మహా ఎన్నికల్లో రెండు కూటములకు సవాల్
11 స్థానాల్లో అభ్యర్థుల పోటీ
ఇరు కూటములకు లాభమా? నష్టమా?
స్నేహపూర్వక పోటీ అభ్యర్థులపైనే ఓటర్ల మక్కువ!
నా తెలంగాణ, సెంట్రల్ డెస్క్: మహారాష్ట్ర ఎన్నికల్లో ఓ వైపు బీజేపీ మిత్రపార్టీలు మరోవైపు మహాఅఘాడీ మిత్రపార్టీల స్నేహపోటీ స్థానాలు కూడా భారీ సంఖ్యలోనే ఉన్నాయి. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో రెండు కూటముల పార్టీలు తమ భిన్నమైన గేమ్ తో పరస్పరం పోటీకి దిగుతూ అభ్యర్థులను నిలబెట్టాయి. మహాయుతిలో బిజెపి, శివసేన (ఏక్‌నాథ్ షిండే), ఎన్‌సిపి (అజిత్ పవార్) వంటి ప్రధాన పార్టీలు ఉన్నాయి. మహావికాస్ అఘాడీలో కాంగ్రెస్, శివసేన (యుపిటి), శరద్ పవార్ ఎన్‌సిపి వంటి రాజకీయ పార్టీలు ఉన్నాయి. మహావికాస్ అఘాడిలో ఉన్న రాజకీయ పార్టీలు 6 స్థానాల్లో స్నేహపూర్వక పోటీలో ఉన్నాయి. అదే సమయంలో మహాయుతిలో ఐదు స్థానాల్లో స్నేహపూర్వక పోటీ నెలకొంది. కోరుకున్న స్థానాలు దక్కకపోవడంతో ఆయా పార్టీల్లో తిరుగుబాటు నాయకులు ఎక్కువయ్యారు. దీంతో పార్టీలకు నష్టం తప్పకపోవచ్చనే అభిప్రాయంతో నాయకులను బుజ్జగించేందుకు స్నేహాపూర్వక పోటీకి ఇరు కూటములు జై కొట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది.
మన్‌ఖుర్ద్- శివాజీనగర్, మోర్షి, సింధ్‌ఖేడ్ రాజా, అష్టి, దేవ్‌లాలి అసెంబ్లీ స్థానాల్లో మహాయుతి కూటమి అభ్యర్థులు స్నేహపూర్వక పోటీ అని అనుకున్న ముఖాముఖి పోటీయే నెలకొననుంది. శివాజీ మాన్‌ఖుర్డ్ అసెంబ్లీ స్థానం నుంచి శివసేన అభ్యర్థిగా సురేష్ పాటిల్ పోటీ చేయగా, అజిత్ పవార్ ఎన్సీపీ నవాబ్ మాలిక్‌కు టికెట్ ఇచ్చింది. మోర్షి అసెంబ్లీ స్థానానికి బిజెపి ఉమేష్ యావల్కర్‌కు టికెట్ ఇవ్వగా, అజిత్ పవార్ ఎన్‌సిపి దేవేంద్ర భుయార్‌ను రంగంలోకి దించింది. బోరివలి నుంచి సంజయ్ ఉపాధ్యాయ్‌కు బీజేపీ టికెట్ ఇవ్వగా, తిరుగుబాటు అభ్యర్థిగా బీజేపీ రెబల్ అభ్యర్థి గోపాల్ శెట్టి పోటీ చేస్తున్నారు. నైగావ్‌లో శివసేన తరఫున సుహాస్ కాండే, స్వతంత్ర అభ్యర్థిగా ఎన్‌సీపీ అభ్యర్థి సమీర్ భుజ్‌బల్ పోటీ చేస్తున్నారు.
ఇక మహావికాస్ అఘాడీలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. సమాజ్‌వాదీ పార్టీకి చెందిన అబూ అజ్మీ శివాజీ-మఖుర్ద్ స్థానం నుంచి పోటీ చేస్తుండగా, శివసేన (-యుబిటి) నుంచి రాజేంద్ర వాగ్మారే కూడా పోటీ చేస్తున్నారు. రామ్‌టెక్ స్థానం నుంచి శివసేన యుబిటి అభ్యర్థిగా విశాల్ బర్వాతే, ఆయనపై కాంగ్రెస్ రెబల్ రాజేంద్ర ములక్ పోటీ చేస్తున్నారు. డిగ్రాస్ అసెంబ్లీ స్థానానికి శివసేన యూబిటి నుంచి పవన్ జైస్వాల్ అభ్యర్థి. కాంగ్రెస్ అభ్యర్థి మాణిక్ రావ్ ఠాక్రే ఆయనకు సవాల్ విసురుతున్నారు. శివసేన ఉద్ధవ్ వర్గం రంజిత్ పాటిల్‌కు పరంద్ సీటుపై టికెట్ ఇవ్వగా, శరద్ పవార్‌కి చెందిన ఎన్‌సిపికి చెందిన రాహుల్ మోతేలు ప్రత్యక్ష పోటీలో ఉన్నారు.
ఏది ఏమైనా కూటమిలో దోస్తీ నెలకొని ఉన్న ఈ ఈ 11 స్థానాల్లో మాత్రం ముఖాముఖి, హోరాహోరీ పోరే జరగనుంది. ఓటర్లు కూడా కూటమి నుంచి రంగంలో ఉన్న అభ్యర్థుల కంటే ముఖాముఖి పోటీ అభ్యర్థుల వైపే ఎక్కువగా మొగ్గు చూపుతుండడం విశేషం. ఇది స్నేహపూర్వక పోటీకి సవాల్ విసరనుంది. ఏది ఏమైనా గెలిచే అభ్యర్థులు కూటమిలోని పార్టీల వారే కాబట్టి కూటముల బలం మాత్రం పెరుగుతుంది. అదే సమయంలో ఓట్లలో చీలికలు కూడా పార్టీలకు, కూటములకు నష్టం చేకూర్చే అవకాశం లేకపోలేదు.