రెండోరోజు కొనసాగుతున్న ఉగ్ర వేట

Furious hunt continues for second day

Jun 11, 2024 - 14:02
 0
రెండోరోజు కొనసాగుతున్న ఉగ్ర వేట

శ్రీనగర్​: రియాసీలో భక్తులపై దాడి చేసిన ఉగ్రవాదుల కోసం మంగళవారం కూడా భద్రతా దళాలు వేట కొనసాగిస్తున్నాయి. ఉగ్రవాదుల ఆచూకీ ఇంకా లభించలేదు. అయితే లష్కరే తోయిబా కమాండర్​ అబూ హమ్జా జమ్మూకశ్మీర్​ లోనే వివిధ జిల్లాల్లో తలదాచుకున్నట్లు గతంలో ఇంటలిజెన్స్​ వర్గాలు గుర్తించాయి. ఆయా ప్రాంతాలపై కూడా నిఘా ముమ్మరం చేశాయి. మరోవైపు ఇంటలిజెన్స్​ సమాచారం ప్రకారం పూంచ్​, రాజోరి జిల్లాల్లోని అటవీ ప్రాంతాల్లో ఈ ఉగ్రవాదులు నక్కి ఉంటూ పలుమార్లు దాడి చేసినట్లు తెలుస్తోంది. అయితే వీరి కోసం పనిచేసే కొందరు స్లీపర్​ సెల్​ లు ఫోన్​ లు కూడా ఉపయోగించకపోవడంతో ఉగ్రవాదులు, స్లీపర్​ సెల్​ లను కనుగొనడంలో భద్రతా దళాలకు ప్రతిబంధకాలు ఎదురవుతున్నాయి. వీరు దాడులు చేశాక ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వెళ్లి తలదాచుకుంటారని, వీరికి స్థానికంగా ఉన్న స్లీపర్​ సెల్​ లు కొందరు సహాయం చేస్తుంటాయని గుర్తించాయి. కాగా రియాసీలో జరిగిన దాడిలో మొత్తం ఐదుగురు ఉగ్రవాదులు ఉన్నట్లుగా భద్రతా దళాలు గుర్తించాయి. వీరి కోసమే వేట ముమ్మరం చేశారు. నియంత్రణ రేఖకు సమీపంలో ఉన్న నంగలి కందియరాలో కూడా ఉగ్రకదలికలను గుర్తించిన ఇంటలిజెన్స్​ సమాచారంతో ఆ ప్రాంతంలో కూడా ముమ్మరంగా ఉగ్రవేట కొనసాగిస్తున్నారు.