జాతీయాధ్యక్ష రేసులో జి.కిషన్ రెడ్డి?
G. Kishan Reddy in the race for national presidency?

బీజేపీ జాతీయాధ్యక్షుడి ఎంపిక ఆలస్యం
ఏప్రిల్ 20 నాటికి పూర్తయ్యేనా?
నా తెలంగాణ, సెంట్రల్ డెస్క్: బీజేపీ–ఆర్ఎస్ఎస్ మధ్య జాతీయాధ్యక్షుడి పదవి కేటాయింపు మరికొన్ని రోజులు ఆలస్యం అయ్యేలా కనబడుతుంది. ఈ నేపథ్యంలో బీజేపీ అధిష్ఠానం ఇప్పటికే జాతీయాధ్యక్షుడిగా జేపీ నడ్డా పదవీకాలం 40 రోజులపాటు పొడిగించింది. దీన్ని బట్టి చూస్తే అధ్యక్షుడి ఎంపిక ఏప్రిల్ 20 వరకు పూర్తి కావాల్సి ఉందన పార్టీ వర్గాలు చెబుతున్నా, ఆచరణలో అసాధ్యంలా కనిపిస్తుంది. అదే సమయంలో అధ్యక్ష రేసులో ఉన్న పలువురు ఉత్తరాది, దక్షిణాది నేతల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. దక్షిణాది నుంచి ముందువరుసలో కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి పేరు ప్రముఖంగా వినిపిస్తుంది.
ఆర్ఎస్ఎస్ జేపీ నడ్డా లాంటి బలమైన వ్యక్తి ఎంపికపై ఆలోచనలో ఉంది. మరోవైపు పలువురు కేంద్రమంత్రలు పదవికి పోటీలో ఉన్నా, వారు సౌమ్యులుగానే గుర్తింపు పొందారు. జాతీయాధ్యక్షపదవి అంటే ఆషామాషీ కాదు. ఓ వైపు పార్టీ పటిష్ఠం, మరోవైపు నాయకుల నుంచి కార్యకర్తల వరకు ఒక్కతాటిపైకి తీసుకువెళ్లడం అంటే కత్తిమీద సామే. నిత్యం అనేక విభిన్న, వైరుధ్యాల నడుమ క్లిష్టమైన నిర్ణయాలు కూడా అలవోకగా తీసుకుంటూ అందరి అభిప్రాయాలను గౌరవిస్తూ ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో అలాంటి వ్యక్తి ఎంపిక కోసమే ఆలస్యం ఏర్పడుతున్నట్లు సమాచారం. కాగా ఆర్ ఎస్ఎస్ ఇప్పటికే జాతీయాధ్యక్ష పదవి ఎంపికపై ఒక పేరును ప్రతిపాదించినట్లు తెలుస్తుంది. ఆ పేరెవరిదన్నది మాత్రం తెరమీదకు రావడం లేదు. కేంద్ర ప్రభుత్వం, ఆర్ఎస్ఎస్ అభిప్రాయాల సేకరణ ఇంకా కొనసాగుతుంది.
మరోవైపు బీజేపీ జాతీయాధ్యక్షుడిని ఎన్నుకోవాలంటే రాష్ట్రాల బీజేపీ అధ్యక్షులను కూడా ఎన్నుకోవాల్సి ఉంటుంది. సగానికిపైగా రాష్ర్టాలలో అధ్యక్షుల నియామం చేపట్టాల్సిందే. ఇప్పటికే 36 ప్రాంతాల్లోని 12 రాష్ర్టాల్లో మాత్రమే అధ్యక్ష ఎన్నిక పూర్తయ్యింది. అందులో జమ్మూకశ్మీర్, చండీగఢ్, రాజస్థాన్, లద్ధాఖ్, సిక్కిం, మేఘాలయ, అసోం, అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, గోవా, చత్తీస్ గఢ్, లక్ష్యద్వీప్ లలో అధ్యక్షులను ఎన్నుకున్నారు. అధ్యక్ష ఎన్నికలు ఇంకా పెండింగ్ లో ఉన్న వాటిలో యూపీ, బిహార్, మధ్యప్రదేశ్, హరియాణా, ఢిల్లీ, ఒడిశా, పశ్చిమ బెంగాల్, కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ, కేరళలో బీజేపీ అధ్యక్ష ఎన్నిక జరగాల్సి ఉంది.
