మిజోరం అభివృద్ధికి రోడ్ మ్యాప్ సిద్ధం
కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా

ఐజ్వాల్: మిజోరం అభివృద్ధికి రోడ్ మ్యాప్ సిద్ధం చేశామని, ఇప్పటికే రూ. 2500 కోట్లు ఖర్చు చేశామని, మరో రూ. 1600 కోట్లతో నాలుగు లేన్ల జాతీయ రహదారి నిర్మాణం చేపట్టే పనులు కొనసాగుతున్నాయని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. శనివారం అసోం రైఫిల్స్ ప్రధాన కార్యాలయాన్ని సెంట్రల్ ఐజ్వాల్ నుంచి జోఖావ్సాంగ్ కు మార్చిన సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో అమిత్ షా పాల్గొని ప్రసంగించారు. అసోం రైఫిల్స్, ప్రభుత్వానికి మధ్య కేవలం భూమార్పిడి మాత్రమే కాదన్నారు. ఇక్కడి ప్రజల ఆకాంక్షలకు తాము నిబద్ధతతో పనిచేశామన్నారు. కొండపట్టణమైన ఐజ్వాల్ ను మెరుగైన నగరంగా తీర్చిదిద్దాలనేదే తమ లక్ష్యమన్నారు. ఇందులో భాగంగా స్థలం కావాల్సి ఉంటుంది కాబట్టి ఈ మార్పు జరిగిందని చెప్పారు. గత పదేళ్లుగా మోదీ నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం ఈశాన్య ప్రాంతాలను బలోపేతం చేస్తున్న విధానాన్ని, ఐక్యం చేసే ప్రయత్నాలను ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు. ఈశాన్య ప్రాంతాల్లో పర్యాటకం నుంచి సాంకేతికత, క్రీడలు, వ్యవసాయం, వ్యవస్థాపకత, రవాణా ఇలా అన్ని రంగాల్లో సమాన అభివృద్ధిని సాధించాలని లక్ష్యాలను నిర్దేశించుకున్నామని తెలిపారు. 2014 నుంచి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈశాన్య ప్రాంతాలలో 78 సార్లు పర్యటించారని చెప్పారు. అంటే ప్రధాని మోదీ ఈశాన్య ప్రాంతాల అభివృద్ధికి, ఇక్కడి ప్రజల సంక్షేమానికి ఎంతలా కట్టుబడి ఉన్నారనేది ఇట్టే తెలిసిపోతుందన్నారు. గత పదేళ్లలో మిజోరంలో మొత్తం రూ. 5000 కోట్ల పెట్టుబడి పెట్టామన్నారు. ఈ ప్రాంతంలో హెలిప్యాడ్ ల నిర్మాణం కూడా జరుగుతుందన్నారు. ఈ ప్రాంతానికి రైల్వే లైన్, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి, పరిశోధనా కేంద్రాన్ని నిర్మించేందుకు రూ. 600 కోట్లు కేటాయించామన్నారు. ఇక్కడ ఒక జలవిద్యుత్ ప్రాజెక్టును కూడా నిర్మిస్తున్నామని తెలిపారు. మెరుగైన సాంకేతిక వ్యవస్థ అందించేందుకు 314 మొబైల్ టవర్లను కూడా ఏర్పాటు చేశామన్నారు. శాంతియుతమైన, అందమైన మిజోరంగా మార్చేందుకు మోదీ ప్రభుత్వం అన్ని ప్రయత్నాలను చేస్తుందని అమిత్ షా పునరుద్ఘాటించారు.