హిండెన్ బర్గ్ దుకాణం బంద్?!
Hindenburg shop closed?!
నాథన్ కు తప్పని చిక్కులు
అవన్నీ కేవలం ఆరోపణలేనా?
న్యాయపరంగా చర్యలతో మూసివేత దిశగా అడుగులు
నోరుమెదపని భారత్ లోని విపక్షాలు
నా తెలంగాణ, సెంట్రల్ డెస్క్: తమ ఆర్థిక ప్రాపకాన్ని పెంచుకునేందుకు ప్రయత్నిస్తూ పలుదేశాల్లోని సంస్థలు, ప్రభుత్వాలపై హిండెన్ బర్గ్ చేస్తున్న ఆరోపణలకు పూర్తిగా చెక్ పడనుంది. త్వరలో హిండెన్ బర్గ్ దుకాణం మూసుకోనుంది. అమెరికాలో జో బైడెన్ ప్రభుత్వానికి నూకలు చెల్లడమే ఈ సంస్థ వ్యవస్థాపకుడు నాథన్ అండర్సన్ కు చిక్కులు తెచ్చిపెట్టినట్లుగా భావిస్తున్నారు.
ఇన్ని రోజులు జో బైడెన్ ప్రభుత్వం అండతోనే ఆయా దేశాల పెద్ద పెద్ద సంస్థల ఆర్థిక వ్యవహారాలపై లేనిపోని ఆరోపణలు సృష్టిస్తూ వారి సంపద కరిగిపోయేందుకు కారణభూతంగా నిలిచారు. అదీ గాక భారత్ కు చెందిన అదానీ ఆరోపణలపై ఇప్పటికే సెబీ ఈ సంస్థకు పలు నోటీసులు జారీ చేసింది. ఈ విషయంలో సీరియస్ గా వ్యవహరించనున్నట్లు స్పష్టం చేసింది. భారత్ ఆరోపణలకు మద్ధతుగా అమెరికా చట్టసభ కూడా నిలిచింది. ఆ దేశ జ్యూడిషియరీ కమిటీ సభ్యులు హిండెన్ బర్గ్ కు సంబంధించి న్యాయశాఖ దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు.
దీంతో ఈ సంస్థ వ్యవస్థాపకుడు నాథన్ కు విచారణ భయం చుట్టుముట్టింది. తన దుకాణం మూసుకోవడమే అన్నింటికి పరిష్కార మార్గంగా ఆయనకు కనిపిస్తున్నట్లుగా సంస్థ వర్గాల్లో గుసగుసలు బయటపడుతున్నాయి. అనేకమంది నాథన్ సంస్థపై కేసులు నమోదు చేయాలని తాము నష్టపోయిన మొత్తం వారి నుంచే రికవరీ చేయాలని, ఆరోపణలకు స్పష్టమైన ఆధారాలను సమర్పించకుంటే ఆ సంస్థ వ్యవస్థాపకుడిని అరెస్టు చేయాలని ఇలా అనేక రకాల ఫిర్యాదులను చేశారు. ఆయా సంస్థల నివేదికలను పరిశోధన చేసి నివేదికలు తయారు చేసి వారికి వ్యతిరేకంగా ఉన్న వారికి ఆ నివేదికలు అమ్ముకోవడమే నాథన్ హిండెన్ బర్గ్ పనిగా పెట్టుకుంది. ఇన్నిరోజులకు నాథన్ పాపం పండింది.
కాగా సంస్థ మూసివేతపై భారత్ లోని బీజేపీ అధికార ప్రతినిధి షహజాద్ పూనావాలా మాట్లాడుతూ.. భారత ఆర్థిక వ్యవస్థను కొన్ని అంతర్గత దేశ దుష్టశక్తులతో కలిసి నాశనం చేయాలనుకున్నా వారి ఆశలు నెరవేరలేదన్నారు. వ్యక్తిగత లాభాలకోసం వెంపర్లాడుతూ ఆ సంస్థ తనకాళ్లను గొడ్డలితో తానే నరికివేసుకుందన్నారు. ఈ సంస్థ ఇచ్చిన నివేదికను భారత్ లోని కొన్ని పార్టీలు తమవిగా, నిజమైన నివేదికలుగా చెప్పుకోవటం సిగ్గుచేటన్నారు. ఇప్పుడు హిండెన్ బర్గ్ దుకాణం మూసివేత వార్తలపై నోరుమెదపరేమని నిలదీశారు.