వైద్యబీమాపై ధీమా లభించేనా?
Is there a discount on medical insurance?
బడ్జెట్ లో ఈ రంగంపై నిర్మలమ్మ నిర్ణయమేంటో?
నా తెలంగాణ, సెంట్రల్ డెస్క్: హెల్త్ కేర్, ఫార్మా రంగం, వైద్య బీమాలపై కేంద్ర బడ్జెట్ లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఏ మేరకు కరుణ చూపనున్నారు? బీమాల ద్వారా బాధితులకు దక్కే మొత్తంపై పన్నులను తగ్గిస్తారా? లేదా హెల్త్ కేర్, ఫార్మా రంగాలకు వరాలు కురిపిస్తారా? అన్నది త్వరలోనే తేలిపోనుంది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ప్రాణాలను రక్షించే కొన్ని రకాల మందులపై జీఎస్టీని తగ్గించింది. అయితే వీటిపై జీఎస్టీని పూర్తిగా ఎత్తివేయాలనే డిమాండ్ కొనసాగుతుంది. అదే సమయంలో విదేశాల నుంచి కీలక సమయాల్లో దిగుమతి చేసుకుంటున్న మందులపై దిగుమతి సుంకాన్ని కూడా పూర్తిగా రద్దు చేయాలనే డిమాండ్ ఉంది.
ఔషధాల ధరలు తక్కువగా ఉండాలని, సులభంగా బీమా సొమ్ము దక్కేలా చర్యలు చేపట్టాలని, ఫార్మా, హెల్త్ కేర్ రంగాలలో పన్నులు తగ్గిస్తే ప్రజలకు ఆధునాతన, సాంకేతిక వైద్యం మరింత చేరువవుతుందనే ప్రభుత్వానికి విజ్ఞప్తులు వచ్చాయి. ప్రస్తుతం భారత్ లో చాలా మంది నిరుపేదలకు బీమాకు దూరంగా ఉన్నారు. దీంతో కేంద్ర, ఆయా రాష్ర్ట ప్రభుత్వాలే రూ. 5 నుంచి రూ. 10 లక్షల వరకు బీమాను కొనసాగిస్తున్నాయి. వీరంతా నిరుపేదలైనందున ప్రైవేట్ బీమా వైపు మొగ్గు చూపడం లేదు. అదే సమయంలో ప్రస్తుతం బీమా తీసుకొని లబ్ధి పొందాలనుకున్న వారికి నిబంధనల పేరుతో పలు ఆటంకాలు ఎదురవుతున్నాయి. ఈ నేపథ్యంలో కూడా వైద్యబీమా తీసుకోవాలని పలువురు భావిస్తున్నా, ఇచ్చే సమయాల్లో వీరి నియమ నిబంధనలపై అనుమానాలు వ్యక్తం చేస్తూ వెనుకడుగు వేస్తున్నారు. ప్రభుత్వ జోక్యంతో ఈ పరిస్థితిలో మార్పు వచ్చే అవకాశం ఉంది.
దేశంలోని ప్రతీ పౌరుడికి జీవిత బీమా ఉండాలన్న లక్ష్యంతో కేంద్రం అడుగులు వేస్తుంది. ఇందుకు గాను కేంద్రం బడ్జెట్ లో ఏ మేరకు కేటాయిస్తుందని, పన్ను తగ్గింపులు ఏ మేరకు ఉండనున్నాయోననే ఆశలు ప్రజల్లో చిగురిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఫార్మా రంగానికి భారీ ఊరటనిచ్చే ప్రకటనలు వెలువడే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. 2030 నాటికి ఈ రంగం 130 బిలియన్ డాలర్లకు చేరుకుంటుంది.2047 ప్రధాని మోదీ సూచించిన విజన్ నాటికి ఈ రంగం రూ. 450 బిలియన్ డాలర్లకు చేరుకోవాలనే లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. ఇందుకోసం దేశీయ ఫార్మా రంగ తయారీదారులను, పరిశ్రమ వర్గాలకు ప్రోత్సాహంతోపాటు భారీ బడ్జెట్ కేటాయింపులు, పన్ను తగ్గింపులు, దిగుమతి సుంకాల తగ్గింపులను ఆశిస్తున్నారు. మరీ కేంద్రమంత్రి నిర్మలమ్మ ఏ మేరకు ఈ రంగాన్ని ఆదుకుంటారో వేచి చూడాల్సిందే.