- సదర్ ఉత్సవాల్లో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు
- మోదీ నేతృత్వంలో మహిళా సంక్షేమానికి పెద్దపీట
- నారాయణుని దయతో ప్రతీఒక్కరికి శ్రేయస్సు ప్రసాదించాలి
- మెగాస్టార్ సేవలు అభినందనీయం
నా తెలంగాణ, హైదరాబాద్: దీపావళి సదర్ ఉత్సవాల్లో తెలంగాణ బీజేపీ రాష్ర్ట అధ్యక్షుడు, కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి పాల్గొన్నారు. ముషీరాబాద్ యాదవ సంఘం ఆధ్వర్యంలో దోమలగూడలో శనివారం జరిగిన ఉత్సవాల్లో పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ పండుగల్లో దీపావళి ఒకటన్నారు. మంచి విజయాన్ని, చెడును పారద్రోలే పండుగ అని తెలిపారు. పండుగలలో ప్రకృతిని ముడిపెడుతూ.. నిర్వహించే వేడుకే యాదవులు నిర్వహించే అత్యంత వైభవోపేతమైన పండుగ సదర్ సంబురాలన్నారు. ఈ వేడుకలో పాల్గొనడం అత్యంత సంతోషాన్ని, ఉల్లాసాన్ని ఇచ్చిందని కేంద్రమంత్రి సంతోషం వ్యక్తం చేశారు.
స్వయం సహాయక బృందాలతో..
ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో మహిళలకు ఆర్థిక పరిపుష్టి కల్పించేందుకు చేపట్టిన బృహత్తర కార్యక్రమమే పీఎం మహిళా యోజన అని తెలిపారు. సికింద్రాబాద్ సనత్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని స్వయం సహాయక సభ్యుల సమావేశంలో ముచ్చటించారు. ఆర్థిక భాగస్వామ్యంలో మహిళల పాత్ర కీలకంగా ఉండాలనేదే కేంద్ర ప్రభుత్వ ముఖ్యోద్దేశ్యమన్నారు. బృందాల కార్యకలాపాల కోసం ఎస్ హెచ్ జి రిజిస్టర్లను కేంద్రమంత్రి పంపిణీ చేశారు.
నారాయణుని సేవలో..
దేశంలో, ప్రపంచంలో ఏ ఒక్కరి ఆకలి కేకలు వినపడకూడదని కేంద్రమంత్రి జి.కిషన్ రెడ్డి స్వామినారాయణనున్ని వేడుకున్నారు. శనివారం సికింద్రాబాద్ నియోజకవర్గంలోని బేగంపేట రసూల్ పూరలో బీఏపీఎస్ స్వామినారాయణ మందిర్ లో నిర్వహించిన మహా అన్నకూత్ ఉత్సవ్ లో పాల్గొన్నారు. స్వామివారికి ప్రణామాలు అర్పించి ప్రతీఒక్కరి శ్రేయస్సును కోసం ప్రార్థించారు.
మెగాస్టార్ తో కేంద్రమంత్రి జి.కిషన్ రెడ్డి..
అత్యవసర పరిస్థితుల్లో రక్తదానం అవసరం పడ్డ వారి కోసం ఓ సంస్థను స్థాపించి ఎంతోమంది నిరుపేద, మధ్య తరగతి, ఉన్నత వర్గాల ప్రాణాలు కాపాడేందుకు దోహదపడుతున్న చిరంజీవి బ్లడ్ బ్యాంక్ సేవలను కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కొనియాడారు. దీపావళి సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి కేంద్రమంత్రిని మర్యాదపూర్వకం కలిశారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రికి పుష్పగుచ్చమిచ్చి, శాలువాకప్పి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మంత్రి కిషన్ రెడ్డి చిరంజీవికి శాలువా కప్పి గౌరవించారు. ఇరువురు కలిసి పలు అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా బ్లడ్ బ్యాంక్ సేవలను కేంద్రమంత్రి అభినందించారు. మెగాస్టార్ కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ప్రజాసేవను కొనియాడారు. నిరంతరం ప్రజాసేవకై తపిస్తున్న సేవలపై కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలిపారు.