కోల్ కతా నిందితుడిపై దాడికి యత్నం
రాయ్ రిమాండ్ పొడిగింపు
కోల్ కతా: కోల్ కతా మెడికో హత్య కేసులో నిందితుడు సంజయ్ రాయ్ రిమాండ్ ను కోర్టు పొడిగించింది. శుక్రవారం నిందితుడి పోలీస్ కస్టడీ పూర్తి కావడంతో సుప్రీంకోర్టు సీబీఐ కస్టడీకి అప్పగించింది.
కాగా నిందితుడు సంజయ్ రాయ్ ను కోర్టుకు తీసుకురావడంతో న్యాయవాదులు వ్యతిరేకించారు. పెద్ద పెట్టున నినాదాలు చేస్తూ నిందితుడిపై దాడి చేసేందుకు ప్రయత్నించారు. దీంతో స్పందించిన పోలీసులు వెంటనే నిందితుడిని సురక్షితంగా కోర్టులో ప్రవేశపెట్టారు.
మరోవైపు ఈ ఘటనపై నందిగ్రామ్ పోలీస్ స్టేషన్ ముందు బీజేపీ నాయకులు స్టేషన్ ఘెరావ్ చేశారు. పోలీసులతో వాగ్వాదానికి దిగారు. పోలీస్ స్టేషన్ ఆవరణలో ఏర్పాటు చేసిన బారికేడ్లను బద్ధలు కొట్టారు. కాగా మెడికో హత్యపై ప్రపంచవ్యాప్తంగా భారతీయ విద్యార్థులు, విద్యాసంస్థల్లో తమ నిరసనను వ్యక్తం చేస్తున్నారు.
మరోవైపు ప్రిన్సిపాల్ మరో నలుగురు విద్యార్థుల పాలిగ్రాఫ్ టెస్ట్ కు కోర్టు అనుమతించింది. న్యాయాధికారుల ముందు వీరి పాలిగ్రాఫ్ టెస్ట్ చేపట్టనున్నారు. శుక్రవారం ఈ ప్రక్రియ చేపట్టనున్నారు. వీరంతా మెడికో హత్య జరిగిన రోజు ఆమెతోపాటు కలిసి భోజనం చేసినట్లుగా సీబీఐ గుర్తించింది. మరోవైపు మెడికో హత్య, సాక్ష్యాల తారుమారు ప్రణాళిక ప్రకారమే జరిగినట్లు సీబీఐ అనుమానిస్తోంది. ప్రిన్సిపాల్, మరో ఇద్దరు వైద్యుల హస్తం కూడా ఈ అత్యాచారం, హత్య విషయంలో ఉండొచ్చని అనుమానిస్తోంది.