ఈవీఎం డేటా తొలగించొద్దు

ఎన్నికల కమిషన్​ కు సుప్రీం ఆదేశం

Feb 11, 2025 - 17:42
 0
ఈవీఎం డేటా తొలగించొద్దు

నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: ఈవీఎంలోని డేటాను తమ అనుమతి లేకుండా తొలగించడం చేయొద్దని సుప్రీంకోర్టు ఎన్నికల కమిషన్​ ను ఆదేశించింది. సుప్రీంలో డేటా తొలగింపుపై దాఖలైన పిటిషన్​ ను మంగళవారం సీజేఐ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తాతో కూడిన ద్విసభ్య  ధర్మాసనం విచారించింది. పిటిషన్​ ను హరియాణా మాజీ మంత్రి కరణ్​ సింగ్​ దలాల్​, ఎమ్మెల్యే లఖన్​ కుమార్​ సింగ్లా లు దాఖలు చేశారు. ఈవీఎం వెరిఫికేషన్​ కోసం సమగ్ర విధానాన్ని రూపొందించాలని సుప్రీంను కోరారు. ఈవీఎం మెమొరీ, మైక్రో కంట్రోలర్​ ను తొలగించే ప్రక్రియ గురించి ఎన్నికల సంఘం సుప్రీం అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. 

ఈవీఎం..

– తొలిసారిగా భారత్​ లో ఈవీఎంలు 1982 కేరళ పారావూర్​ అసెంబ్లీ ఎన్నికల్లో 50 పోలింగ్​ కేంద్రాల్లో ఉపయోగించారు. 
– ఈ ఎన్నికల ఫలితాలను ఓడిన అభ్యర్థి కోర్టులో సవాల్​ చేశారు. దీంతో మరోమారు ఫలితాలను సరిచూసి ఎలాంటి అవకతవకలు, అనుమానాలు అక్కర్లేదని కోర్టు తీర్పు నిచ్చింది.
– సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు 1988లో రిప్రజెంటేషన్​ ఆఫ్​ పీపుల్​ యాక్ట్​ 1951 చట్టంలో సెక్షన్​ 61ని జోడించారు. దీంతో ఈవీఎంల వినియోగానికి మార్గం సుగమమైంది. 
– 1998 నవంబర్​ మధ్యప్రదేశ్​ లోని ఐదు, రాజస్థాన్​ లోని ఆరు, ఢిల్లీలోని ఆరు అసెంబ్లీ స్థానాలకు ఈవీఎంల ద్వారా ఎన్నికలను నిర్వహించారు. 
– 2004 దేశంలోని అన్ని పార్లమెంట్​ నియోజకవర్గాల ఎన్నికల్లో 17.5 లక్షల ఈవీఎంలను వినియోగించారు.
– ఈవీఎంలలో రెండు యూనిట్లుంటాయి. బ్యాలెట్​ యూనిట్​ ద్వారా ఓటు వేస్తారు. ఓటింగ్​ పూర్తి అయ్యాక ప్రిసైడింగ్​ అధికారి తన వద్ద ఉన్న కంట్రోల్​ యూనిట్​ ను సీజ్​ చేస్తారు. దీంతో ఫలితాలు ఈవీఎంలలో నిక్షిప్తం అవుతాయి. 
– ఒక్క ఈవీఎంలో రెండు వేల ఓట్లు నిక్షిప్తం అవుతాయి. బ్యాలెటింగ్​ యూనిట్​ లో 16 మంది అభ్యర్థుల పేర్లను నమోదుకు అవకాశం ఉంటుంది. ఎక్కువమంది అభ్యర్థులుంటే రెండు ఈవీఎంలను వినియోగిస్తారు. 
– 1989–90లో ఈవీఎంల ధర రూ. 5500. ఈ ఈవీఎంలు విద్యుత్​ లేకపోయినా బ్యాటరీతో పనిచేసేలా రూపొందించారు.