ఎన్​ఐఏపై టీఎంసీ దాడి

నిందితుల అరెస్టు కోసం వచ్చిన అధికారులపై రాళ్లు, కర్రలతో దాడులు మండిపడ్డ గవర్నర్, కఠిన చర్యలుంటాయని హెచ్చరిక

Apr 6, 2024 - 17:18
 0
ఎన్​ఐఏపై టీఎంసీ దాడి

కోల్​కతా: ఎన్​ఐఏ (నేషనల్​ ఇన్వెస్టిగేషన్​ఏజెన్సీ)పై పశ్చిమ బెంగాల్​లో దాడి జరిగింది. 2022లో జరిగిన బాంబుపేలుడు కేసులో నిందితులను అరెస్టు చేసేందుకు వచ్చిన ఎన్​ఐఏ బృందంపై స్థానికులు (టీఎంసీ అనుచరులు) శుక్రవారం రాత్రి దాడికి పాల్పడ్డారు. వాహనాలపై రాళ్లు రువ్వారు. మేదినీపూర్, భూపతినగర్​లలో ఉంటున్న ముగ్గురు నిందితులను కోల్​కతా హైకోర్టు ఆదేశాల మేరకు అరెస్టు చేసేందుకు ఎన్​ఐఏ ప్రయత్నించింది.  ఈ సమయంలో స్థానికులంతా మూకుమ్మడిగా ఆందోళన చేస్తూ వారిని అరెస్టు చేయవద్దంటూ భీష్మించుకు కూర్చున్నారు. కోర్టు ఆదేశాలున్నాయని చెప్పినా పట్టించుకోకుండా తమపై, వాహనాలపై రాళ్లతో దాడికి దిగారని ఎన్​ఐఏ అధికారులు వెల్లడించారు. ఈ దాడిలో పలువురికి గాయాలైనట్లు వెల్లడించారు. ఘటనపై గవర్నర్​ సీవీ ఆనంద్​ బోస్​ ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధ్యులపై కఠిన చర్యలు తప్పవన్నారు. 

2022 డిసెంబర్​ 3న భూపతినగర్​లో ఓ ఇంట్లో బాంబు పేలుడు సంభవించి ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ఈ కేసులో ముగ్గురు టీఎంసీ నాయకులను నిందితులుగా ఎన్​ఐఏ పేర్కొంటోంది. జనవరి 5న ఈడీపై దాడి ఘటన మరువకముందే మరో కేంద్ర సంస్థపై బెంగాల్​లో దాడి జరగడంతో కేంద్రం మండిపడుతోంది.