప్రతిపక్షాలు కేవలం విభజన రాజకీయాలు చేస్తున్నాయని మండిపడ్డారు. ఏ భాషైనా నేర్చుకోవడంలో తప్పేంటని నిలదీశారు. భవిష్యత్​ లో ప్రపంచంలో ఎవ్వరితోనైనా కనెక్ట్​ కావాలంటే భాషదే అత్యంత ప్రాముఖ్యత అన్నారు. భాష ప్రాతిపదికన ప్రజలను ఎందుకు విడగొట్టాలని అనుకుంటున్నారో? ప్రజలకు అర్థం అవుతుందన్నారు.