దేశవ్యాప్తంగా ఘనంగా హోళీ!
Holi celebrated across the country!

నా తెలంగాణ, సెంట్రల్ డెస్క్: దేశవ్యాప్తంగా ఘనంగా హోళీ వేడుకలు ప్రారంభమయ్యాయి. సంగీత వాయిద్యాలు, సాంప్రదాయ ఉత్సవాలతో ప్రకృతి సాహజ సిద్ధమైన రంగులను జల్లుకుంటూ ప్రజలు ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు. దేవాలయాలు, వీధుల్లో వేడుకలు నూతనోత్సాహాన్ని నింపుతున్నాయి. చెడుపై మంచి విజయానికి ప్రతీకగా హోళీ వేడుకలు నిలుస్తాయి. మధుర, బృందావన్ ఆలయాల బయట పెద్ద ఎత్తున హోళీ వేడుకల్లో భక్తులు పాల్గొన్నారు. వారనాసి, జైపూర్, ఢిల్లీలోనూ మార్కెట్లలో రంగులు దర్శనమిస్తున్నాయి. రాజస్థాన్ లోని జైసల్వేమర్ శ్రీ లక్ష్మీనాథ్ ఆలయంలో హోళీ వేడుకలు ప్రారంభం అయ్యాయి. సరిహద్దులో బీఎస్ఎఫ్, ఇతర విభాగాలకు చెందిన ఆర్మీ జవాన్లు వేడుకలను అధికారులతో కలిసి ఘనంగా నిర్వహించుకున్నారు. వేడుకల నిర్వహణకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఇండో–పాక్ సరిహద్దులో రంగుల హోళీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సంగీతం, నృత్యాలు, స్వీట్ల పంపకాలు జరిగాయి. ఇక యూపీ విషయానికి వస్తే అయోధ్య, మధుర లాంటి ప్రముఖ ఆలయాల్లో ఇప్పటికే వేడుకలు ప్రారంభమయ్యాయి. కాశీలో చితాభస్మంతో హోళీ నిర్వహించిన అనంతరం రంగులతో హోళీ వేడుకలను నిర్వహించుకున్నారు. మార్కెట్లలో వివిధ రకాల రంగులు, ప్రత్యేక వాటర్ గన్నుల కోసం కొనుగోలుదారులు బారులు తీరారు. ముఖ్యంగా పిల్లలను ఈ తరహా వాటర్ గన్నులు ఆకర్షిస్తున్నాయి.
లక్నోలో ఆరు కిలోల బరువు, 25 అంగుళాల చుట్టుకొలతలో అతిపెద్ద స్వీట్ ను తయారు చేశారు. ఇందుకు 56 రకాల పదార్థాలను వాడారు. దీన్ని అక్కడ ‘గుజియా’గా పిలుస్తారు. మన తెలుగులో అయితే చక్కెరపానకం, పిండితో కూడిన గర్జెలుగా వ్యవహరిస్తారు. ఈ స్వీటు అతిపెద్దది కావడంతో ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ లోకి ప్రవేశించింది.
హోళీ వేడుకల్లో రాజులు..
చరిత్ర ప్రకారం హోళీ అన్ని మతాలకు సంబంధించిన పండుగగా విలసిల్లింది.1325లో మహమ్మద్ బిన్ తుగ్లక్ వేడుకల్లో పాల్గొన్నాడు. అమీర్ ఖుస్రో అనే సుల్తాన్ ఒక ప్రసిద్ధ పాటను కూడా రాశాడు. 1526 లో బాబార్ చక్రవర్తి కూడా హోళీ వేడుకలను నిర్వహించుకున్నారు. 16వ శతాబ్ధంలో సూఫీ కవి మాలిక్ మొహమ్మద్ జయసి కూడా వేడుకలు జరుపుకోవడంపై తన అభిప్రాయాన్ని రచనల ద్వారా పంచుకున్నాడు. బాబర్ తరువాత హుమాయూన్, 1556 నుంచి 1605 వరకు కూడా పండుగను హిందూ–ముస్లింలు కలిసే నిర్వహించారు. జహంగీర్ కాలంలోనూ రాజభవనంలో హోళీ వేడుకలు నిర్వహించారు. ఆ తరువాత షాజహాన్, ఔరంగజేబు కాలంలోనూ ఈ వేడుకలు ఘనంగా నిర్వహించుకునేవారు. మొఘలుల పాలన అనంతరం ఇబ్రహీం ఆదిల్ షా–2 కాలంలో కూడా పర్వదినాన్ని నిర్వహిస్తూ, స్వీట్లు పంచుకునేవారు. ఇలా అన్ని రాజసంస్థానాల్లోనూ హోళీ వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నారనే ఆధారాలు చరిత్రలో లభిస్తున్నాయి. ప్రస్తుతం కొందరు సెక్యూలర్ వాదులు ఈ పండుగ కేవలం హిందువులదేనన్నట్లుగా చిత్రీకరించారు.