11 గ్రామాల్లో తిష్టేసిన చొరబాటుదారులు
ఆదివాసీ, గిరిజన భూములను లాక్కున్న వారిని వదలం
ఎవరి భూములు వారికే అప్పగిస్తాం
కొల్హన్ గొంతుకనవుతా
నా తెలంగాణ, సెంట్రల్ డెస్క్: 11 గ్రామాలోని ఆదివాసీ, గిరిజనులను బంగ్లాదేశీ చొరబాటుదారులు పూర్తిగా స్వాధీనం చేసుకున్నారని అక్కడి వారితో బలవంతంగా మతమార్పిడి చేయించారని, వినని వారిని గ్రామాల నుంచి వెళ్లగొట్టారని బీజేపీ నాయకుడు, కొల్హన్ టైగర్ చంపై సోరెన్ ఆరోపించారు. ఈ చర్యలను అడ్డుకోవడంలో రాష్ర్ట ప్రభుత్వం పూర్తిగా విఫలమందని విమర్శించారు. ఝార్ఖండ్ సరిహద్దు ముఖ చిత్రాన్ని పూర్తిగా పూసగుచ్చినట్లు మీడియాకు చంపై వివరించారు. తాము విజయం సాధిస్తే చొరబాటుదారులను వెనక్కి పంపించి ఆదివాసీ, గిరిజన భూములను స్వాధీనం చేసుకొని తిరిగి ఎవరివి వారికి అప్పజెబుతామన్నారు.
ఝార్ఖండ్ ఎన్నికల సందర్భంగా బీజేపీ, జేఎంఎం మధ్య ప్రచార వేడి పుంజుకుంది. ఈ నేపథ్యంలో కొల్హన్ టైగర్ గా నిమ్న వర్గాలకు దగ్గరైన చంపై ప్రాబల్యం 15 స్థానాలపై ఉంది. ఆదివాసీ, గిరిజనులు ఈయన చెప్పిందే వేదంగా భావిస్తుంటారు. సంతాల్ పరగణాలోని 150 గిరిజన కుటుంబాలు నివసించే గ్రామంలో ప్రస్తుతం ఒక్క కుటుంబం కూడా మిగల్లేదన్నారు. చొరబాట్లు అతిపెద్ద సమస్యగా మారాయన్నారు.
జేఎంఎంను రక్తం, చెమటతో కష్టపడి నిర్మించుకున్నానని తెలిపారు. ఆ పార్టీని తాను వీడానని చెప్పేకంటే, పార్టీయే తనను పక్కకు పెట్టడం ఇష్టం లేక బయటికి వచ్చానని తెలిపారు. ప్రస్తుతం ఉన్న బీజేపీలో తనకు అత్యధిక గౌరవం లభిస్తుందని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. తాను ఏ పార్టీలో ఉన్నా, లేదా తానే రాజకీయ పార్టీ పెట్టినా ఝార్ఖండ్ నిమ్న వర్గాల తరఫున తన పోరాటం కొనసాగుతుందన్నారు. వారి అభివృద్ధినే తాను కాంక్షిస్తున్నట్లు స్పష్టం చేశారు. తానేమీ కాంట్రాక్టర్ లో డబ్బులు ఉన్నవాడినో కాదని ఒక సామాన్య కుటుంబం నుంచి వచ్చిన వాడినని ఇక్కడి స్థానిక ప్రజలతోపాటు కష్టాలు అనుభవించానని అందుకే వారి కష్టాలు దూరం చేయాలనేదే తన తపన అని చంపై తెలిపారు. కొల్హన్ లో ప్రతీ గిరిజనుడు, ఆదివాసీ, నిమ్నవర్గాల వారు తనతో ఉన్నారన్న ధైర్యం, విశ్వాసం, నమ్మకం తనకున్నాయన్నారు.
ఝార్ఖండ్ లో అనేక సమస్యలున్నాయని తెలిపారు. ప్రత్యేక రాష్ర్టంగా అవతరించాక బంగ్లాదేశ్ చొరబాట్ల సమస్య ప్రధానమైందన్నారు. ఈ అంశంపై కేవలం బీజేపీ ఒకే ఒక్క పార్టీ నోరు మెదుపుతుందని మిగతా పార్టీలు గిరిజనులు, ఆదివాసీలను తరిమేసినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తాము అధికారంలోకి వస్తే గిరిజన ఆడపడచులను చిత్రహింసలకు గురిచేసిన వారి పీచమణిచి వారి భూములు వారికి ఇప్పించేలా చర్యలు తీసుకుంటామన్నారు. గిరిజన కుటుంబాల అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తామని తెలిపారు. ఇక్కడ దోపిడీలు జరుగుతున్నది వాస్తవమేనన్నారు. ఝార్ఖండ్ లో మద్యం కుంభకోణాలు, ఆర్థిక నేరాలు పెరిగిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు.