41దేశాలపై ట్రావెల్​ బ్యాన్​!

మరో సంచలన నిర్ణయానికి ట్రంప్​ సిద్ధం?

Mar 15, 2025 - 16:44
 0
41దేశాలపై ట్రావెల్​ బ్యాన్​!

గతంలోనూ ఇలాంటి నిర్ణయంపై సుప్రీంకోర్టు సమర్థన!

వాషింగ్టన్​: అమెరికా అధ్యక్షుడు ట్రంప్​ మదిలో ఏముందో చెప్పడం కష్టమే కాదు.. ఊహించడం కూడా ఊహాకందని దూరమే అవుతుంది. తాజాగా డోనాల్డ్​ ట్రంప్​ మరో సంచలన నిర్ణయానికి తెరతీయబోతున్నట్లు తెలుస్తుంది. 41 దేశాలపై ట్రావెల్​ బ్యాన్​ విధించబోతున్నట్లు అమెరికా అధ్యక్ష కార్యాలయ వర్గాలు పేర్కొంటున్నాయి. వీరు అందించిన సమాచారం మేరకు పలు ఉగ్రవాద దేశంగా ముడిపడి ఉన్న దేశాలను మూడు భాగాలుగా విభజించారు. తొలి భాగంలో ఉన్న దేశాలైన ఆఫ్ఘానిస్థాన్​, ఇరాన్​, సిరియా, క్యూబా, ఉత్తర కొరియా వంటి దేశాలకు వీసాలు పూర్తిగా రద్దు చేయనున్నారు. రెండో వరుసలో ఉన్న సూడాన్​, మయన్మార్​, లావోస్​ లాంటి ఐదు దేశాలకు పర్యాటక, విద్యార్థి వీసాలు గాకుండా ఇతర తరహా వీసాలపై కఠిన ఆంక్షలు విధించనున్నారు. అంటే వైద్యం, వ్యాపారం లాంటి వీసాలన్నమాట. ఇక మూడో వరుసలో ఉన్న దేశాలకు తమ దేశ భద్రత తనిఖీలను మెరుగుపరుచుకునేందుకు రెండు నెలలపాటు సమయం కేటాయిస్తూనే చర్యలు చేపట్టకుంటే పాక్​, భూటాన్​ సహా 26 దేశాల వీసాలను పాక్షికంగా నిలిపివేయనున్నారు. అయితే ఈ దేశాల లిస్టులో భారత్​ లేదని కూడా అధికారులు వెల్లడించారు. కాగా ఈ సమాచారం తెలిసినప్పటి నుంచి అయ్య బాబోయ్​ బతికించాడురో ట్రంప్​ అని భారతీయులు సంతోషిస్తున్నారు. మరోవైపు పై వరుసలో పేర్కొన్న దేశాలు మాత్రం ‘చంపితివిరో ట్రంప్​’ అని తలలు పట్టుకుంటున్నారు. ఏది ఏమైనా ఈ నిర్ణయం గనుక తీసుకుంటే ఆయా దేశాలకే కాదు.. అమెరికాకు కూడా భారీ నష్టం తప్పకపోవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. 2017 అధ్యక్షుడిగా ఉన్న సమయంలోనూ ట్రంప్​ ఏడు ముస్లిం దేశాలపై ప్రయాణ నిషేధాన్ని విధించారు. ఈ నిర్ణయాన్ని సాక్షాత్తూ అమెరికా సుప్రీంకోర్టు సమర్థించడం గమనార్హం. ప్రస్తుతం ట్రంప్​ ఏం నిర్ణయం తీసుకుంటాడో అనేది ఉత్కంఠగా మారింది.