ఉభయ సభల్లో గందరగోళం
Confusion in both houses

రాష్ర్టపతి ధన్యవాద తీర్మానంపై చర్చ
విపక్షాల వాకౌట్
స్పీకర్ ఓం బిర్లా ఆగ్రహం
నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: బడ్జెట్ సమావేశాల మూడో రోజైన సోమవారం మహాకుంభ్‌లో తొక్కిసలాటలో మరణించిన వారిపై విపక్షాలు లోక్‌సభ, రాజ్యసభల్లో గందరగోళం సృష్టించాయి. తొక్కిసలాట కారణంగా మరణించిన వారి సరైన గణాంకాలను ప్రభుత్వం విడుదల చేయాలని ప్రతిపక్ష ఎంపీలు స్పీకర్‌కు వాయిదా నోటీసులను ఇచ్చారు. రాష్ట్రపతి ప్రసంగం ధన్యవాద తీర్మానంపై పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో మూడో రోజు చర్చ జరిగింది. బీజేపీ ఎంపీ రాంవీర్ సింగ్ బిధూరి ధన్యవాద తీర్మానంపై చర్చను ప్రారంభించగా విపక్షాలు నినాదాలు చేశారు. నినాదాలు చేస్తున్న విపక్షాలను ఉద్దేశిస్తూ స్పీకర్ ఓం బిర్లా మాట్లాడుతూ- రాష్ట్రపతి కూడా తన ప్రసంగంలో మహాకుంభ్ గురించి ప్రస్తావించారు. ఇది ఇప్పుడు ప్రశ్నోత్తరాల సమయం, బడ్జెట్ పై చర్చించే సమయం కాబట్టి ఈ సమయంలో మరే ఇతర అంశం చర్చించమన్నారు. ఇతర అంశాలపై చర్చించేందుకు ప్రత్యేక సమయం కేటాయిస్తామని చెప్పారు. అనంతరం కూడా ఎంపీలు నినాదాలను కొనసాగించగా, స్పీకర్ ఓం బిర్లా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం విపక్షాలు ఇరుసభల నుంచి వాకౌట్ చేశాయి.
ఎంపీ బిధూరి..
బీజేపీ ఎంపీ రాంవీర్ సింగ్ బిధూరి ధన్యవాద తీర్మానంపై మాట్లాడుతూ.. ఇది భారతదేశ స్వాతంత్ర్యానికి స్వర్ణయుగమన్నారు. రూ.12 లక్షల వరకు ఆదాయాన్ని పన్ను రహితంగా చేయాలనే నిర్ణయాన్ని వివరిస్తూ.. ఏ ప్రభుత్వం ఇంత పెద్ద సడలింపు ఇవ్వలేదన్నారు. పదేళ్లుగా ఢిల్లీలో కేజ్రీవాల్ ప్రభుత్వం నీరు, రేషన్ కార్డులు, ఆయుష్మాన్ లాంటి బృహత్తరమైన కేంద్ర పథకాలను ప్రజలదరికి చేరకుండా అడ్డుకుందని మండిపడ్డారు. ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన నాయకుడు ప్రధాని మోదీ అని బిధూరి స్పష్టం చేశారు.
కేంద్రమంత్రి కిరణ్ రిజిజు
ప్రతిపక్షాల గొడవపై కేంద్రమంత్రి కిరణ్ రిజిజు మాట్లాడుతూ ఆందోళన సరైంది కాదన్నారు. ధన్యవాద తీర్మానంపై చర్చ, బడ్జెట్ ప్రశ్నోత్తరాల అనంతరం స్పీకర్ సమయం కేటాయిస్తామని చెబుతున్నా ఎందుకు రాద్ధాంతం సృష్టిస్తున్నారని మండిపడ్డారు. ఒకవేళ మీరు ప్రభుత్వాన్ని ప్రశ్నలు అడగకుంటే ప్రజలే మిమ్మల్ని ప్రశ్నలు అడుగుతారని గుర్తుంచుకోవాలన్నారు.
ఎంపి నిషికాంత్ దూబే..
బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే మాట్లాడుతూ.. తాను 10 ప్రశ్నలు లేవనెత్తాలనుకుంటున్నానని అన్నారు. ప్రతిపక్షాలు తనను అడ్డుకుంటున్నాయని ఆరోపించారు. గాంధీ కుటుంబానికి, జార్జ్ సోరోస్‌కు మధ్య ఉన్న సంబంధాలను నేను బయటపెడతానని అన్నారు. బంగ్లాదేశ్ కుట్రలో భాగస్వామ్యం ఉన్న వారి దృశ్యాలను త్వరలోనే బయటపెట్టి వారి చరిత్రను ఎండగడతానన్నారు. దేశ విచ్ఛిన్నశక్తులను ప్రజలముందుకు తీసుకువస్తానన్నారు.
కాగా రష్యా ప్రతినిధి డూమా చైర్మన్ వ్యాచెస్లావ్ వోలోడిన్ నేతృత్వంలోని పార్లమెంటరీ బృందం భారత పార్లమెంట్ కార్యకలాపాలను వీక్షించేందుకు వచ్చారు.