శాసనసభా పక్ష నేతగా నయాబ్​ సైనీ ఎన్నిక

రేపే సీఎంగా ప్రమాణ స్వీకారం

Oct 16, 2024 - 13:28
 0
శాసనసభా పక్ష నేతగా నయాబ్​ సైనీ ఎన్నిక
ప్రధాని సహా హాజరుకానున్న ప్రముఖులు
పార్టీ నిర్ణయం గవర్నర్​ కు నివేదిక
ముగ్గురు స్వతంత్రుల పూర్తి మద్ధతు
డబుల్​ అభివృద్ధి మోదీతోనే సాధ్యం: అమిత్​ షా
చండీగఢ్​: హరియాణా శాసనసభా పక్ష నేతగా నయాబ్​ సైనీ ఎన్నికయ్యారు. బుధవారం కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్​ షా నేతృత్వంలోని రాష్ర్ట శాసనసభా పక్ష నాయకుని ఎన్నిక సమావేశం పంచకులలో జరిగింది. ఈ సమావేశంలో మాజీ హోంమంత్రి అనిల్​ విజ్​, ఎమ్మెల్యే కృష్ణబేడీ సైనీ నయాబ్​ సైనీ పేరును ప్రతిపాదించగా బీజేపీ ఎమ్మెల్యేలతోపాటు పలువురు స్వతంత్ర ఎమ్మెల్యేలు తమ మద్ధతు ప్రకటించారు. ఈ సమావేశానికి మధ్యప్రదేశ్​ సీఎం మోహన్​ యాదవ్​, కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, మనోహర్ లాల్ ఖట్టర్, బిప్లబ్ కుమార్ దేబ్, డాక్టర్ సతీష్ పూనియా, మోహన్ లాల్ బడోలీ, ఇతర బీజేపీ నేతలు హాజరయ్యారు. 
 
దీంతో హరియాణా సీఎం ఎవరన్నదానికి తెరపడినట్లయ్యింది. గురువారం ఉదయం 11 గంటలకు పంచకులలోని షాలిమార్​ మైదానంలో ప్రమాణ స్వీకారోత్సవం చేయనున్నారు. ఇందుకోసం భారీ ఏర్పాట్లను సిద్ధం చేసే పనిని అధికార యంత్రంగం ముమ్మరం చేసింది. ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సహా ఎన్డీయే మిత్రపక్షాలకు చెందిన 40 నుంచి 50 మంది వరకు ప్రముఖులు హాజరుకానున్నారు. 
 
అమిత్​ షా నేతృత్వంలో శాసనసభా పక్ష నేతగా ఎన్నికైన నయాబ్​ సైనీ నేరుగా రాజ భవన్​ కు వెళ్లి ప్రభుత్వ ఏర్పాటుపై గవర్నర్​ కు వివరాలను సమర్పించారు. రాజ్​ భవన్​ కు వెళ్లిన వారిలో ముగ్గురు స్వతంత్ర ఎమ్మెల్యేలు సావిత్రి జిందాల్​, దేవేంద్ర కడియన్​, రాజేష్​ జూన్​ లు ఉన్నారు. వీరు స్వతంత్రలుగా పోటీ చేసి విజయం సాధించి బీజేపీకి తమ సంపూర్ణ మద్ధతును ప్రకటించారు. 
 
మోదీ నేతృత్వంలో సుభిక్ష పాలన: అమిత్​ షా
ఈ సందర్భంగా అమిత్​ షా ప్రసంగిస్తూ మోదీ నేతృత్వంలో మూడోసారి డబుల్​ ఇంజన్​ ప్రభుత్వం వచ్చిందన్నారు. నయాబ్​ సైనీ అన్ని వర్గాలను దృష్టిలో పెట్టుకొని సుభిక్ష పరిపాలన అందించిన అనుభవం ఉన్న వ్యక్తి అని కొనియాడారు. బీజేపీ అన్ని వర్గాలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ పరిపాలన కొనసాగిస్తుందన్నారు. గత పదేళ్లలో మోదీ ప్రభుత్వం రూ. 2.75 లక్షల కోట్లను రాష్​ర్ట అభివృద్ధికి సమకూర్చిందన్నారు. అదే కాంగ్రెస్​ ప్రభుత్వంలో కేవలం 40వేల కోట్లను కేటాయించడాన్ని ప్రస్తావించారు. మోదీ విజన్​ సూటిగా ఉందని, అన్ని వర్గాలను ప్రభుత్వంలో భాగస్వామ్యం చేస్తూ అభివృద్ధి దిశగా ముందుకు సాగాలన్నదే తమ ప్రధాన ఉద్దేశ్యమన్నారు. నయాబ్​ సైనీ శాసనసభా పక్ష నేతగా ఎన్నికైనందుకు అభినందనలు తెలిపారు.