అల్లుడి మాటల వెనక అంతరార్థం!

సీఎం ఊహల్లో హరీష్ రావు

Feb 16, 2024 - 13:53
 0
అల్లుడి మాటల వెనక అంతరార్థం!

నా తెలంగాణ, హైదరాబాద్​:  సీఎం రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ నేత హరీష్ రావు మధ్య రెండు రోజులుగా జరుగుతున్న సంవాదం తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఎప్పుడూ కేసీఆర్ నాయకత్వంలో పని చేస్తామంటూ చెప్పుకొచ్చే హరీశ్ నోట తానే సీఎం అన్న మాటలు విస్మయాన్ని కలిగించాయి. దానికి తగ్గట్టు హరీశ్ రావు బీఆర్ఎస్ ను చీల్చి బయటకొస్తే తమ సంపూర్ణ మద్దతుంటుందని మంత్రి కోమటిరెడ్డి ఆశపెట్టారు.

" మీకు చేతకాకపోతే ప్రభుత్వాన్ని మాకు అప్పజెప్పితప్పుకోండి. రేవంత్ రెడ్డిని రాజీనామా చేయమనండి" అనగానే "కుంగిన మేడిగడ్డ బ్యారేజీ దగ్గర నీళ్లను ఎలా ఆపుతావో.. హరీశ్ నువ్వు చెయ్" అని సీఎం రేవంత్ అంటే ..."నేను ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసి ఆ పని చేసి చూపిస్తా. నాకు బాధ్యత ఇస్తానంటే తీసుకోవటానికి సిద్ధంగా ఉన్నా" అంటూ హరీశ్ నోటి నుంచి వచ్చిన మాటలు ఆసక్తికరంగా మారాయి. ప్రస్తుతం ఏనోట విన్నా ఇదే అంశం చర్చనీయాంశంగా మారింది. కేసీఆర్, హరీశ్ రావు నేతృత్వంలోనే నిర్మితమైన మేడిగడ్డ నాణ్యతలేక కుంగిపోయిందని పలువురు గుర్తు చేస్తున్నారు. అవినీతికి పాల్పడి లోపభూయిష్టంగా నిర్మించిన ప్రాజెక్టుకు మరమ్మతులు చేయడానికి కూడా హరీశ్ రావే సిద్ధపడటం పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 

కాంగ్రెస్ లో  హరీష్ దోస్తులు

గతంలో రంగారెడ్డి జిల్లాలో  హరీశ్ రావు ఫొటోలతో వెలిసిన ఫ్లెక్సీలు చర్చనీయాంశమయ్యాయి. ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో.. అప్పట్లో హరీష్ రావు మంత్రి హోదాలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయనకు ఆహ్వానం తెలుపుతూ.. కాంగ్రెస్ నేతలు కూడా దారి పొడువునా పేరిట ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఈ ఫ్లెక్సీలకు సంబంధించిన ఫోటోలు అప్పట్లో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి.  కాంగ్రెస్ పార్టీ ఫ్లెక్సీ్ల్లో మంత్రి హరీష్ రావు ఫోటో ఉండటమేంటని అటు స్థానికులతో పాటు బీఆర్ఎస్ శ్రేణులు కూడా ఆశ్చర్యపోయారు.

రెచ్చగొట్టేలా మాట్లాడిన రేవంత్

 కాళేశ్వరం ప్రాజెక్టు మీద సీఎం రేవంత్ .. మంత్రులు లేనిపోని ఆరోపణలు చేస్తున్నారంటూ ఫైర్ అవుతున్నారు మాజీ మంత్రి హరీష్. తమపై బురద చల్లే ప్రయత్నంలో రైతులకు అన్యాయం చేయొద్దన్న ఆయన.. కాళేశ్వరం ప్రాజెక్టు గురించి ఎంత తక్కువ చేసి మాట్లాడినా.. అది ముమ్మాటికీ తెలంగాణకు వరదాయినిగా పేర్కొన్నారు. ఆ ప్రాజెక్టు అందించిన ఫలాల గురించి చెప్పకుండా తప్పుడు ప్రచారం చేయటం వల్ల ఎలాంటి లాభం లేదన్నారు. పునరుద్దరణ పనులు చేపట్టేందుకు ఇప్పటికి అవకాశం ఉందని ఇంజినీర్లు చెబుతున్నారన్న హరీష్ ‘‘ కాళేశ్వరంలో తాము ఎలాంటి తప్పులు చేయలేదనే హరీష్ మాటల్లో.. తనను ముఖ్యమంత్రిని చేయాలంటూ రేవంత్ ను డిమాండ్ చేసిన వైనాన్ని గులాబీ నేతలు అంతర్గతంగా చర్చించుకుంటున్నారు. విషయాన్ని అటు తిప్పి.. ఇటు తిప్పి తనను ముఖ్యమంత్రిని చేయాలని హరీశ్ రావు అడగటం ఏమిటి? అని ప్రశ్నిస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో నీళ్లు నింపాలంటే తమకు అధికారం ఇవ్వాలని.. రేవంత్ రాజీనామా చేసినా కేసీఆర్ ను సీఎంను చేయాలన్న మాట హరీష్ నోటి నుంచి రావాలి కానీ.. ఇలా రావటం ఏమిటి? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. 

హరీష్ ఉద్దేశం ఏమిటి?

తనను సీఎం చేయాలంటూ హరీశ్ నోటి నుంచి వచ్చిన మాటను బీఆర్ఎస్ నేతలు అండర్ లైన్ చేసుకోవటం ఆసక్తికరంగా మారింది. ఈ తరహా మాటలు పార్టీకి నష్టం కలిగిస్తాయంటున్నారు. హరీశ్ మాటలో వచ్చిన మార్పుపై గులాబీ బాస్ మరింత ఫోకస్ చేయాలన్న వాదన మొదలైంది. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి హరీశ్ రావును అప్పట్లో దూరం పెట్టారు. హరీష్ కు కాళేశ్వరం పనులు అప్పగించి చివరి దశలో కేసీఆర్ తన గుప్పిట్లో పెట్టుకొని భారీ అవినీతి కాంట్రాక్టర్లకు అవకాశం ఇచ్చారన్న ఆరోపణలొచ్చాయి. ఇప్పుడు పీకల్లోతు కష్టాల్లో ఉన్న కేసీఆర్ రేపు తనదాకా కేసు వస్తే సొంత మేనల్లుడు అని కూడా ఆలోచించడు...హరీష్ ను అడ్డగోలుగా ఇరికించినా ఆశ్చర్యం లేదు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని హరీష్ పరోక్షంగా పార్టీ మారే సంకేతాలు ఇస్తున్నారా? అందుకు కాంగ్రెస్ నేతల సహాయం కావలసి వస్తే తీసుకోవడానికి హరీష్ సిద్ధం అవుతున్నారా?