సమ్మిళిత వృద్ధికి విధానపరమైన స్థిరత్వం అవసరం

Inclusive growth requires policy stability

Mar 4, 2025 - 16:34
 0
సమ్మిళిత వృద్ధికి విధానపరమైన స్థిరత్వం అవసరం

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ
ఆర్థిక క్రమశిక్షణ, పారదర్శక విధానాలతో ముందుకు
పరిశ్రమ వర్గాల్లో విశ్వాసం, నమ్మకాన్ని కలిగించాం
జన్​ విశ్వాస్​ 2.0పై వేగవంతమైన పనులు
పీఎల్​ ఐ ద్వారా 14 రంగాలకు ప్రయోజనం
పారిశ్రామిక రంగానికి వెన్నెముక ఎంస్​ఎంఇ రంగం
రూ. 30లక్షల కోట్ల రుణాలు అందజేత

నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: సమ్మిళిత వృద్ధిని సాధించేందుకు విధాన స్థిరత్వం అవసరమని, ప్రత్యేక సంస్కరణలు కీలక భూమిక పోషిస్తాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. మంగళవారం ఆయా రంగాలను ఉద్దేశిస్తూ వీడియో మాధ్యమంగా ప్రసంగించారు. ఎంఎస్​ ఎంఇ రంగాలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం స్థిరమైన విధానాల ద్వారా ముందుకు సాగుతుందన్నారు. అదే సమయంలో కీలక సంస్కరణలకు చోటు కల్పిస్తున్నట్లు చెప్పారు. బడ్జెట్​ అనంతరం వృద్ధికి ఊతం ఇచ్చే వ్యూహాలను రూపొందిస్తూ ముందకు సాగుతున్నామని చెప్పారు. ప్రస్తుతం తయారీ, ఎగుమతులు, నియంత్రణ, పెట్టుబడుల సంస్కరణలు వంటి కీలక అంశాలపై దృష్టి సారించామని చెప్పారు.

పరిశ్రమల వృద్ధికి నాందీ..
గత పదేళ్లలో కేంద్ర ప్రభుత్వం అవలంభిస్తున్న విధానాలతో బలమైన స్థిరత్వంతో వృద్ధి దిశగా ముందుకు సాగుతున్నామని, ఇందుకు నిరంతర సంస్కరణలు, ఆర్థిక క్రమశిక్షణ, పారదర్శకత, సమ్మిళిత వృద్ధి నిబద్ధతతను చాటుకుంటున్నట్లు తెలిపారు. బలమైన స్థిరత్వం ద్వారా అనువైన వ్యాపార, వాణిజ్యాల పెంపుదల చోటు చేసుకుంటుందని, పరిశ్రమ వర్గాల వృద్ధికి నాందీ పలికామన్నారు. పరిశ్రమ వర్గాల్లో నూతన విశ్వాసాన్ని, నమ్మకాన్ని కల్పించామని అన్నారు. రాబోయే సంవత్సరాల్లో కూడా స్థిరమైన వృద్ధిని కొనసాగించేందుకు మరిన్ని పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నట్లు, ఇందుకు అందరూ సహకరించాలని ప్రధాని మోదీ విజ్ఞప్తి చేశారు.

వ్యాపారం మరింత సులభతరం..
కేంద్ర, రాష్ర్టాలలో వ్యాపారాన్ని సులభతరం చేసేందుకు 40వేలకు పైగా నిర్ణయాల్లో మార్పు చేర్పులు చేస్తూ జన్​ విశ్వాస్​ చట్టాన్ని ప్రవేశపెట్టామన్నారు. ఇప్పటికే జన్​ విశ్వాస్​ 2.0 బిల్లుపై కూడా పనులను వేగవంతం చేశామని మోదీ ప్రకటించారు. అడ్డంకులను తొలగించడం, సరళీకృతం చేయడమే తమ లక్ష్యమని దీంతో మెరుగైన ఫలితాలు సాధించవచ్చన్నారు.  కోవిడ్​ లాంటి సంక్షోభ సమయాన్ని ఎదుర్కొని కూడా భారత్​ ఆత్మనిర్బర్​ అనే దార్శనికతతో పనిచేస్తూ ప్రపంచంలోనే ఆర్థిక వ్యవస్థల్లో పటిష్టంగా నిలవగలిగిందని చెప్పారు. 

1.5 లక్షల కోట్ల పెట్టుబడులు..
ఉత్పత్తి సంబంధిత ప్రోత్సాహక (పిఎల్​ ఐ) పథకం ద్వారా 14 రంగాలకు ప్రయోజనం చేకూర్చామన్నారు. 1.5 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు, రూ. 13 లక్షల కోట్ల విలువైన ఉత్పత్తి, రూ. 5 లక్షల కోట్లకు పైగా ఎగుమతులను సాధించామన్నారు. మరింత విస్తరణను ప్రోత్సహిస్తూ నూతన విధానాలపై కూడా దృష్టి సారించామన్నారు. ప్రపంచ మార్కెట్​ లో ఖర్చులను తగ్గించేందుకు, పోటీతత్వాన్ని పెంచేందుకు మరింత నైపుణ్యాలపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందన్నారు. బొమ్మలు, పాదరక్షలు, తోలు పరిశ్రమలు భారీ అభివృద్ధిని సాధించడమే గాక లక్షలాది ఉద్యోగాలు సృష్టించాయని చెప్పారు. 

రూ. 20 లక్షల కోట్లు పెంచాం..
భారత్​ పారిశ్రామిక వృద్ధికి వెన్నెముకగా ఎంఎస్​ ఎంఇ రంగాల బలోపేతం జరుగుతుందని మోదీ చెప్పారు. పెద్ద పరిశ్రమలతోపాటు చిన్న వ్యాపారాలకు కూడా మద్ధతు ఇవ్వడానికి కీలక సంస్కరణలు చేశామన్నారు. 2‌‌020లో తీసుకున్న నిర్ణయాలను గుర్తు చేశారు. ఎంఎస్​ ఎంఇ ల సంఖ్య ప్రస్తుతం ఆరు కోట్లను దాటిందని చెప్పారు. ఈ రంగంలో ఉద్యోగ కల్పన ఎక్కువగా ఉందన్నారు. పనితీరును విశ్లేషించిన ప్రభుత్వం మరింత ప్రోత్సాహం దిశగా ఈ రంగాలకు బడ్జెట్​ లో పెద్దపీట వేశామని గుర్తు చేశారు. ఒక దశాబ్దం క్రితం ఈ రంగాలు రూ. 12 లక్షల కోట్ల విలువైన రుణాలను దక్కించుకోగా, ప్రస్తుతం రూ. 30 లక్షల కోట్లకు పెంచామన్నారు. రూ. 20 లక్షల కోట్లకు పెంచామని తెలిపారు. ఈ రంగంలో తొలిసారిగా వ్యాపారాన్ని నిర్వహిస్తున్న మహిళలు, ఎస్సీ, ఎస్టీ వర్గాలను  ఆదుకునేందుకు వారి వారి పరిశ్రమల ప్రకారం అత్యధికంగా రూ. 2 కోట్ల వరకు రుణాలను అందిస్తున్నామని ప్రధాని మోదీ తెలిపారు.