అధ్యక్ష రేసులో శివరాజ్ సింగ్ చౌహాన్, మనోహార్ లాల్ ఖట్టర్, ధర్మేంద్ర ప్రధాన్ లాంటి పేర్లు ప్రముఖంగా వినిపిస్తుండగా, అనూహ్యాంగా దక్షిణ భారతదేశం నుంచి ఇప్పటికే తెలంగాణ జాతీయ అధ్యక్షుడిగా కొనసాగుతున్న, కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి పేరు ప్రథమ వరుసలో ఉంది. అటుపిమ్మట బి.ఎల్.సంతోష్, పురంధరేశ్వరీల పేర్లు జాతీయాధ్యక్షుడి ఎంపికలో వినిపిస్తున్నాయి. అమిషాకు దగ్గరగా ఉన్న యూపీకి చెందిన సునీల్ బన్సాల్ పేరు కూడా ప్రతిపాదనలో ఉన్నట్లు తెలుస్తుంది.
కేంద్రమంత్రి జి.కిషన్ రెడ్డి..
బీజేపీ జాతీయాధ్యక్షుడిగా జి.కిషన్ రెడ్డి ఎంపికపై విభిన్న వాదనలు వినిపిస్తున్నప్పటికీ ఆయనకే అన్ని అర్హతలున్నాయనే వాదనలూ బలంగానే వినిపిస్తున్నాయి. ఇటు దక్షిణాది, అటు ఉత్తరాది నేతల్లో కూడా ఈ పదవికి కిషన్ రెడ్డి సరైనవారనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
1977 నుంచి భారతీయ జనతా పార్టీలో సీనియర్ల వెంట, ప్రస్తుతం జూనియర్లను కూడా పార్టీలో రథసారథిలా వెంట తీసుకువెళుతున్నారు. ఇటీవల తెలంగాణలో జరుగుతున్న అన్ని ఎన్నికల్లోనూ సత్తాచాటేలా తీసుకున్న చర్యలు మంచి సత్ఫలితాలితాలిస్తున్నాయి. 1980లో పార్టీ ఏర్పాటైనప్పటి నుంచి ఒకే పార్టీలో ఉంటూ, ఒకే సిద్ధాంతంపై పనిచేస్తున్నారు. వివిధ యువమోర్చాల్లో కీలకంగా వ్యవహరించారు. 2002 నుంచి 2004 వరకు రాష్ర్ట అధ్యక్షుడిగా ఎంపికయ్యారు. 2004లో హిమాయత్ నగర్ స్థానం నుంచి గెలుపొందారు. 2009, 2014 అంబర్ పేట్ నుంచి విజయం సాధించారు. 2010 నుంచి 2014 వరకు ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడిగా, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా ఎంపికయ్యారు. 2019లో సికింద్రాబాద్ లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించారు. 2024 లో కూడా ఇదే స్థానం నుంచి ఘన విజయం సాధించి సత్తా చాటారు. 2019లో పలు కేంద్ర పదవులను అలంకరించారు. జి.కిషన్ రెడ్డి పార్టీలో సుధీర్ఘ పయనం చూసిన ప్రధాని నరేంద్ర మోదీ 3.0 తన కేబినెట్ లో మంత్రి పదవిని అందించారు. ప్రధానమంత్రి మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, జేపీ నడ్డాలకు అత్యంత విశ్వసనీయత, నమ్మకం, దగ్గరి వ్యక్తిగా జి.కిషన్ రెడ్డి నిలిచారు.
ఇక మరో ముఖ్యమైన అంశం ఏమిటంటే దేశవ్యాప్తంగా అందరినీ ఒప్పిస్తూ మరోవైపు జనం సమ్మతిని కాపాడుకునే సత్తా, సామర్థ్యం ఉన్న నాయకుడుగా పేరు పొందారు. బీజేపీ పార్టీ పరంగా ఈయనకు అధ్యక్ష పదవి ఇవ్వాలనే డిమాండ్ ఉంది. ఈ ప్రతిపాదనపై ప్రస్తుతం ఆర్ఎస్ఎస్ తటస్థంగా ఉన్నట్లు తెలుస్తుంది. అదే సమయంలో కిషన్ రెడ్డి పనితీరుతో ఆర్ఎస్ఎస్ పరిగణనలోకి తీసుకుంటుందనే అభిప్రాయాలు కూడా వ్యక్తం అవుతున్నాయి.