అబద్దాల ‘ఎన్ సైక్లోపీడియా’ కేజ్రీ
మీడియాతో కేంద్రమంత్రి జేపీ నడ్డా

నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: అబద్ధాలకు, అసత్యాలకు బ్రాండ్ అంబాసిడర్ ‘ఎన్ సైక్లోపీడియా’ ఆప్ అధినేత కేజ్రీవాల్ అని కేంద్రమంత్రి జేపీ నడ్డా అన్నారు. ఆదివారం మీడియాతో ప్రత్యేకంగా మాట్లాడుతూ ఆప్ ను లక్ష్యంగా చేసుకొని విమర్శల బాణాలు సంధించారు. ఢిల్లీ ఓటర్లు మార్పు కోసం తహతహలాడుతున్నారని, బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే సంకల్పంతో ఉన్నారని అన్నారు. ఈసారి ఆపద ప్రభుత్వానికి ప్రజలు పూర్తి గుణపాఠం చెప్పనున్నారని అన్నారు. ప్రజలకు డబుల్ ఇంజన్ ప్రభుత్వం కావాలని మనస్సులో నాటుకుపోయిందన్నారు. దీంతో అసత్యాలు, అబద్ధాలకు ఈ ఎన్ సైక్లోపీడియా ద్వారా తెరతీస్తున్నారని విమర్శించారు. మురికివాడల ప్రజలు కూడా ఈసారి తమ మనస్సు మార్చుకున్నారని బీజేపీ ప్రభుత్వానికి పూర్తి మద్ధతు ఇవ్వబోతున్నారని అన్నారు. ఆప్ నాయకులు, ఓటర్లలో గెలుస్తామన్న ధీమానే కోల్పోయారని అన్నారు. దేశంలో ఏ ఎన్నికల్లోనైనా రాజకీయ పార్టీలు తమను తాము రక్షించుకునేందుకు ఏదో ఒక సమస్యను ముందేసి ప్రజలను తప్పుదోవ పట్టించి ఓట్లను దండుకునే ప్రణాళికలకు అంకురార్పణ చేస్తాయన్నారు. ఆప్ కూడా అదే చేసిందన్నారు. బీజేపీ కూడా తమ వ్యూహాంతో ముందుకువెళుతుందని, తమ ఈ వ్యూహంలో ప్రజాసంక్షేమం దాగి ఉందని జేపీ నడ్డా అన్నారు.