పవిత్ర మాసంలోనూ ఉగ్రమూకల విజృంభణ

పాక్​లో రెండు వేర్వేరు దాడుల్లో 18 మంది మృతి

Apr 7, 2024 - 17:18
 0
పవిత్ర మాసంలోనూ ఉగ్రమూకల విజృంభణ

ఇస్లామాబాద్: రంజాన్​ నెలలో కూడా ఉగ్రమూకలు పాక్​లో విజృంభిస్తున్నాయి. రెండు రోజులుగా పాక్​లో వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన ఉగ్రదాడుల్లో 18 మంది మృతి చెందినట్లుగా అధికార వర్గాలు ఆదివారం వెల్లడించాయి. ఖైబర్ ఫఖ్తుంఖ్వా, బలూచిస్తాన్ ప్రావిన్సుల్లో జరిగిన దాడుల్లో మొత్తం 18 మంది మరణించారు. ఇందులో ఆరుగురు భద్రతా సిబ్బంది ఉండగా.. 12 మంది ఉగ్రవాదులు ఉన్నారు. సీనియర్ పోలీస్ అధికారితో సహా ఆరుగురు పోలీసులు మరణించినట్లు అధికారులు తెలిపారు. బలూచిస్తాన్ ప్రావిన్సులో జరిగిన రెండు వేర్వేరు ఘటనల్లో నలుగురు ఉగ్రవాదులు హతమైనట్లు పాకిస్తాన్ సాయుధ దళాల మీడియా విభాగం తెలిపింది. ఖైబర్ ఫఖ్తుంఖ్వా ప్రావిన్సులోని డేరా ఇస్మాయిల్ ఖాన్ జిల్లాలోని కులాచీ తహసిల్‌లోని కోట్ సుల్తాన్ ప్రాంతంలో భద్రతా దళాల కాల్పుల్లో 8 మంది ఉగ్రవాదులు హతమైనట్లు తెలిపారు. హతమైన ఉగ్రవాదుల నుంచి ఆయుధాలు, మందుగుండు సామాగ్రి, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. ఖైబర్ పఖ్తున్‌ఖ్వాలోని లక్కీ మార్వాత్‌లో శుక్రవారం రాత్రి జరిగిన రెండు వేర్వేరు ఘటనల్లో ఒక సాయుధ దుండగుడు, డీఎస్పీ, ఇద్దరు పోలీసులు మరణించగా ఒక కానిస్టేబుల్ గాయపడ్డాడు. రంజాన్ పండగ సందర్భంగా పోలీస్ భద్రత తనిఖీల్లో భాగంగా రద్దీగా ఉండే పెషావర్-కరాచీ హైవేపై డీఎస్పీ గుల్ మహ్మద్, ఇతర పోలీసులతో కలిసి తాత్కాలిక తనిఖీ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. వారు చెక్ పాయింట్ నుంచి తిరిగి వస్తుండగా.. మంజివాల చౌక్ సమీపంలో పోలీస్ వ్యాన్‌‌పై సాయుధ వ్యక్తులు కాల్పులు జరిపారు. దీంతో డీఎస్పీతో సహా పలువురు పోలసీులు మరణించారు.