ఢిల్లీలో నమో భారత్​ ప్రారంభం

విద్యార్థులతో ముచ్చటించిన ప్రధాని మోదీ

Jan 5, 2025 - 13:14
 0
ఢిల్లీలో నమో భారత్​ ప్రారంభం

నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: ఢిల్లీలో రూ. 12, 200 కోట్లకు పైగా అభివృద్ధి పనులకు ఆదివారం ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. ప్రారంభోత్సవంలో పలువురు పాఠశాల విద్యార్థులను కలిసి నమో భారత్​ రైలును పరిశీలించారు. విద్యార్థులతో కాసేపు ముచ్చటించారు. నమోభారత్​ కారిడార్​ సాహిబాబాద్​ నుంచి న్యూ అశోక్​ నగర్​ సెక్షన్​ ను ప్రధాని మోదీ ప్రారంభించారు. ఈ కారిడార్​ 13 కిలోమీటర్ల మేర ఉండగా ఇందుకు రూ. 4,600 కోట్ల ఖర్చయ్యింది. దీంతో ఢిల్లీ నుంచి మీరట్​ వరకు ప్రయాణాలు మరింత సులభతరం కానున్నాయి. ఆదివారం సాయంత్రం ఐదు గంటల నుంచే నమో భారత్​ రైళ్లు ఈ స్టేషన్ల ద్వారా అందుబాటులోకి రానున్నాయి. 

దీంతో పాటు, 2.8 కిలోమీటర్ల పొడవైన జనక్‌పురి నుంచి కృష్ణా పార్క్ సెక్షన్‌ను ప్రధాని మోదీ ప్రారంభించారు. రూ. 1200 కోట్ల వ్యయంతో రూపొందించిన ఈ ప్రాజెక్ట్ పశ్చిమ ఢిల్లీలోని కృష్ణా పార్క్, వికాస్​ పూరి, జనక్‌పురి ప్రాంతాలకు ప్రయోజనం చేకూరుస్తుంది.

రూ.6,230 కోట్ల వ్యయంతో 26.5 కిలోమీటర్ల పొడవైన రిథాలా-కుండ్లీ సెక్షన్‌కు ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు. ఈ కారిడార్ రిథాలా (ఢిల్లీ)ని నాథుపూర్ (కుండ్లి, హర్యానా)కి కలుపుతుంది. ఇది వాయువ్య ఢిల్లీ, రోహిణి, బవానా, నరేలా, కుండ్లి వంటి హర్యానా ప్రాంతాలకు కనెక్టివిటీని పెంచుతుంది.

రోహిణిలోని కేంద్రీయ ఆయుర్వేద పరిశోధనా సంస్థ (సీఏఆర్‌ఐ) నూతన భవనానికి శంకుస్థాపన చేశారు. రూ.185 కోట్లతో శంకుస్థాపన చేసిన  క్యాంపస్‌లో ఆరోగ్యం, వైద్యం కోసం అత్యాధునిక సౌకర్యాలు ఉండనున్నాయి. ఇందులో అడ్మినిస్ట్రేటివ్, ఓపీడీ, ఐపీడీ, డెడికేటెడ్ ట్రీట్‌మెంట్ బ్లాక్‌లను ఏర్పాటు చేయనున్నారు. ఈ ప్రాజెక్టుల ద్వారా ఢిల్లీ, హరియాణా, ఉత్తరప్రదేశ్‌ల లక్షలాది మంది ప్రజలు కనెక్టివిటీ, ఆరోగ్య సౌకర్యాల ప్రయోజనాలను పొందనున్నారు.