ఫోగట్ పై అనర్హత
Disqualification on Phogat
వంద గ్రాముల బరువు ఎక్కువే కారణం
తీవ్ర నిరాశలో అభిమానులు
నిరసన వ్యక్తం చేసిన ఐవోఏ
దేశం మీ వెంటే..అధైర్యపడొదన్న ప్రధాని మోదీ
ఐవోఏ పీటీ ఉషతో వివరాల సేకరణ
పారిస్: పారిస్ ఒలింపిక్స్ లో రెజ్లర్ వినేష్ ఫోగట్ పసిడి విజయానికి బరువు రూపంలో ఆటంకాలు ఎదురయ్యాయి. ఆమె 50 కేజీల విభాగంలో బుధవారం పోటీ పడనుండగా బుధవారం ఉదయం వెయిట్ పరీక్షలో ఆమె వంద గ్రాములు బరువు ఎక్కువగా ఉండడంతో అంతర్జాతీయ ఒలింపిక్ నిబంధనల ప్రకారం వినేష్ ను అనర్హురాలిగా ప్రకటించింది. ఈ నిర్ణయంతో ఒక్కసారిగా భారత్ అవాక్కయ్యింది. అభిమానులు, ప్రభుత్వం అంతర్జాతీయ ఒలింపిక్ నిర్ణయాన్ని తప్పుబడుతున్నారు.
మంగళవారం ఫోగట్ సెమీ ఫైనల్స్ లో గెలిచింది. ఫైనల్ లో అమెరికా రెజ్లర్ తో బుధవారం రాత్రి 11 గంటలకు వీరిద్దరి మధ్య పోటీ జరగనుంది. వినేశ్ ఫొగాట్ విషయంలో అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేసేందుకు ఐవోఏ సిద్ధమైంది.
మంగళవారం రాత్రి వినేష్ బరువు 52 కేజీలు..
మంగళవారం రాత్రి వినేష్ బరువును చూసుకున్న అధికారులు 52 కిలోలుగా గుర్తించారు. దీంతో సైకిల్ తొక్కడం, స్కిప్పింగ్ తదితర వాటి ద్వారా బరువు తగ్గించుకునేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. గగన్ నారంగ్, దిన్షా పార్దివాలా, ఆమె భర్త, ఫిజియో, వైద్య సిబ్బంది, ఐవోఏ అధికారులు ఆమె బరువును తగ్గించడానికి రాత్రంతా శ్రమించారు. అయినా ఆమె 50 కేజీల కంటే వంద గ్రాముల బరువు ఎక్కువగా ఉన్నట్లు సమాచారం. ఇంతకంటే ఎక్కువగా బరువు తగ్గించేందుకు ఉన్నపళంగా ప్రయత్నిస్తే ఆమె ప్రాణానికి ప్రమాదం వాటిల్లే ప్రమాదం ఉందని ఐవోఏ వెంట వెళ్లిన వైద్యుడు పార్దివాలా చెప్పారు.
అనారోగ్యంతో ఆసుపత్రిలో ఫోగట్..
ఒలింపిక్స్ లో అనర్హత నిర్ణయాన్ని తెలుసుకున్న వెంటనే రెజ్లర్ వినేష్ ఫోగట్ ఆరోగ్యంపై ప్రభావం పడింది. ఆమె తీవ్ర డీహైడ్రేషన్ కు గురైంది. ఆమెను వెంటనే స్థానికంగా ఆసుపత్రిలో చేర్చినట్లుగా భారత ఒలింపిక్ సంఘం తెలిపింది.
వినేష్ ఫోగట్ డిస్ క్వాలిఫైపై ప్రధాని మోదీ విచారం..
వినేష్ ఫోగట్ చాంపియన్ లకే చాంపియన్ అని విశ్వసిస్తున్నామని ఒలింపిక్ నిర్ణయం చాలా బాధకరమైందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ప్రతీ భారతీయుడికి ఫోగట్ స్ఫూర్తిగా నిలుస్తారని ఆమె దేశానికి గర్వకారణమని ప్రధాని తెలిపారు. సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొందామన్నారు. ఎలాంటి నిరాశకు లోను కావద్దని ప్రధాని పేర్కొన్నారు. దేశమంతా వినేష్ ఫోగట్ వెంట ఉంటుందని ప్రధాని సామాజిక మాధ్యమంలో ట్వీట్ చేశారు.
ఒలింపిక్ సంఘంతో ప్రధాని..
మరోవైపు భారత ఒలింపిక్ సంఘం అధ్యక్షురాలు పీటీ ఉషతో కూడా ఈ విషయంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫోన్ ద్వారా చర్చించారు. పూర్తి సమాచారం తీసుకున్నారు. వినేష్ విషయంలో ప్రత్యామ్నాయమార్గాలపై అన్వేషించాలన్నారు. అనర్హత వేటు వేయడంపై భారత్ నిరసనను వ్యక్తం చేయాలని పీటీ ఉషకు ప్రధాని మోదీ సూచించారు.
పార్లమెంట్ లో దుమారం..
మరోవైపు వినేష్ ఫోగట్ ను అంతర్జాతీయ ఒలింపిక్ లో అనర్హురాలిగా ప్రకటించడంపై పార్లమెంట్ సమావేశాల్లోనూ ప్రతిపక్షాలు తీవ్ర నిరసనను వ్యక్తం చేశాయి. పసిడికి ఇంత దగ్గరగా వెళ్లిన ఫోగట్ పై కేంద్ర ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటాయని ప్రశ్నించాయి. ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశాయి.
ఎంపీ కరణ్ భూషణ్..
పారిస్ ఒలింపిక్స్ నుంచి భారత రెజ్లర్ వినేశ్ ఫోగట్ అనర్హత వేటు వేయడంపై రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా వైస్ ప్రెసిడెంట్, బీజేపీ ఎంపీ కరణ్ భూషణ్ సింగ్ స్పందించారు. ఐవోఏ ఫెడరేషన్ చెప్పిన వివరాలను పరిశీలిస్తామన్నారు. ఫెడరేషన్ తన అనర్హతపై అప్పీల్ చేసుకునే అవకాశం కోసం మాట్లాడుతున్నట్లు తెలిపారు.
కాంగ్రెస్ పార్టీ నాయకులు..
వినేష్ ఫోగట్ అనర్హతపై కాంగ్రెస్ నాయకులు స్పందించారు. ఆమె గోల్డ్ మెడల్ గెలుస్తుందని మేము ఎదురుచూస్తున్నామని అన్నారు. ఈ వార్తతో దేశం మొత్తం దిగ్భ్రాంతి చెందిందని తెలిపారు. కష్టపడి ఫైనల్స్‌కు చేరుకుంటే ఈ నిర్ణయం తమను షాక్ కు గురి చేసిందన్నారు. కనీసం రజత పతకానికైనా పరిగణనలోకి తీసుకునేలా చర్యలు తీసుకోవాలని, ఈ విషయాన్ని భారత ఒలింపిక్ సంఘం ఒలింపిక్ సంఘం ముందు ఉంచాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.