పలు పోలింగ్ బూత్ ల వద్ద ఉద్రిక్తత
వినూత్నంగా ఓటు హక్కు వినియోగించుకుంటున్న అభ్యర్థులు
1031మంది అభ్యర్థుల్లో స్వతంత్రులు 464 మంది
హిస్సార్ లో అత్యధికంగా ఏడు స్థానాల్లో ఎన్నికలు
చండీగఢ్: హరియాణాలో శనివారం ఉదయం 7గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. 12 గంటల వరకు 90 స్థానాల్లో 27.20 శాతం పోలింగ్ నమోదైంది. 90సీట్లకు గాను జరుగుతున్న ఓటింగ్ 22 జిల్లాల్లోని 1031 మంది అభ్యర్థులు రంగంలో ఉన్నారు. ఇందులో స్వతంత్రులే 464 మంది ఉండడం గమనార్హం. 2.03 కోట్ల మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. హిస్సార్ జిల్లాలో అత్యధికంగా ఏడు అసెంబ్లీ స్థానాలున్నాయి.
కమలం వైపు మొగ్గు చూపుతున్న ఓటర్లు..
హరియాణాలో తొలిసారిగా ఐదు రాజకీయ పార్టీలు బీజేపీ (భారతీయ జనతా పార్టీ), కాంగ్రెస్, జననాయక్ జనతా పార్టీ (జేజేపీ), ఇండియన్ నేషనల్ లోక్ దళ్ (ఐఎన్ ఎల్డి), ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)లు పోటీలో ఉన్నాయి. బీజేపీ, ఆప్ మినహా అన్ని పార్టీలు పొత్తులతో రంగంలోకి దిగాయి.
ప్రధాన పోటీ బీజేపీ-–కాంగ్రెస్ మధ్యే ఉంది. అధికార బీజేపీ సిర్సా సీటు మినహా అన్ని స్థానాల్లో అభ్యర్థులను బరిలోకి దింపింది. సిర్సాలో హర్యానా లోక్ హిట్ పార్టీకి చెందిన గోపాల్ కందాకు బీజేపీ మద్దతు ఇచ్చింది. మరోవైపు కాంగ్రెస్ కూడా భివానీ మినహా అన్ని ప్రాంతాల్లో ఎన్నికల్లో పోటీ చేస్తోంది. భివానీలో ఓం ప్రకాష్‌ను రంగంలోకి దింపిన సీపీఐ(ఎం)కి కాంగ్రెస్ మద్దతిచ్చింది. ప్రధాన పోటీ బీజేపీ–కాంగ్రెస్ మధ్యే అని విశ్లేషకులు భావిస్తున్నా ఈ రాష్ర్టంలో ‘వార్ వన్ సైడ్’గానే కమలంవైపు ఓటర్లు మొగ్గు చూపుతుండడం విశేషం.
ఉదయం 11 గంటల వరకు పోలింగ్ శాతం జిల్లాల వారీగా..
అంబాలా నాలుగు స్థానాల్లో 25.50 శాతం, భివానీ 4 – 23.45 శాతం, చర్కీ దాద్రి 2 – 20.10 శాతం, ఫరీదాబాద్ 6 – 20.39 శాతం, ఫతేబాద్ 3 – 24.73 శాతం, గురుగ్రామ్ 4 – 17.05 శాతం, హిస్సార్ 7 – 24.69 శాతం, ఝాజ్జర్ 4 – 23.48 శాతం, జింద్ 5 – 27.20 శాతం, కైథల్ 4 – 22.21 శాతం, కర్నాల్ 5 – 24.85 శాతం, కురుక్షేత్ర 4– 23.90 శాతం, మహేంద్రగఢ్ 4– 24.26 శాతం, నూహ్ 3– 25.65 శాతం, పల్వాల్ 3 – 27.94 శాతం, పంచకుల్ 2 – 13.46 శాతం, పానిపత్ 4 – 22.62 శాతం, రేవాడీ 3 – 21. 49 శాతం, రోహ్ తక్ 4 – 22.91 శాతం, సిర్సా 5 – 20.33 శాతం, సోనిపథ్ 6–18.80 శాతం, యమునానగర్ 25.50 శాతం పోలింగ్ నమోదైంది.
అశ్వంపై వచ్చి బీజేపీ ఎంపీ నవీన్ జిందాల్ ఓటు..
భివానీ, రోహ్ తక్, ధోఖేరా, మహేంద్రగఢ్, పోలింగ్ బూత్ ల వద్ద మధ్య ఘర్షణలు చోటు చేసుకున్నాయి. దీంతో అప్రమత్తమైన భద్రతా సిబ్బంది ఘర్షణకు పాల్పడుతున్న వారిని చెదరగొట్టారు. పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. కురుక్షేత్ర బీజేపీ ఎంపీ నవీన్ జిందాల్ గుర్రంపై వచ్చి తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. బీజేపీ నేత బబితా ఫోగట్ చర్కీలో ఓటు వేశారు. సూర్జేవాలా, ఓపీ చౌతాలాలు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. కేంద్రమంత్రి రావు ఇంద్రజిత్ సింగ్ రేవారి రాంపుర గ్రామంలో ఓటు వేశారు. గోపాల్ కందా బీజేపీ అభ్యర్థి సిర్సాలో ఓటుహక్కు వినియోగించుకున్నారు. మాజీ సీఎం భూపేంద్ర సింగ్ హుడా కుటుంబంతో కలిసి రోహ్ తక్ లో ఓటు హక్కు వినియోగించుకున్నారు.