డీ డాకింగ్ సక్సెస్
De-docking success

శ్రీహరికోట: అంతరిక్ష చరిత్రలో ఇస్రో మరో పెద్ద విజయాన్ని సాధించింది. స్పాడెక్స్ డీ డాకింగ్ ప్రక్రియను విజయవంతం చేసినట్లు గురువారం ఇస్రో ప్రకటించింది. దీంతో చంద్రయాన్–4కు మార్గం సుగమమైంది. గతంలో రెండు ఉపగ్రహాలను కలిపే డాకింగ్ ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేసింది. ప్రస్తుతం డీ డాకింగ్ విజయవంతంగా పూర్తి చేసింది. దీంతో భవిష్యత్ లో డీప్ స్పేస్ మిషన్లు, స్వదేశీ అంతరిక్ష కేంద్రాన్ని స్థాపించే దిశగా కీలక అడుగు పడినట్లయ్యింది. ఎక్కువ రాకెట్ల ద్వారా ప్రయోగాలు అవసరమైతే ఇన్ స్పేస్ డాకింగ్ సాంకేతిక అవసరం ఉంటుంది.
2024 డిసెంబర్ 30న రెండు ఉపగ్రహాలను అంతరిక్ష కక్ష్యలోకి పంపింది. జనవరి 16న డాకింగ్ ప్రక్రియ చేపట్టి విజయవంతమైంది. దీంతో ఈ ఘనత సాధించిన నాలుగో దేశంగా భారత్ అవతరించింది. మార్చి 15 నుంచి స్పేడెక్స్ ప్రయోగాలు చేపట్టనుందని ఇస్రో చీఫ్ వి. నారాయణన్ ప్రకటించారు.
మరోవైపు స్పేడెక్స్ డీ డాకింగ్ ప్రక్రియ విజయవంతం కావడం పట్ల కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ శుభాకాంక్షలు తెలిపారు. ఉపగ్రహాలు నమ్మశక్యం కాని డీ-డాకింగ్‌ను సాధించాయన్నారు. భారతీయ అంతరిక్ష స్టేషన్, చంద్రయాన్ 4, గగన్‌యాన్‌తో సహా ప్రతిష్టాత్మక భవిష్యత్ మిషన్‌ల సజావుగా నిర్వహణకు మార్గం సుగమం చేస్తుందని సంతోషం వ్యక్తం చేశారు.