ఐసీసీ ఛాంపియన్స్ భారత్
ICC Champions India

నా తెలంగాణ, స్పోర్ట్స్ డెస్క్: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భారత్ సత్తా చాటింది. దుబాయ్ లో జరిగిన ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ లో న్యూజిలాండ్ తో భారత్ తలపడింది. టాస్ గెలిచిన న్యూజిలాండ్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. 50 ఓవర్లలో 252 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ఉత్కంఠగా సాగుతుందనుకున్న మ్యాచ్ ను అద్భుతమైన ఆటతీరుతో టెన్షన్ ఫ్రీగా ఆటగాళ్లు మార్చారు. ఫలితంగా ఒక్క ఓవర్ మిగిలి ఉండగానే మరో నాలుగు వికెట్లు మిగిలి ఉండగానే 254 పరుగులు సాధించి అద్భుతమైన విజయాన్ని అందించారు. దీంతో భారత్ ముచ్చటగా మూడోసారి ఐసీసీ ప్రపంచకప్ ను సాధించినట్లయ్యింది.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లకు 251 పరుగులు చేసింది. మైకేల్ బ్రేస్‌వెల్(40 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 53 నాటౌట్), డారిల్ మిచెల్(101 బంతుల్లో 3 ఫోర్లతో 63) హాఫ్ సెంచరీలతో రాణించారు. భారత బౌలర్లలో వరుణ్ చక్రవర్తీ(2/45), కుల్దీప్ యాదవ్(2/40) రెండేసి వికెట్లు తీయగా, మహమ్మద్ షమీ(1/74), రవీంద్ర జడేజా(1/30) తలో వికెట్ పడగొట్టారు.
అనంతరం భారత్ 49 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 254 పరుగులు చేసి గెలుపొందింది. రోహిత్ శర్మ(83 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్స్‌లతో) శతకం చేజార్చుకోగా, శ్రేయస్ అయ్యర్(62 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లతో 48) హాఫ్ సెంచరీ మిస్ చేసుకున్నాడు. కేఎల్ రాహుల్(33 బంతుల్లో ఫోర్, సిక్స్‌తో 34 నాటౌట్) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. న్యూజిలాండ్ బౌలర్లలో మిచెల్ సాంట్నర్ (2/46), మైకేల్ బ్రేస్‌వెల్(2/28) రెండేసి వికెట్లు తీయగా.. రచిన్ రవీంద్ర, కైల్ జెమీసన్ చెరో వికెట్ పడగొట్టారు.
లక్ష్యచేధనకు దిగిన టీమిండియాకు ఓపెనర్లు రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ అదిరిపోయే ఆరంభాన్ని అందించారు. రెండో బంతినే తన ట్రేడ్ మార్క్ ఫుల్ షాట్‌తో సిక్సర్ తరలించిన రోహిత్ శర్మ దూకుడుగా ఆడాడు. శుభ్‌మన్ గిల్(31) నిదానంగా ఆడినా.. రోహిత్ వేగంగా పరుగులు రాబట్టాడు. దాంతో పవర్ ప్లేలోనే టీమిండియా వికెట్ నష్టపోకుండా 64 పరుగులు చేసింది. రోహిత్ శర్మ 41 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. క్రీజులో పాతుకుపోయిన ఈ జోడీని మిచెల్ సాంట్నర్.. గ్లేన్ ఫిలిప్స్ స్టన్నింగ్ క్యాచ్‌తో విడదీశారు. శుభ్‌మన్ గిల్‌ను కళ్లు చెదిరే క్యాచ్‌తో పెవిలియన్ చేర్చాడు. దాంతో తొలి వికెట్‌కు నమోదైన 105 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. ఆ వెంటనే వచ్చిన కోహ్లీ ఒక్క పరుగు వద్దే వెను దిరిగాడు. అనంతరం రచిన్ రవీంద్ర బౌలింగ్ లో రోహిత్ స్టంప్ అవుట్ గా వెనుదిరిగాడు. అక్షర్ పటేల్, శ్రేయస్ అయ్యర్ లు నిలకడగా ఆడుతూ పరుగులు రాబట్టారు.అయ్యర ను సాంట్నర్ అవుట్ చేయగా మరోమారు మ్యాచ్ లో ఉత్కంఠ పెరిగినట్లయ్యింది. రాహుల్ కూడా పెవిలియన్ చేరడం, హార్ధిక్ పాండ్యా విజృంభించడం స్కోరు విజయానికి దగ్గరగా ఉండగా పాండ్యా అవుట్ అయ్యాడు. బ్యాటింగ్‌కు వచ్చిన రవీంద్ర జడేజాతో కలిసి రాహుల్.. సింగిల్స్‌తో విజయం దిశగా జట్టును నడిపించాడు. జడేజా బౌండరీతో విజయం సాధించారు.