విపత్తులపై ముందస్తు హెచ్చరికలు

Early warnings of disasters

Aug 20, 2024 - 15:10
 0
విపత్తులపై ముందస్తు హెచ్చరికలు
  • ప్రాణ, ఆస్తినష్టాల తగ్గింపు
  • నేషనల్​ జియోసైన్స్​ అవార్డు’ల్లో రాష్ర్టపతి ద్రౌపదీ ముర్మూ పిలుపు
  • భవిష్యత్​ తరాలకు ప్రేరణ జియో సైన్స్​: కేంద్రమంత్రి జి.కిషన్​ రెడ్డి

నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: విపత్తులు, ప్రకృతి వైపరీత్యాల వల్ల ఆస్తి, ప్రాణనష్టాలను తగ్గించేందుకు శాస్ర్తవేత్తలు మరింత ఆధునికతతో పనిచేయాల్సిన అవసరం ఉందని రాష్ర్టపతి ద్రౌపదీ ముర్మూ అభిప్రాయం వ్యక్తం చేశారు. మంగళవారం న్యూ ఢిల్లీలోని రాష్ర్టపతి భవన్​ లో ‘నేషనల్​ జియోసైన్స్​ అవార్డు’లను 21 మందికి రాష్ర్టపతి ముర్మూ ప్రదానం చేశారు.

ఈ సందర్భంగా రాష్ర్టపతి మాట్లాడుతూ.. దేశంలోని అనేక కొండ, అటవీ ప్రాంతాల్లో ప్రకృతి వైపరీత్యాలపై రాష్ట్రాలకు ముందస్తు హెచ్చరికలు జారీ చేసేందుకు కోల్‌కతాలో నేషనల్ ల్యాండ్‌స్లైడ్ ఫోర్‌కాస్టింగ్ సెంటర్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు ఆమె తెలిపారు. ఈ వైపరీతయాలలో ప్రాణనష్టాన్ని తగ్గించేందుకు ఫూల్‌ప్రూఫ్ ఫోర్‌కాస్టింగ్ సిస్టమ్‌ను రూపొందించాలని రాష్ట్రపతి శాస్ర్తవేత్తలకు పిలుపునిచ్చారు.

2047 నాటికి ఖనిజ రంగం దేశాభివృద్ధిలో కీలకభూమిక పోషించనుందని తెలిపారు. ఈ రంగం అనేక సంస్కరణలు, ఆవిష్కరణల దిశగా ఆర్థికాభివృద్ధిని సాధిస్తుందని తెలిపారు. అదే సమయంలో పర్యావరణ పరిరక్షణకు కూడా చర్యలు తీసుకోవడం సంతోషకరమని రాష్ర్టపతి తెలిపారు. 

12 కేటగిరిల్లోని 21 మంది శాస్ర్తవేత్తలకు రాష్​ర్టపతి ముర్మూ జియోసైన్స్​ అవార్డులను అందజేశారు.  


సాంకేతికత దిశగా గనుల శాఖ: కేంద్రమంత్రి జి.కిషన్​ రెడ్డి..

కేంద్ర గనుల శాఖ ఆధునిక సాంకేతికత దిశగా సాగుతోందని తెలంగాణ రాష్​ర్ట బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్​ రెడ్డి అన్నారు. గనుల శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటైన ఈ అవార్డుల కార్యక్రమంలో కేంద్రమంత్రి జి.కిషన్​ రెడ్డి పాల్గొని ప్రసంగించారు. 

గనుల పరిశ్రమ శాఖలో శాస్ర్తవేత్తల పాత్ర కీలకమైందని ప్రశంసించారు. మోదీ వికసిత్​ భారత్​ లక్ష్యాన్ని గనుల శాఖ సాధించడంలో కీలకపాత్ర వహిస్తుందన్నారు. ఏఐ, మిషన్​ లెర్నింగ్​, డ్రోన్​ లాంటి అత్యాధునిక సాంకేతికతను వాడి ఈ శాఖలో మరింత అభివృద్ధిని సాధిస్తామన్నారు. జియో సైన్స్​ భవిష్యత్​ తరాలకు ఒక ప్రేరణగా నిలవనుందని కేంద్ర మంత్రి జి.కిషన్​ రెడ్డి తెలిపారు. మైనింగ్​ క్షేత్రంలో ప్రపంచదేశాల్లో ముందువరుసలో ఉండేందుకు నిబద్ధతతో పనిచేస్తున్నామని మంత్రి తెలిపారు. మైనింగ్​ శాఖ వృద్ధికి తీసుకోవాల్సిన అన్ని చర్యలను తీసుకుంటూనే మోదీ వికసిత్​ భారత్​ లో కీలకంగా మారనున్నామని కేంద్రమంత్రి జి.కిషన్​ రెడ్డి స్పష్టం చేశారు.