వైట్ హౌస్ లో గోల్ గప్పా!
అధికారిక కార్యక్రమాల్లో లొట్టలేసుకు తింటున్న అతిథులు
నా తెలంగాణ, సెంట్రల్ డెస్క్: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పట్టుదల, పనితీరుకు నిదర్శనంగానే ప్రపంచదేశాల్లో భారత కీర్తి ప్రఖ్యాతలు మోగుతున్నాయన్న విషయం తెలిసిందే. అదే సమయంలో భారత్ లో అందరూ ఇష్టంగా తినే గోల్ గప్పా (పానీపూరి–గప్ చిప్) పేరు కూడా ఇప్పుడు విదేశీ వంటకాల్లో ఓ భాగంగా మారిపోయింది. పలుమార్లు మోదీ విదేశీ పర్యటనలో ఈ వంటకాన్ని పరిచయం చేశారు. దీంతో ఈ స్పైసీ ఫుడ్ ను ఒంటబట్టించుకున్న వైట్ హౌస్ వర్గాలు ఏదైనా అధికారిక కార్యక్రమం ఉంటే గోల్ గప్పాను మెనూలో తప్పక అందుబాటులో ఉంచుతున్నారు.
బైడెన్ నేతృత్వంలో రోజ్ గార్డెన్ లో ఇటీవలే ఓ రిసెప్షన్‌ను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆసియన్, అమెరికన్లు అనేకమంది పాల్గొన్నారు. ఈ సమావేశం అనంతరం ఎన్నో వంటకాలుండగా అత్యంత ఎక్కువ మంది గోల్ గప్పానే ఇష్టంగా లొట్టలేసుకొని తిన్నారని వైట్ హౌస్ వర్గాలు వెల్లడించడం విశేషం. ప్రస్తుతం వైట్ హౌస్ వంటకాల్లో గోల్ గప్పా కూడా రోజువారీ మెనులో ఉంటుందని సర్వర్లు తెలిపారు. ఏదేమైనా భారత్ లో లొట్టలేసుకొని తినే గోల్ గప్పా కాస్త వైట్ హౌస్ లో బైడెన్ కూడా లొట్టలేసుకొనే తింటున్నారంటారా? తింటూనే ఉంటారు లెండీ. లేకుంటే దీనికి ఇంత ప్రత్యేకత ఎందుకు లభించేది. వార్తల్లో ఎందుకు నిలిచేది.