కేటీఆర్ జైశ్రీరామ్ కామెంట్స్ రివర్స్!
KTR's comments on Sri Ram's slogan have been reversed
- ‘జైశ్రీరామ్ నినాదం కడుపు నింపదని వ్యాఖ్య
- మాజీ మంత్రి కామెంట్స్ పై రాష్ట్రంలో దుమారం
- అవినీతి, అక్రమాలు చేస్తేనే.. కడుపు నిండుతుందా? అని సోషల్ మీడియాలో ట్రోలింగ్
- ‘హిందుగాళ్లు-.. బొందుగాళ్లు’ అంటూ హిందువులపై గతంలో నోరు పారేసుకున్న కేసీఆర్
- అనుచిత వ్యాఖ్యలతో ప్రజలకు మరింత దూరమవుతున్న గులాబీ నేతలు
నా తెలంగాణ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలో ఉనికి కోసం పోరాడుతున్న బీఆర్ఎస్.. ఆ పార్టీ పెద్దల అనుచిత వ్యాఖ్యలతో ప్రజలకు మరింత దూరం అవుతున్నది. నేతల నోటి దురుసు, బుజ్జగింపు రాజకీయాలపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై దుమారం రేగుతున్నది. ‘‘యువత ఎవరైనా జై శ్రీరాం అంటే సముదాయించాలి. జై శ్రీరాం అనే నినాదం కడుపు నింపదు.. నీకు ఉద్యోగం ఇవ్వదు.. ఉద్వేగాలు కాదు.. ఉద్యోగాలు కావాలి. ఈ రాష్ట్రంలో నిజమైన సెక్యులర్ పార్టీ ఏదైనా ఉందా.. అంటే అది కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ మాత్రమే. మేం కూడా జై శ్రీరామ్ అంటున్నం. కానీ మేం రాముడి పేరు చెప్పి ఓట్లు అడుగుతలేం. నిజమైన హిందువు ధర్మాన్ని ఆచరిస్తున్నాడు. దేవుడిని అడ్డం పెట్టుకుని రాజకీయం చేయడు’’ అని కేటీఆర్ పేర్కొన్నారు.
ఉద్వేగాలతో రెచ్చగొట్టింది ఎవరు?
కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై రాష్ట్రంలో యువత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నది. సోషల్ మీడియాలో హిందూ సంఘాలతోపాటు సాధారణ ప్రజలు కేటీఆర్ కామెంట్స్ ను తప్పు బడుతున్నారు. ఎవరూ జైశ్రీరాం అనొద్దంటూనే.. మళ్లీ ఆయనే తన ప్రసంగంలో తామూ జైశ్రీరాం అంటాం.. కానీ రాముడి పేరు చెప్పి వోట్లు అడుగుతలేం అనడం వివాదాస్పదమైంది. కాగా ఉద్వేగాలతో యువతను రెచ్చగొట్టిన పార్టీ టీఆర్ఎస్ అని యువత, ఉద్యమకారులు అంటున్నారు. పెట్రోల్ పోసుకొని నిప్పు అంటించుకోకుండా.. తెలంగాణ ఉద్యమాన్ని ఉద్వేగంగా, హింసాత్మకంగా మార్చింది టీఆర్ఎస్ పెద్దలేననే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తెలంగాణ కోసం ఆత్మబలిదానాలు చేసుకొని 1200 మంది అమరులైతే.. ఒక్క చుక్క రక్తం చిందించకుండా ఇంటిల్లిపాది ఉద్యోగాలు(పదవులు) పొందింది మీరు కాదా? అని యువత ప్రశ్నిస్తున్నది. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణను అప్పుల పాలు చేసి, కాళేశ్వరం అవినీతి, ధరణి అక్రమాలు, ఫోన్ ట్యాపింగ్, గొర్రెల స్కామ్, భగీరథ, టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీలు ఇలా.. అక్రమాలు చేస్తేనే కడపు నిండుతది కానీ.. జైశ్రీరామ్ నినాదాం కడుపు నింపదా అంటు నిలదీస్తున్నారు.
గతంలో కేసీఆర్ ఇలాగే..
మోదీపై వ్యతిరేకతతో కేసీఆర్ గతంలో.. ‘రామ జన్మభూమి, రావణ జన్మభూమి, శూర్పణఖ జన్మభూమి’’ అని అయోధ్య గుడిపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. అంతకుముందు హిందూగాళ్లు, బొందుగాళ్లు అని అభాసుపాలయ్యారు. ప్రస్తుతం కేటీఆర్ వ్యాఖ్యల సరళి పరిశీలిస్తే ఆ పార్టీ అదే పాత భావజాలంలోనే ఉన్నట్టుగా కనిపిస్తున్నది. ఇంతకాలం అంటకాగిన మజ్లిస్ పార్టీ.. ఇప్పుడు కాంగ్రెస్ పంచన చేరడంతో ముస్లిం ఓట్ల కోసం కేటీఆర్ శ్రీరాముడిపై, హిందూత్వంపై అక్కసు వెళ్లగక్కినట్లు తెలుస్తున్నది. ‘‘సెక్యులరిజం అంటే జైశ్రీరాం అనకపోవడం.. అయోధ్యను గుడ్డిగా వ్యతిరేకించడం, హిందూయిజాన్ని వ్యతిరేకించడం కాదు.. తన దేవుళ్లను ప్రేమిస్తూనే ఇతర మతాలనూ గౌరవించడం’’ అని విశ్లేషకులు కేటీఆర్ కు హితబోధ చేస్తున్నారు.