మోసం చేస్తారా? రైతు ఋణాల మాఫీ ఏదీ?
Do you cheat? Any waiver of farmer loans?
- 23న రైతులతో ధర్నా
- 60 లక్షల మందికి 22 లక్షలమందికే ఋణమాఫీయా?!
- రూ. 49 కోట్లకు రూ. 17వేల కోట్లే ఇస్తారా?
- మరోసారి దరఖాస్తులా?
- బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆగ్రహం
నా తెలంగాణ, నిర్మల్: రైతుల ఋణాలను మాఫీ చేస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం ఇప్పటికీ పెండింగ్ లో ఉన్న రైతుల ఋణాలను త్వరలో మాఫీ చేయాలని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి డిమాండ్ చేశారు. రైతు భరోసాకు ఇవ్వాల్సిన నిధులనే ఋణమాఫీకి మళ్లించి రైతులను మోసం చేశారని మండిపడ్డారు. త్వరలో మిగతా రైతుల ఋణాలు మాఫీ చేయని పక్షంలో నిర్మల్ జిల్లా కేంద్రంలో ఈ నెల 23న రైతులతో పెద్ద ఎత్తున ధర్నాకు దిగుతామని ఏలేటి హెచ్చరించారు.
నిర్మల్ లో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఇప్పటికే రెండు పంటలకు రైతు భరోసా సాయం ఇవ్వకుండా ఎగ్గొట్టి రైతులను వంచించారని అన్నారు. రాష్ట్రంలో 60 లక్షల మంది రైతులు అర్హులుండగా కేవలం 22 లక్షల మందికే ఋణమాఫీ చేయటం ఏంటని నిలదీశారు? రూ. 49వేల కోట్లు ఋణమాఫీకి ఇవ్వాల్సిఉండగా కేవలం రూ. 17వేల కోట్లే ఇచ్చి రైతులను మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఋణమాఫీ కాని రైతులను కూడా మోసం చేసేందుకే మరోసారి దరఖాస్తులు చేసుకోమన్నారని, ఇదీ మోసమే నని ఆయన విమర్శించారు. హామీ మేరకు ఋణమాఫీ చేయలేకనే రేవంత్ సర్కార్ చేతులెత్తేసిందన్నారు. రైతులందరికీ ఋణాలు మాఫీ చేసామంటున్న సీఎం రేవంత్ రెడ్డి తమ ఋణాలు మాఫీ కాలేదంటూ క్షేత్ర స్ధాయిలో నిరసనలు తెలుపుతున్న రైతులకు ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులకు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు దమ్ముంటే గ్రామాలకు వెళ్లి పూర్తి స్ధాయిలో రైతులకు ఋణాలు మాఫీ అయ్యాయో లేదో? ఆరా తీయాలన్నారు.
మూడు విడతల్లో ఋణమాఫీ చేసిన రైతుల వివరాలు వారం రోజుల్లోగా ప్రభుత్వం వెల్లడించాలని, పెండింగ్ లో ఉన్న రైతుల ఋణాలను ప్రభుత్వం మాఫీ చేయాలని డిమాండ్ చేశారు. రైతు భరోసా ఖరీఫ్ సీజను డబ్బులను ఈ నెలాఖరులోగా రైతులకు ఇవ్వాలన్నారు. నిర్మల్ లో 23న చేపట్టే రైతు ఉద్యమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేసి ప్రభుత్వంపై పోరు సాగిస్తామన్నారు.