6,327కు పెరిగిన డాల్ఫిన్ల సంఖ్య!
The number of dolphins increased to 6,327!

నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: దేశవ్యాప్తంగా గంగా, బ్రహ్మపుత్ర, సింధునదుల పొడవున ఉన్న తీరాల్లో డాల్ఫిన్ల సంఖ్య 6,327కు చేరుకున్నట్లు నేషనల్ ఆక్వేరియం ఆఫ్ ఇండియా వన్యప్రాణి శాస్ర్తవేత్తలు గుర్తించారు. ఈ సర్వే నివేదికను ప్రధాని నరేంద్ర మోదీ విడుదల చేశారు. నివేదిక ప్రకారం అత్యధికంగా డాల్ఫిన్లు కలిగిన రాష్ర్టంగా ఉత్తరప్రదేశ్ నిలిచింది. యూపీలో 2,397, బీహార్ 2,220, పశ్చిమ బెంగాల్ 815, అస్సాం 635, ఝార్ఖండ్ 162 ఉన్నట్లుగా నివేదిక పేర్కొంది. ఈ సర్వే 2021 నుంచి 2024 చివరి వరకు నిర్వహించారు. 8వేల కిలోమీటర్ల విస్తీర్ణంలోని 28 నదులను పరిశీలించి డాల్ఫిన్ల సంఖ్యపై స్పష్టతనిచ్చారు. 2020లో డాల్ఫిన్ల సంఖ్య పెరుగుదల కోసం కేంద్ర ప్రభుత్వం ‘ప్రాజెక్ట్ డాల్ఫిన్’ను ప్రారంభించింది. ఈ కార్యక్రమం డాల్ఫిన్ల పెరుగుదలతోపాటు జీవావరణ వ్యవస్థకు కీలకంగా నిలుస్తుందని శాస్ర్తవేత్తలు హర్షం వ్యక్తం చేశారు. కాగా శాస్ర్తవేత్తలు తొలిసారిగా 2024 డిసెంబర్ లో తొలిసారిగా గంగా నదిలో డాల్ఫిన్ ను ట్యాగ్ చేసి అసోంలోని కామరూప్ బ్రహ్మపుత్ర నదిలో వదిలారు. దీంతో డాల్ఫిన్ల జాతిపై ఉపగ్రహ ట్యాగింగ్ ద్వారా తొలి ప్రయోగాన్ని చేపట్టినట్లయ్యింది. నదీ జలాల్లో డాల్ఫిన్ల సంఖ్య పెరుగుదలతో జల పర్యావరణ వ్యవస్థకు సానుకూల సంకేతమని శాస్ర్తవేత్తలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.