రక్షణ బడ్జెట్​.. శత్రుమూకలకు దడ

Defense budget

Feb 2, 2025 - 20:20
 0
రక్షణ బడ్జెట్​.. శత్రుమూకలకు దడ

ఏటేటా పెరుగుతూ ప్రపంచంలో నాలుగో స్థానానికి
తొమ్మిది దేశాలతో సరిహద్దు పంచుకుంటున్న భారత్​
15వేల కిలోమీటర్ల సరిహద్దుపై నిరంతర నిఘాకు భారీ ఖర్చు 

నా తెలంగాణ, సెంట్రల్​ డెస్క్​: ఓ వైపు శత్రుమూకల భయం, మరోవైపు దేశ సరిహద్దుల వెంట చొరబాట్లు, ఇంకోవైపు భారత్​ లోకి అక్రమ మాదక ద్రవ్యాలు సరఫరా, స్మగ్లింగ్​, ఆయుధాల స్మగ్లింగ్​ వెరసీ భారత ఆర్థిక వ్యవస్థను, దేశాన్ని విచ్ఛిన్నం చేసేందుకు అనేక ప్రయత్నాలే జరుగుతున్నా గత పదేళ్లుగా ప్రధాని మోదీ నేతృత్వంలోని రక్షణ శాఖకు కేటాయిస్తున్నట్లు బడ్జెట్​ అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంటూ, రక్షణలో కీలకంగా మారింది. విదేశాలు సైతం నివ్వెరపోయేలా ఇంతపెద్ద సరిహద్దును సురక్షితంగా కాపాడడంలో మోదీ ప్రభుత్వం కీలక భూమిక పోషిస్తూ ప్రతీ బడ్జెట్​ లో ఈ రంగానికి నిధుల పరంపరను పెంచుతూ కొనసాగిస్తుంది. 

కీలకమైన కారిడార్లు..
భారతదేశ సరిహద్దుల పొడవు మొత్తంగా 15,106.7 కి.మీటర్లు. ఇందులో బంగ్లాదేశ్​ తో 4,096.7 కి.మీ, చైనాతో 3,488 కి.మీ, పాకిస్థాన్​ తో 3,323 కి.మీ, నేపాల్​ 1,751 కి.మీ, మయన్మార్​ 1,643 కి.మీ, భూటాన్​ 699, ఆఫ్ఘాన్​ 106 కి.మీ. సరిహద్దును కలిగి ఉంది. ఇంతపెద్ద యెత్తున సరిహద్దును కలిగి ఉండడంతో దేశ రక్షణలో ఈ ప్రాంతాల్లో భద్రతకు అత్యంత ప్రాధాన్యతనీయాల్సిన అవసరం ఏర్పడింది. సరిహద్దులో పర్వతాలు, నదులు, కీలకమైన కారిడార్లు ఉన్నాయి.  ఇవే గాక మాల్దీవులు, శ్రీలంక దేశాలతో ఉన్న సరిహద్దులు సముద్రతీరంలో ఉన్నాయి. మొత్తం 9 దేశాలతో భారత్​ సరిహద్దును కలిగి ఉంది. ఈ నేపథ్యంలో రక్షణ శాఖకు అత్యంత ప్రాధాన్యత దక్కాల్సిన అవసరం ఉంది. 

స్థూల దేశీయోత్పత్తిలో 1.91 శాతం..
2025–26 బడ్జెట్​ లో రూ. 6.81 లక్షల కోట్లను కేంద్రం రక్షణ శాఖకు కేటాయించింది. ఇది గత సంవత్సరంతో పోలిస్తే 9.5 శాతం పెరుగుదలను సూచిస్తుంది. 2024–25లో రక్షణ శాఖకు రూ. 6.21 లక్షల కోట్లు కేటాయించారు. 2013--–14లో రక్షణ శాఖ బడ్జెట్​ కేవలం రూ. 2,53,346 కోట్లుగా కేటాయించారు. ప్రధాని నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చాక క్రమేణా రక్షణ శాఖలో స్వావలంభన దిశగా ముందుకు సాగుతూ మరోవైపు దేశ పటిష్ఠతగా కృషి చేస్తున్నారు. ఇతర శాఖల కంటే రక్షణ శాఖకు అత్యధిక ప్రాధాన్యతనిస్తూ 13 శాతం ఎక్కువ బడ్జెట్​ ను కేటాయించారు. ఇది స్థూల దేశీయోత్పత్తిలో 1.91 శాతం. దీంతో యుద్ధ విమానాలు, ఆయుధాలు, యుద్ధ నౌకలు, సైనిక పరికరాలు, సరిహద్దులో మౌలిక సదుపాయాలు, సైనికుల రక్షణ కోసం వినియోగిస్తున్నారు. 2023–24లో 5.94 లక్షల కోట్లను కేటాయించారు. అంతక్రితం ఏడాదితో పోలిస్తే ఈ సమయంలో కూడా 4.79 శాతం ఎక్కువ నిధులను కేటాయించారు. 

రక్షణ శాఖ బడ్జెట్​ లో అమెరికా ఫస్ట్​..
ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే రక్షణ శాఖకు అత్యధికంగా బడ్జెట్​ కేటాయిస్తున్న దేశాల్లో అమెరికా 916 శాతం, చైనా 296 శాతం, రష్​యా 109 శాతం, భారత్​ 83.6 శాతంతో నాలుగో వరుసలో ఉంది. ఆ తరువాతి స్థానాల్లో సౌదీ 75.8 శాతం, యూనైటెడ్​ కింగ్​ డమ్​ 74.9 శాతం, జర్మనీ 66.8 శాతం, ఉక్రెయిన్​ 64.8 శాతం, ఫ్​రాన్స్​ 61.3 శాతం, జపాన్​ 50.2 శాతం, ఉత్తర కొరియా 47.9 శాతంతో తరువాతి స్థానాల్లో ఉన్నాయి. భారత్​ కేటాయించిన బడ్జెట్​ లో అత్యధికంగా వేతనాలు, రోజువారీ వ్యయాలకు రూ.4,88,822 కోట్లు ఖర్చు చేయనుండగా, ఆయుధాల కొనుగోళ్లు, అభివృద్ధికి1,92,387 కోట్లు కేటాయించారు. అదే సమయంలో దేశీయ ఆయుధ తయారీ రంగానికి కూడా ప్రాధాన్యతనిచ్చారు. సరిహద్దుల్లో రోడ్ల నిర్మాణానికి రూ. 7,146.5 కోట్లను కేటాయించారు.