మేళాకు పోటెత్తుతున్న భక్తులు
Devotees flocking to the fair
మౌనీ అమావాస్యకు 10కోట్లమంది హాజరవుతారని అంచనా?!
యుద్ధ ప్రాతిపదికన ఏర్పాట్లపై అధికారులతో సీఎం యోగి సమావేశం
జనవరి 30 వరకు రైళ్లు, విమానాలు, బస్సులు ఫుల్
పుణ్యస్నానాలు ప్రముఖులు
లక్నో: కుంభమేళా త్రివేణి సంగమంలో స్నానం ఆచరించేందుకు దేశ, విదేశాల నుంచి భక్తులు పోటెత్తుతున్నారు. కేవలం మూడు రోజుల్లోనే ఆరుకోట్ల మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. గురువారం మధ్యాహ్నం వరకు 20 లక్షల మంది పుణ్యస్నానాలు ఆచరించినట్లు అధికారులు వివరించారు. మరోవైపు జనవరి 29 మౌనీ అమావాస్య రోజున కూడా భారీ సంఖ్యలో (10కోట్ల వరకు) భక్తులు వస్తారని భావిస్తున్నారు. మరోవైపు 3వేల రైళ్లతోపాటు, బస్సులు, విమానాలు అన్ని టిక్కెట్లు జనవరి 30 వరకు బుక్ అయిపోయాయని అధికార యంత్రాంగం స్పష్టం చేసింది.
మౌనీ అమావాస్య ఏర్పాట్లపై సీఎం ఆదిత్యనాథ్ యోగి గురువారం అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఏర్పాట్లను మరింత పెద్ద ఎత్తున చేపట్టాలని ఆ ఒక్కరోజునే 10కోట్లమంది భక్తులు హాజరయ్యే అవకాశం ఉందని భావిస్తున్నట్లు తెలిపారు. దీంతో భద్రత కోసం కేంద్ర ప్రభుత్వం ఆర్మీని కూడా రంగంలోకి దించుతుందన్నారు. పుకార్లు పుట్టించేవారి పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. వారిపై ఉక్కుపాదం మోపాలన్నారు. పుణ్యస్నానాల కోసం వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తవద్దని ఇది ప్రతిష్ఠతో కూడిన అంశమని సీఎం యోగి అధికారులకు స్పష్టం చేశారు. అన్ని రవాణా సదుపాయాలు నిండుకున్నందున రైల్వేశాఖతో మాట్లాడి ఆ ఒక్కరోజులో మరిన్ని ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసేలా చూడాలని ఆదేశించారు. అలాగే బస్సుల రాకపోకలను మరింత పెంచాలన్నారు. ఇవేగాకుండా ఇతర మార్గాలపై వచ్చే భక్తులకు కూడా రవాణా విషయంలో ఎలాంటి అసౌకర్యం కలగనీయకుండా చూడాలన్నారు. తాగునీరు, పరిశుభ్రత, ఘాట్ లలో మరింత పటిష్టమైన బారికేడింగ్, మరుగుదొడ్లు, టెంట్ ల వద్ద స్వచ్ఛత లాంటి విషయాలను గంటగంటకు సమీక్షించాలని రిపోర్టు చేయాలన్నారు. సౌకర్యాలలో లోటు ఉండరాదన్నారు.
మరోవైపు సాధారణ రోజుల్లో ప్రయాగ్ రాజ్ కు విమాన ప్రయాణానికి ఢిల్లీ నుంచి రూ. 3వేలు ఉండగా, ప్రస్తుతం ఆ ధర కాస్త రూ. 18వరకు కొనసాగుతుంది. ఏకంగా విమానయాన సంస్థలు ఆరు రెట్ల ధరలను పెంచేశాయి. అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ వాహనాలు బిజీగా మారడంతో బైక్ రైడర్లకు డిమాండ్ పెరిగింది. దీంతో కేవలం మూడు కిలోమీటర్ల దూరానికే రూ. 3వేలు వసూలు చేస్తున్న 8మంది రైడర్లను పోలీసులు అరెస్టు చేశారు.
మరోవైపు మహాకుంభమేళాకు ఇప్పటికే 21 దేశాల నుంచి విచ్చేసిన భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. వీరిలో క్రీడాకారులు, రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు తదితరులున్నారు. జనవరి 24న బాబా బాగేశ్వర్ ధామ్ కు చెందిన పండిట్ ధీరేంద్ర కృష్ణశాస్ర్తి హాజరుకానున్నారు. జనవరి 16 నుంచి ఫిబ్రవరి 24 వరకు మహాకుంభంలో ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు. తొలిరోజు బాలీవుడ్ సింగర్ శంకర్ మహాదేవన్ కుంభమేళాకు విచ్చేసి ప్రదర్శన ఇవ్వనున్నారు. ఆధ్యాత్మిక గురువు, ఇషా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు సద్గురు జగ్గీ వాసుదేవ్ ప్రయాగ్ రాజ్ కు విచ్చేశారు. ప్రభుత్వ ఏర్పాట్లపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఇంతపెద్ద కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించడం పట్ల సీఎం యోగికి సద్గురు ధన్యవాదాలు తెలిపారు.
అంతర్జాతీయ మీడియా దృష్టి అంతా ప్రయాగ్ రాజ్ లో జరుగుతున్న కుంభమేళా గురించిన ప్రముఖ వ్యాసాలను ప్రచురించాయి. సౌదీ, పాక్, లండన్, యూఎఇ, అమెరికా, యూకె, పయోనీర్, టైమ్స్, జియో, బీబీసీ లాంటి ఆయాదేశాల్లో ఉన్న సంస్థలు కుంభమేళా విశేషాలను ప్రముఖంగా ప్రచురిస్తున్నాయి. ప్రస్తుతం గూగూల్ పై అత్యధికంగా కుంభమేళాను శోధిస్తున్న దేశంగా పాక్ నిలవడం గమనార్హం.