ఉత్తరాఖండ్ లో యూసీసీ అమలు
అధికారులకు శిక్షణ పూర్తి: సీఎం పుష్కర్ సింగ్ ధామి
బీజేపీ తన వాగ్ధానాన్ని నెరవేర్చుకోవడం సంతోషకరం
నెరవేరిన ప్రధాని మోదీ దృక్పథం
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్ లో యూనిఫాం సివిల్ కోడ్ (యూసీసీ) సోమవారం నుంచి అమల్లోకి వచ్చింది. దీంతో ఉత్తరాఖండ్ యూసీసీ అమలైన తొలి రాష్ర్టంగా అవతరించింది. ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి మాట్లాడుతూ యూసీసీ అమలుపై అన్ని జిల్లాల పోలీసు, ఇతర అధికారులకు శిక్షణ పూర్తయ్యిందన్నారు. ఇక ఈ చట్టం తమ రాష్ర్టంలో ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా కొనసాగుతుందన్నారు. ఇందుకు సహకరించిన కేంద్రం, రాష్ర్ట నాయకులు, అధికారులకు ధన్యవాదాలు తెలిపారు. వివక్షత లేని సమాజ నిర్మాణమే తమ లక్ష్యమన్నారు. కులం, మతం, వ్యక్తిగత పౌర విషయాలలో ఈ చట్టం ద్వారా ఏకరూపంలోకి తీసుకువస్తామని ప్రకటించారు.
అభివృద్ధి చెందిన, వ్యవస్థీకృతమైన, సామరస్యపూర్వకమైన, స్వావలంబన కలిగిన దేశం కోసం ప్రధాని మోదీ విస్తృత దృక్పథానికి దోహదపడే యూనిఫాం సివిల్ కోడ్ కు ఉత్తరాఖండ్ నుంచే తొలి అడుగు పడడం సంతోషకరమన్నారు. 2022లో బీజేపీ ఇచ్చిన హామీ నెరవేర్చిందన్నారు. ఈ చట్టం ద్వారా సామాజిక, ఆర్థిక న్యాయానికి ప్రోత్సాహం లభిస్తుందన్నారు. సంక్షేమ రాజ్యాంగ స్థాపన మార్గదర్శకాలను తూ.చ. తప్పకుండా పాటిస్తామన్నారు.
యూసీసీ ప్రకారం ఏం మారబోతుంది..
– యూసీసీ అమలు తరువాత వివాహ నమోదు తప్పనిసరి.
– ఏ మతం, కులం, ఏ వర్గానికైనా విడాకులకు ఒకే రకమైన చట్టాన్ని అమలు చేస్తారు.
– ప్రతి మతం, కులానికి చెందిన ఆడపిల్లల వివాహానికి కనీస వయస్సు 18 సంవత్సరాలు పూర్తవ్వాలి.
– ఒక బిడ్డను దత్తత తీసుకునే హక్కు అన్ని మతాలకు ఉంటుంది.
– ఉత్తరాఖండ్లో హలాలా, ఇద్దత్ వంటి పద్ధతులు పూర్తిగా నిలిపివేస్తారు.
– భార్యాభర్తలు జీవించి ఉంటే మళ్లీ పెళ్లి చేసుకోవడం పూర్తిగా నిషేధం విధించబడుతుంది. ఇది నేరంగా పరిగణించబడుతుంది.
– ఆస్తిలో అబ్బాయిలు, అమ్మాయిలకు సమాన వాటా దక్కుతుంది.
– లివ్-ఇన్ రిలేషన్షిప్స్ (సహజీవనం) కోసం రిజిస్ట్రేషన్ తప్పనిసరి.
– లివ్-ఇన్ రిలేషన్షిప్లో ఉన్న వారి వయస్సు 18 నుంచి 21 ఏళ్లలోపు ఉంటే తల్లిదండ్రుల అనుమతి తప్పనిసరి.
– లివ్-ఇన్ మ్యారేజ్ ద్వారా జన్మించిన బిడ్డకు, వివాహిత జంట పిల్లలకి సమానమైన హక్కులు లభిస్తాయి.