దివి నుంచి భువికి.. వ్యోమగాముల బృందం
From the sky to the earth.. a team of astronauts

క్షేమంగా ఫ్లోరిడా తీరంలో ల్యాండింగ్
జాన్సన్ స్పేస్ సెంటర్ కు తరలింపు
ప్రముఖుల హర్షం
ఫ్లోరిడా: ఎట్టకేలకు దివి నుంచి భువికి సునీతా విలియమ్స్(వ్యోమగాముల బృందం) క్షేమంగా తిరిగివచ్చారు. దీంతో 9 నెలలుగా కొనసాగుతున్న ఉత్కంఠతకు తెరపడింది. ఆమె స్పేస్ ఎక్స్ డ్రాగన్ క్యాప్యూల్స్ బుధవారం ఉదయం 3.27 గంటలకు ఫ్లోరిడా తీరంలో సురక్షితంగా దిగింది. స్పేస్ క్యాప్సూల్ చుట్టూ డాల్ఫిన్లు తిరగడం కెమెరాల్లో రికార్డయ్యింది. వీటిపై పలువురు భిన్నవాదనలతో హర్షం వ్యక్తం చేశారు. ప్రమాదం లేదని రూఢీ చేసుకున్నాక సముద్రంలో నుంచి ప్రత్యేక నౌక ద్వారా స్పేస్ క్యాప్సూల్ ను బోటుపైకి తీసుకువచ్చారు. అనంతరం 4.22 గంటల ప్రాంతంలో వ్యోమగాములు బయటికి వచ్చారు. వీరికి బోటులోనే ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం హ్యూస్టన్ లోని జాన్సన్ స్పేస్ సెంటర్ కు తరలించారు. ఇక్కడ వీరికి అన్ని రకాల వైద్య పరీక్షలను నిర్వహించనున్నారు. వీరు భూమిపైకి చేరుకునేందుకు 17 గంటల సుధీర్ఘ సమయం పట్టింది. డ్రాగన్ క్యాప్సూల్ గంటకు 17వేల మైళ్ల వేగంతో భూమి వాతావరణంలోకి ప్రవేశించి కొన్ని నిమిషాల వ్యవధిలోనే పారాచూట్ ల సహాయంతో వేగాన్ని గణనీయంగా తగ్గించగలిగారు.
ఎవరెవరు తిరిగొచ్చారు..
అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఐఎస్) నుంచి సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్, నిక్ హేగ్, రోస్కోస్మోస్ లు తిరిగొచ్చారు.
9 నెలలు ఏం చేశారు..
2024 జూన్ 5న ఎనిమిది రోజుల ప్రయాణం కోసం అంతరిక్ష యాత్రకు వెళ్లిన సునీతా విలియమ్స్, బుల్ విల్మోర్ లు 286 రోజులపాటు అంతరిక్షంలోనే గడపాల్సి వచ్చింది. ఈ సమయంలో విలియమ్స్ 150 ప్రయోగాల్లో పాలుపంచుకున్నారు. 900 గంటలపాటు శాస్ర్తీయ పరిశోధనలు నిర్వహించారు. స్టేషన్ చుట్టూ 16 సార్లు సంచరించారు. 4500 సార్లు భూమిని చుట్టేశారు. అంతేగాక అంతరిక్షంలో 62 గంటల 9 నిమిషాల పాటు అంతరిక్షంలో నడిచి రికార్డు సృష్టించారు.
ప్రధాని నరేంద్ర మోదీ..
సునీతా విలియమ్స్ భూమిపైకి సురక్షితంగా రావడాన్ని ప్రధాని నరేంద్ర మోదీ స్వాగతించారు. ఆమె ధైర్య, సాహసాలు అపరిమిత మానవ స్ఫూర్తికి నిదర్శనమన్నారు. సురక్షితంగా తిరిగొచ్చిన వ్యోమగాములంతా ఎంతో పట్టుదలను ప్రదర్శించారని కొనియాడారు. వీరి అచంచలమైన సంకల్పం లక్షలాది మందికి ఎప్పటికీ స్ఫూర్తినందిస్తూనే ఉంటుందని కొనియాడారు. వ్యోమగాములను భూమిపైకి సురక్షితంగా తీసుకువచ్చేందుకు ప్రయత్నించిన, ప్రార్థించిన ప్రతీ ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. దేశం, ప్రపంచం గర్వించే సమయం అని ప్రధాని సంతోషం వ్యక్తం చేశారు.
కేంద్రమంత్రి జి.కిషన్ రెడ్డి..
భారత కుమార్తెకు స్వాగతం. సునీతా విలియమ్స్ విజయం చారిత్రాత్మకం. అంతరిక్షంలో తొమ్మిది నెలల కాలంలో నిర్వహించిన అనేక ప్రయోగాల విజయవంతం అనంతరం భూమికి తిరిగి రావడం సంతోషకరం. వీరిని సురక్షితంగా తీసుకువచ్చేందుకు శాస్ర్తవేత్తలు, ఇంజనీర్లు ప్రతీ ఒక్కరికి అభినందనలు.
కేంద్రమంత్రి రాజ్ నాథ్ సింగ్..
అంతరిక్ష పరిశోధనలో, చరిత్రలో సునీతా విలియమ్స్ బృందం చరిత్ర సృష్టించారు. మానవ ఓర్పు, పట్టుదలతో చరిత్రను తిరగరాశారు. ఆమె ధైర్యం, పోరాట స్ఫూర్తి ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తాయి.