సంగారెడ్డి మున్సిపాలిటీలో ఉద్యోగుల ఇష్టారాజ్యం 

Employees in Sangareddy Municipality

Aug 24, 2024 - 17:46
 0
సంగారెడ్డి మున్సిపాలిటీలో ఉద్యోగుల ఇష్టారాజ్యం 
బయోమెట్రిక్ ను వినియోగించని వైనం 
విధులకు రాకున్నా పూర్తి హాజరు 
బదిలీపై వచ్చినా సెక్షన్ కేటాయించిన అధికారులు
పనుల కోసం ప్రజలకు చాట్లు 

నా తెలంగాణ, సంగారెడ్డి: ఉమ్మడి మెదక్ జిల్లాలోని గ్రేడ్ వన్ మున్సిపాలిటీగా పేరుగాంచిన సంగారెడ్డి మున్సిపాలిటీలో ఉద్యోగులు, సిబ్బంది తమ ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. పాలన అధికారితో పాటు జిల్లా అధికారులందరూ సంగారెడ్డిలో అందుబాటులో ఉన్నప్పటికీ ఏ మున్సిపాలిటీలో మాత్రం ఉద్యోగులు సిబ్బంది సమయపాలన పాటించకపోవడం గమనార్హం. 
 
సంగారెడ్డి మున్సిపాలిటీలో కాంట్రాక్ట్, ఔట్​ సోర్సింగ్, పర్మనెంట్ పద్ధతిలో విధులు నిర్వహించే ఉద్యోగులు, సిబ్బంది సుమారు 65 మంది వరకు ఉంటారు. వీరికి హాజరు నమోదు చేసేందుకు కార్యాలయంలో బయోమెట్రిక్ ఏర్పాటు చేసినా దాన్ని ఏనాడు  వినియోగించకుండా నిరుపయోగంగా వదిలేశారు. కార్యాలయానికి ఉదయం 10 గంటలకు రావాల్సిన సిబ్బంది సమయపాలన పాటించకుండా  మధ్యాహ్నం 12 గంటల వరకు వస్తున్నారు. విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్న అధికారులు మాత్రం ఎలాంటి చర్యలు చేపట్టడం లేదు. కొన్ని శాఖల్లో నెల మొత్తం విధులు నిర్వహించినా నెలల తరబడి జీతాలు రాక ఇబ్బందులు పడుతుంటే ఇక్కడ మాత్రం విధులకు రాకపోయినా అధికారులకు అనుకూలంగా ఉన్న వారికి నెలకు మొత్తం జీతం అందిస్తుండడం విడ్డూరం కలిగిస్తోంది. 
 
అధికారుల మెప్పు పాలకుల అండ ఉంటే చాలు తాము సక్రమంగా విధులు నిర్వహించకపోయినా జీతాలు మొత్తం పూర్తిస్థాయిలో వస్తాయనే ధీమాలో కొందరు ఉద్యోగులు సిబ్బంది వ్యవహరిస్తున్నారని విమర్శలు లేకపోలేదు. ఇక అటెండర్ల విషయానికి వస్తే ఎవరైనా మున్సిపల్ కార్యాలయానికి కొత్తవారు వచ్చి ఏదైనా సమాచారం అడిగితే తమకు తెలియదని నిర్లక్ష్యంగా సమాధానం ఇస్తున్నారని స్థానికులు వాపోతున్నారు. 
 
బదిలీపై వచ్చినా సెక్షన్ లు కేటాయించని వైనం..
 
రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలోని అన్ని శాఖల కార్యాలయంలో బదిలీ ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఇదే క్రమంలో వివిధ ప్రాంతాల నుంచి సంగారెడ్డి మున్సిపాలిటీకి బదీలిపై వచ్చి నెల గడుస్తున్నప్పటికీ వచ్చిన సీనియర్, జూనియర్ అసిస్టెంట్లు ఆరుగురు వచ్చినా ఇద్దరికీ మాత్రమే సెక్షన్ లు కేటాయించి మరో నలుగురికి కేటాయించకపోవడంతో వారు ఆందోళన చెందుతున్నారు. ఇదిలా ఉండగా ఇంటి నంబర్లు కేటాయించాలని మ్యూటేషన్ చేయించుకోవాలని స్థానిక ప్రజలు మున్సిపల్ కార్యాలయం చుట్టూ తిరుగుతూ ఆయా సెక్షన్లలో అధికారులు లేకపోవడంతో నిరాశతో వెను తిరుగుతున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి ఉద్యోగులు సిబ్బంది సక్రమంగా విధులకు వచ్చేలా చూడాలని, పలు సెక్షన్లలో అధికారులను నియమించి తమ ఇబ్బందులను తొలగించాలని ప్రజలు కోరుతున్నారు.